టీడీపీ నేతలను కేసుల భయం వెంటాడుతోంది. మరికొందరు తమ ఆస్తులను, కాంట్రాక్టులను కాపాడుకునే క్రమంలో ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీ వైపు చూస్తున్నారు. అప్పట్లో అధికార పార్టీ అండ చూసుకొని జిల్లాలో టీడీపీ నేతలు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారు. తాజాగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం, అవినీతిపై విచారణకు ఆదేశిస్తామని చెప్పడంతో టీడీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అందరికంటే ముందుగా తన ఇల్లు సర్దుకోవడం గమనార్హం.
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి తేరుకోక మునుపే జిల్లా టీడీపీకి ఆ పార్టీ ముఖ్య నేత వెన్నుపోటు పొడిచారు. జిల్లా ప్రధాన కార్యదర్శి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి
తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. అనంతరం భారతీయ జనతాపార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయకండువా కప్పుకున్నారు. సూరి పరిణామం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన బాటలోనే జేసీ బ్రదర్స్, పరిటాల సునీత, కందికుంట ప్రసాద్, పల్లె రఘునాథరెడ్డి బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరిపారు. జేసీ బ్రదర్స్ జేపీ నడ్డా, రాంమాధవ్‌తో రెండురోజుల కిందట చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వీరి చేరికకు కూడా లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
పరిటాల కుటుంబం చూపు కూడా
పరిటాల సునీత కుటుంబం కూడా బీజేపీ వైపు చూస్తోంది. సునీత అల్లుడు బీజేపీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపి లైన్‌క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. బీజేపీలోకి చేరాలని, లేదంటే టీడీపీలో భవిష్యత్ ఉండదని సునీత అల్లుడు చెబుతున్నట్లు సమాచారం. శ్రీరాం కూడా తన బావ ఆలోచనకు అనువుగా కమలం పంచన చేరేందుకు సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. అయితే సునీతతో పాటు ఆమెకు సన్నిహితంగా ఉన్న కోటరీలోని కొందరు పరిటాల అంటే టీడీపీ అనే ముద్ర ఉందని, బీజేపీలో చేరితే టీడీపీ శ్రేణులు తమతో వస్తాయా? రావా? అనే ఆలోచన చేస్తున్నారు.
ఇదిలాఉంటే వరదాపురం సూరి బీజేపీలో చేరిన నేపథ్యంలో సునీతను ధర్మవరానికి వెళ్లి సమావేశం నిర్వహించాలని, అలాగే ధర్మవరం ఇన్‌చార్జ్‌గా కొనసాగాలని సునీతకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అధినేత అభిప్రాయాన్ని సునీత సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. రాప్తాడు ఇన్‌చార్జ్‌గా శ్రీరాం ఉన్నాడని, ధర్మవరం విషయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. అయితే ఇన్‌చార్జ్ బాధ్యతలను తిరస్కరించడం వెనుక త్వరలో వారు కూడా పార్టీ మారాలనే నిర్ణయమే అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జేసీ బ్రదర్స్ చర్చలు కూడా సఫలం
తాడిపత్రిలో 40 ఏళ్లుగా ఏక చత్రాధిపత్యం నడిపిన జేసీ బ్రదర్స్‌కు మొన్నటి ఎన్నికల్లో చావుదెబ్బ తగిలింది. వారసులిద్దరూ ఓడిపోయారు. జిల్లాలో టీడీపీ ఘోర ఓటమికి జేసీ బ్రదర్స్ కూడా కారణమని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దివాకర్‌రెడ్డి కూడా టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని, ఆ పార్టీ నైరాశ్యంలో ఉన్న పరిస్థితిని బీజేపీ అవకాశంగా తీసుకుని ఏపీలో బలపడాలనే యోచనలో ఉందని బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు జేసీ పవన్‌రెడ్డి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపి పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండురోజుల కిందటే బీజేపీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి చేరిక తేదీపై మీరే నిర్ణయం తీసుకోవాలని ‘జూనియర్ బ్రదర్స్’కు చెప్పినట్లు సమాచారం. కాబట్టి సూరి తర్వాత జేసీ బ్రదర్స్, పరిటాల కుటుంబంలో ఎవరు ముందు ఢిల్లీ విమానం ఎక్కుతారా? అనే చర్చ జిల్లాలో సాగుతోంది. ఈ చేరికల వెంటనే కందికుంట ప్రసాద్ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది.
నట్టేట ముంచిపోయాడు
తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలో చేరడం పట్ల ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన వారం రోజులకే సూరి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరపడం, ఆ తర్వాత నియోజకవర్గానికి అడపాదడపా వస్తూ క్యాడర్‌ను కూడా పార్టీ మారాలని ఒత్తిడి చేయడం జరుగుతోంది. క్లాస్–1 కాంట్రాక్టర్ అయిన సూరీ నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌ఎస్‌సీ) పేరిట ధర్మవరం నియోజకవర్గంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల పనులు చేస్తుండగా.. వీటిలో కొన్ని మధ్యలో ఉండగా, మరికొన్ని బిల్లులు కాకుండా పెండింగ్‌లో ఉండిపోయాయి.
ఈ నేపథ్యంలో టీడీపీలోనే కొనసాగితే ఆయా పనులకు సంబంధించిన బిల్లులు నిలిచిపోవడంతో పాటు, నాణ్యతకు సంబంధించి విచారణ జరిగితే ఇబ్బందులు తప్పవనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. సూరి అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రాంతాల్లో చేపట్టిన పనులు, ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో చేపట్టిన పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించింది. ఈ నేపథ్యంలో తన పనులకు ఆటంకం కలిగి, ఆదాయానికి గండిపడుతుందని భావించిన ఆయన టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. అయితే ఇంతకాలం ఆయనను నమ్మి పని చేసినందుకు తమతో పాటు పార్టీని నట్టేట ముంచిపోయాడని క్యాడర్ రగిలిపోతోంది. తన సొంత ప్రయోజనాల కోసం ఇంతమందిని బలి చేస్తున్న ఆయనకు భవిష్యత్ లేదని, తాము ఆయన వెంట నడిచే ప్రసక్తే లేదని కార్యకర్తలు, నాయకులు తేల్చి చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment