varadapuram suryanayarayana
-
ఇష్టానుసారం ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కేతిరెడ్డి
-
అనంతపురం టీడీపీలో భగ్గుమంటున్న వర్గ విభేదాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. కానీ నేడు వర్గవిభేదాలు, అసమ్మతులు, అసంతృప్తులకు పెట్టనికోట. నియోజకవర్గ స్థాయి నాయకులు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ సవాళ్లు విసురుకుంటుంటే.. ఉన్న కొద్దిమంది కార్యకర్తలూ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నాయకులు సైతం అండగా లేకపోవడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ద్వితీయ శ్రేణి నాయకులంతా సమావేశమయ్యారు. ఇది సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అయింది. దీంతో పల్లె వారిని బుజ్జగించాల్సి వచ్చింది. ఇప్పుడు పరిటాల శ్రీరాం వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ధర్మవరంలో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వరదాపురం సూరి కొన్ని పరిస్థితుల దృష్ట్యా మరో పార్టీలోకి వెళ్లారు. దీంతో పరిటాల శ్రీరాంను ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్గా నియమించారు. అయితే.. వరదాపురం సూరి తిరిగి పార్టీలోకి వస్తున్నారనే సంకేతాలు రావడంతో శ్రీరాం ఫైరయ్యారు. ‘పార్టీలోకి ఎవరొచ్చినా కండువా నేనే వేయాలి. పదవులూ నేనే ఇవ్వాలి. అయినా చెంచాలకు సీట్లొస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీడీపీలోని పరిటాల వ్యతిరేకులు దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇక హిందూపురంలో నెగ్గిన బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు దూరమయ్యారు. ఆయన పేరు చెప్పి మరో వ్యక్తి పెత్తనం చెలాయిస్తుండటంతో కిందిస్థాయి నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. చదవండి: (పారిశ్రామిక విప్లవం) కాలవకు సెగ.. రాయదుర్గం నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుకు సొంత పార్టీ శ్రేణుల నుంచే సెగ తగులుతోంది. మంత్రి ఉన్నప్పుడు చేసిందేమీ లేదంటూ కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అనంతపురంలో నివాసముంటున్న ఆయన నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారని వారు వాపోతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రస్తుత ఇన్చార్జ్ ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి వర్గీయుల మధ్య పోరు నడుస్తోంది. ఏవర్గంలో ఉండాలో తెలియక కార్యకర్తలు సతమతమవుతున్నారు. అనంతపురం అర్బన్‌లో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభాకర్ చౌదరిపై అసమ్మతులు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. పెనుకొండ నగర పంచాయతీలో భారీ ఓటమి తర్వాత బీకే పార్థసారథి పరిస్థితి దయనీయంగా మారింది. ఆయన్ను స్వయాన చంద్రబాబు పిలిపించుకుని గట్టిగా మందలించిన విషయం తెలిసిందే. శింగనమల, మడకశిర నియోజకవర్గాల్లోనూ పరిస్థితి ఏమాత్రమూ బాగోలేదని టీడీపీ నేతలే చెబుతున్నారు. చదవండి: (సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాలకు ప్రత్యేక వ్యవస్థ) గౌరవ సభలా? విందు భోజనాలా? గౌరవ సభల పేరిట టీడీపీ నిర్వహిస్తోన్న కార్యక్రమాలు అభాసుపాలవుతున్నాయి. శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి మాంసాహారం వడ్డిస్తున్న తీరు విందు భోజనాలను తలపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో జనం రాకపోవడంతో డబ్బులిచ్చి మరీ తీసుకెళుతున్నారు. ఈ సభలు ఎందుకు పెడుతున్నారో వాటికి వచ్చే వారికి కూడా తెలియడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
నవ్వు‘తారు’.. సూరీ!
సూరి. ఈ పేరు చర్చకు వస్తే మొదటగా గుర్తొచ్చేది వెన్నుపోటు. గత ప్రభుత్వంలో ఐదేళ్లు వెంటనడిచిన ‘తమ్ముళ్ల’ను గాలికొదిలేసి సొంత ‘వ్యాపారం’ చూసుకునేందుకు పార్టీ ఫిరాయించిన నేతగానే ఇప్పుడు ధర్మవరం చూస్తోంది. అధికారంలో ఉండగా దక్కించుకొన్న కాంట్రాక్టుల్లో డొల్లతనం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో బతుకుజీవుడా అని ‘కమలం’ పంచన చేరడం తెలిసిందే. ఈ కోవలోనే ఆయన చేపడుతున్న అనంతపురం–కదిరి రహదారి పనులను ఒక్కసారి పరిశీలిస్తే.. ఆ నల్లని రోడ్డు వెనుక దాగిన అవినీతి ఔరా అనిపిస్తుంది. సాక్షి, అనంతపురం: నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ చేపడుతున్న రోడ్డు పనుల్లో నాణ్యత నవ్వులపాలవుతోంది. ఎక్కడా నిబంధనలను పాటిస్తున్న దాఖలాలు కనిపించవు. రోడ్డు పూర్తి చేస్తున్నారనే మాటే కానీ.. నాలుగు కాలాల పాటు నిలుస్తుందనే నమ్మకం కనిపించదు. అనంతపురం–కదిరి రహదారి పనులే ఆ సంస్థ తాజా అవినీతికి నిదర్శనం. రోడ్డు పనుల్లో ఎర్రమట్టి, గులకరాళ్లతో కూడిన మొరుసును కాకుండా నల్లమట్టి, సుద్దను వినియోగిస్తుండటం చూస్తే ఈ రోడ్డు ఎంతకాలం నిలుస్తుందో ఇట్టే అర్థమవుతుంది. మొరుసు కంటే నల్లమట్టి, సుద్ద తక్కువ ధరకు లభిస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే సూరి నిబంధనలకు నీళ్లొదిలారు. ఈ కారణంగా రోడ్డు పక్కన వాహనం వెళితే.. ప్రధానంగా వర్షాకాలంలో దిగబడిపోయి చుక్కలు చూడాల్సిందే. ఇకపోతే అధికారికంగా వాహనాల రాకపోకలు ప్రారంభం కాకముందే రోడ్డు తేలిపోయింది. నాసిరకంగా కంకర తేలి దర్శనమిస్తోంది. ఎక్కడికక్కడ ప్యాచులు వేయడంతో పాటు.. పనుల్లో వినియోగిస్తున్న కంకర కూడా పొడిగా ఉండటం నాణ్యతను ప్రశ్నార్థకం చేస్తోంది. తేలిపోతున్న నాణ్యత...! వాస్తవానికి జాతీయ రహదారి పనులను ఎంతో నాణ్యతగా చేపట్టాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా అప్పుడే రోడ్డు కాస్తా కంకర తేలి నాసిరకంగా దర్శనమిస్తోంది. అనంతపురం నుంచి కదిరి వరకు వెళ్లే మార్గంలో 76 కిలోమీటరు నుంచి 99.92 కిలోమీటరు వరకు మొత్తం 22.92 కిలోమీటర్ల పొడవున ఈ పనులను సూరికి చెందిన నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ సంస్థ చేపడుతోంది. ఇప్పటివరకు సుమారు 18 కిలోమీటర్ల మేర పనులను కంపెనీ పూర్తి చేసింది. మరో 5 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే సంస్థకు రూ.75 కోట్ల మేర బిల్లులను కూడా చెల్లించేశారు. ఈ రోడ్డు పనుల్లో సదరు కంపెనీ వాడుతున్న సుద్దపొడి కూడా ఉచితంగా దొరికేదే అనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి మొరుసును వాడితే తారు రోడ్డు పక్కనే ఉండే రోడ్డు కూడా గట్టిపడుతుంది. దీంతో ఏదైనా వాహనం దీనిపై వెళితే రోడ్డు కుంగిపోయే అవకాశం ఉండదు. అందుకే మొరుసును వాడాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ మాత్రం ఉచితంగా దొరికే సుద్దపొడితో పాటు నల్లమట్టిని కలిపి వాడుతున్నారు. నిర్మాణ వ్యయం తగ్గించుకుని భారీగా లాభాలు ఆర్జించేందుకు సదరు సంస్థ చేస్తున్న వ్యవహారంతో వాహనదారులు ఇబ్బందులు పడాల్సి రానుంది. రోడ్డు పనులకు వినియోగిస్తున్న నల్లమట్టి, సుద్ద పనులన్నీ నాసిరకమే.. వాస్తవానికి ధర్మవరం నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏ పని మంజూరైనా.. ఏ సంస్థకు కాంట్రాక్టు దక్కినప్పటికీ పనులు మాత్రం సదరు సూరీ కంపెనీయే చేపట్టాలి. ఈ మేరకు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు కూడా పనులను సబ్‌కాంట్రాక్టు కింద వీరికి అప్పగించాల్సిందే. లేనిపక్షంలో సదరు కాంట్రాక్టు సంస్థ పనులు చేసే పరిస్థితి లేకుండా ఉన్న దుస్థితి. కొద్దిరోజుల క్రితం ఇదే ధర్మవరం మండలంలోని దర్శనమల ఉన్నత పాఠశాలలో రూ.20 లక్షలతో నిర్మించిన ప్రహరీగోడ కేవలం గాలికే కుప్పకూలిపోయింది. కనీసం సిమెంటు బెడ్ లేకుండా నాసిరకం ఇటుకలు పేర్చుకుంటూ పోవడంతో సదరు సూరి అనుచరులు నిర్మించిన గోడ గాలికే కుప్పకూలింది. ఇదే తరహాలో నియోజకవర్గంలో సూరి, ఆయన అనుచరులు చేపట్టిన పనులన్నీ నాసిరకంగా ఉంటూ 50 శాతం మేర నిధులను దోచుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ధర్మవరం నియోజకవర్గంలో చేపట్టిన పనులన్నీ నాసిరకంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పనులన్నింటిపైనా విచారణ చేయాలంటూ రాష్ట్ర విజిలెన్స్‌తో పాటు కేంద్ర విజిలెన్స్‌కు కూడా అనేక ఫిర్యాదులు వెళ్లాయి. వీటిపై విచారణ చేస్తే అనేక అవకతవకలతో పాటు భారీ అవినీతి వ్యవహారం బయటపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోది. ఈ నేపథ్యంలోనే విచారణ జరగకుండా తనను తాను కాపాడుకునేందుకు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజుల వ్యవధిలోనే పార్టీ మారినట్లు చర్చ జరుగుతోంది. -
దోచుకునేందుకే ధర్మవరానికి ‘పరిటాల’
సాక్షి, ధర్మవరం రూరల్: దోచుకోవడానికే పరిటాల కుటుంబం ధర్మవరం రావడానికి ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ నాయకుడు గోనుగుంట్ల సూర్యానారాయణ(వరదాపురం సూరి) మండిపడ్డారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇన్నాళ్లూ రాప్తాడు నియోజకవర్గాన్ని పరిటాల సునీత అభివృద్ధి చేయకుండా మండలాలకు ఇన్‌చార్జ్‌లను పెట్టి దోచుకున్నారని ఆరోపించారు. అక్కడ దోచుకుతిన్నది చాలదన్నట్లు ధర్మవరంలో కూడా దోచుకోవడానికి వస్తామని పరిటాల సునీత చెపుతున్నారన్నారు. ఇన్నాళ్లు గ్రూపు రాజకీయాలు చేస్తూ తమ పబ్బం గడుపుకున్నారే కాని ఆ పార్టీ అభివృద్ధికి ఏ¯ కృషి చేయలేదని విమర్శించారు. ధర్మవరం చెరువుకు నీళ్లు తెస్తుంటే పరిటాల సునీత అడ్డుకున్నారని గుర్తు చేశారు. తాను టీడీపీలో ఉన్నన్నాళ్లు సొంత డబ్బుతో పార్టీ అభివృద్ధికి పాటుపడ్డానన్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ నాయకులతో సంబంధాలు పెట్టుకొని తమ పబ్బం గడుపుకోలేదని పరోక్షంగా పరిటాల సునీతను ఎద్దేవా చేశారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మవరం వచ్చినప్పుడు ఒక నేత తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, 2009 ఎన్నికల్లో ఆమెకు చిత్తశుద్ధి ఉంటే జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి పనిచేశారా? లేక కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు పనిచేశారా? అనే విషయాన్ని చెప్పాలన్నారు. 2019లో కూడా ఆమె ఎన్ని నియోజకవర్గాల్లో ఏ పార్టీకి పనిచేశారో చెప్పాలన్నారు. తాను బీజేపీలోనే ఉంటానని ఏ పార్టీలోకి వెళ్లనని, 15 ఏళ్లుగా తనతో ఉన్న నాయకులు, కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. చాలా చోట్ల పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయడం లేదని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామన్నారు.నాయకులు శ్యామ్‌రావు, సుదర్శన్‌రెడ్డి, సాకే ఓబిళేసు, చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ ఊరికి రోడ్డేయలేనోడు..!
ఐదేళ్లు ఎమ్మెల్యే.. కోట్లాది రూపాయల కాంట్రాక్టులు.. సొంత నిర్మాణ సంస్థ.. ఈ నేత నియోజకవర్గంలోని గ్రామమే డి.చెర్లోపల్లి. ఇది సూరి తల్లి నారమ్మ పుట్టినిల్లు. కనీసం ఆయన శాసనసభ్యునిగా ఉన్న కాలంలో ఈ గ్రామానికి రోడ్డు కూడా వేయించకపోవడం చూస్తే పాలన ఎంత దయనీయంగా సాగిందో అర్థమవుతోంది. అమ్మకు అన్నం పెట్టలేనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడంట – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ నేతలను ఉద్దేశించి తరచూ చెప్పే ఈ మాటలు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి సరిగ్గా అతుకుతాయి.. సాక్షి, బత్తలపల్లి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల మండలంలోని పత్యాపురం గ్రామంలో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన డి.చెర్లోపల్లి రహదారి మీదుగానే వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి కాని అర్థం కాలేదు.. ఆయన హయాంలో నేతలు ఏస్థాయిలో అభివృద్ధి చేశారో. కనీసం నడిచేందుకు కూడా వీలు లేని రోడ్డును చూసి బాబు వెంట వచ్చిన పార్టీ నేతలు కూడా మనసులోనే ఇందుకోసమే ఓడిపోయామా అని బాధపడినట్లు కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఐదేళ్లు పెంచి పోషించిన పార్టీని కాదని, నమ్ముకున్న ప్రజలను.. కార్యకర్తలను నట్టేట్లో ముంచి ఆయన తన సొంత వ్యాపారాలను చక్కదిద్దుకునే పనిలో భాగంగా ఇటీవల బీజేపీలో చేరిపోవడం తెలిసిందే. నియోజకవర్గంలోనే ఆయన తన సొంత నిర్మాణ సంస్థ నితిన్‌సాయి ఆధ్వర్యంలో ఎన్నో పనులు చేపట్టారు. ఈ పనుల్లో ఎక్కడా నాణ్యత లేకపోవడంతో విజిలెన్స్ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించారు. ఇదే పరిస్థితి ఉంటే లాభం లేదనుకున్న ఆయన.. ఎంచక్కా కమలం గూటికి చేరిపోయారు. ఇప్పుడు మేల్కొన్న ఆ పార్టీ వర్గీయులు ఆయన హయాంలో సొంత తల్లి ఊరికి రోడ్డును కూడా వేయించుకోలేకపోయాడని సామాజిక మధ్యమాల్లోనూ ఎండగడుతున్నారు. ఎవరికైనా అవకాశం వస్తే.. సొంత ఊరికి, నమ్ముకున్న వాళ్లకు అంతోఇంతో మేలు చేయాలనుకుంటారు. కానీ ఈయన ప్రజల బాగోగులను గాలికొదిలేసి సొంతింటిని చక్కబెట్టుకోవడం ఎన్నికల్లో ఓటమి పాలుచేసింది. ఆటోలే దిక్కు డి.చెర్లోపల్లి గ్రామం నియోజకవర్గ కేంద్రం ధర్మవరానికి 29, మండల కేంద్రం బత్తలపల్లికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ కారణంగా బస్సు రద్దు కావడంతో గ్రామస్తులకు ఇప్పుడు ఆటోలే దిక్కయ్యాయి. బత్తలపల్లి నుంచి రూ.20, పత్యాపురానికి రూ.25లు వెచ్చించాల్సి వస్తోంది. ఇక విద్యార్థులు చదువుకునేందుకు 5 కిలోమీటర్ల నల్లబోయినపల్లికి వెళ్లక తప్పని పరిస్థితి. వీరంతా కాలినడకన వెళ్లి రావాల్సి ఉండటం గమనార్హం. అత్యవసర సమయాల్లో గ్రామస్తులు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం. వర్షాకాలంలో ప్రయాణం దుర్భరంగా ఉంటోంది. రాత్రిళ్లు నరకం సాయంత్రం ఆరు గంటలు దాటితే ఆటోలు కూడా తిరగవు. ఇక రాత్రిళ్లు అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి చేరుకునేందుకు నరకం చూడాల్సిందే. ఇలా రాత్రిళ్లు గుండెపోటు వచ్చిన వాళ్లు నలుగురు మృత్యువాత పడ్డారు. ఇప్పటికైనా మా గ్రామంపై దృష్టి సారించాలి. – డి.వెంగమనాయుడు, డి.చెర్లోపల్లి, బత్తలపల్లి -
అనంతపురంలో టీడీపీకి ఒక్కరూ మిగలరా?
టీడీపీ నేతలను కేసుల భయం వెంటాడుతోంది. మరికొందరు తమ ఆస్తులను, కాంట్రాక్టులను కాపాడుకునే క్రమంలో ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీ వైపు చూస్తున్నారు. అప్పట్లో అధికార పార్టీ అండ చూసుకొని జిల్లాలో టీడీపీ నేతలు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారు. తాజాగా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం, అవినీతిపై విచారణకు ఆదేశిస్తామని చెప్పడంతో టీడీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అందరికంటే ముందుగా తన ఇల్లు సర్దుకోవడం గమనార్హం. సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి తేరుకోక మునుపే జిల్లా టీడీపీకి ఆ పార్టీ ముఖ్య నేత వెన్నుపోటు పొడిచారు. జిల్లా ప్రధాన కార్యదర్శి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. అనంతరం భారతీయ జనతాపార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయకండువా కప్పుకున్నారు. సూరి పరిణామం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన బాటలోనే జేసీ బ్రదర్స్, పరిటాల సునీత, కందికుంట ప్రసాద్, పల్లె రఘునాథరెడ్డి బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరిపారు. జేసీ బ్రదర్స్ జేపీ నడ్డా, రాంమాధవ్‌తో రెండురోజుల కిందట చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వీరి చేరికకు కూడా లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. పరిటాల కుటుంబం చూపు కూడా పరిటాల సునీత కుటుంబం కూడా బీజేపీ వైపు చూస్తోంది. సునీత అల్లుడు బీజేపీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపి లైన్‌క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. బీజేపీలోకి చేరాలని, లేదంటే టీడీపీలో భవిష్యత్ ఉండదని సునీత అల్లుడు చెబుతున్నట్లు సమాచారం. శ్రీరాం కూడా తన బావ ఆలోచనకు అనువుగా కమలం పంచన చేరేందుకు సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. అయితే సునీతతో పాటు ఆమెకు సన్నిహితంగా ఉన్న కోటరీలోని కొందరు పరిటాల అంటే టీడీపీ అనే ముద్ర ఉందని, బీజేపీలో చేరితే టీడీపీ శ్రేణులు తమతో వస్తాయా? రావా? అనే ఆలోచన చేస్తున్నారు. ఇదిలాఉంటే వరదాపురం సూరి బీజేపీలో చేరిన నేపథ్యంలో సునీతను ధర్మవరానికి వెళ్లి సమావేశం నిర్వహించాలని, అలాగే ధర్మవరం ఇన్చార్జ్గా కొనసాగాలని సునీతకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అధినేత అభిప్రాయాన్ని సునీత సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. రాప్తాడు ఇన్చార్జ్గా శ్రీరాం ఉన్నాడని, ధర్మవరం విషయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. అయితే ఇన్చార్జ్ బాధ్యతలను తిరస్కరించడం వెనుక త్వరలో వారు కూడా పార్టీ మారాలనే నిర్ణయమే అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జేసీ బ్రదర్స్ చర్చలు కూడా సఫలం తాడిపత్రిలో 40 ఏళ్లుగా ఏక చత్రాధిపత్యం నడిపిన జేసీ బ్రదర్స్‌కు మొన్నటి ఎన్నికల్లో చావుదెబ్బ తగిలింది. వారసులిద్దరూ ఓడిపోయారు. జిల్లాలో టీడీపీ ఘోర ఓటమికి జేసీ బ్రదర్స్ కూడా కారణమని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దివాకర్‌రెడ్డి కూడా టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని, ఆ పార్టీ నైరాశ్యంలో ఉన్న పరిస్థితిని బీజేపీ అవకాశంగా తీసుకుని ఏపీలో బలపడాలనే యోచనలో ఉందని బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు జేసీ పవన్‌రెడ్డి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపి పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండురోజుల కిందటే బీజేపీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి చేరిక తేదీపై మీరే నిర్ణయం తీసుకోవాలని ‘జూనియర్ బ్రదర్స్’కు చెప్పినట్లు సమాచారం. కాబట్టి సూరి తర్వాత జేసీ బ్రదర్స్, పరిటాల కుటుంబంలో ఎవరు ముందు ఢిల్లీ విమానం ఎక్కుతారా? అనే చర్చ జిల్లాలో సాగుతోంది. ఈ చేరికల వెంటనే కందికుంట ప్రసాద్ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది. నట్టేట ముంచిపోయాడు తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలో చేరడం పట్ల ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన వారం రోజులకే సూరి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరపడం, ఆ తర్వాత నియోజకవర్గానికి అడపాదడపా వస్తూ క్యాడర్‌ను కూడా పార్టీ మారాలని ఒత్తిడి చేయడం జరుగుతోంది. క్లాస్–1 కాంట్రాక్టర్ అయిన సూరీ నితిన్‌సాయి కన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఎస్సీ) పేరిట ధర్మవరం నియోజకవర్గంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల పనులు చేస్తుండగా.. వీటిలో కొన్ని మధ్యలో ఉండగా, మరికొన్ని బిల్లులు కాకుండా పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో టీడీపీలోనే కొనసాగితే ఆయా పనులకు సంబంధించిన బిల్లులు నిలిచిపోవడంతో పాటు, నాణ్యతకు సంబంధించి విచారణ జరిగితే ఇబ్బందులు తప్పవనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. సూరి అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రాంతాల్లో చేపట్టిన పనులు, ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో చేపట్టిన పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించింది. ఈ నేపథ్యంలో తన పనులకు ఆటంకం కలిగి, ఆదాయానికి గండిపడుతుందని భావించిన ఆయన టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. అయితే ఇంతకాలం ఆయనను నమ్మి పని చేసినందుకు తమతో పాటు పార్టీని నట్టేట ముంచిపోయాడని క్యాడర్ రగిలిపోతోంది. తన సొంత ప్రయోజనాల కోసం ఇంతమందిని బలి చేస్తున్న ఆయనకు భవిష్యత్ లేదని, తాము ఆయన వెంట నడిచే ప్రసక్తే లేదని కార్యకర్తలు, నాయకులు తేల్చి చెబుతున్నారు. -
కంకర మిషన్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి
ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణకు చెందిన కంకర మిషన్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామ సమీపంలో ఉన్న కంకర మిషన్‌లో అదే గ్రామానికి చెందిన రామ్మోహన్ నాయుడు(32) కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు అనుమానాస్పదంగా మృతిచెందాడు. యాజమాన్యం ప్రమాదవశాత్తు మృతిచెందాడని చెప్తుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం రామ్మోహన్ నాయుడు మృతికి యాజమన్యమే కారణమని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పరిటాల సునీత మృతదేహాన్ని పరిశీలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చే స్తున్నారు.