సాక్షి, అనంతపురం: రాజకీయాలు ఎప్పుడూ హుందాగా, నిర్మాణాత్మకంగా ఉండాలి. ప్రజాశ్రేయస్సుకు, వ్యవస్థల పనితీరుకు దోహదపడాలి. నేతలు హుందాగా వ్యవహరించినప్పుడే అది సాధ్యపడుతుంది. కానీ ప్రతిపక్ష నేతలు రాజకీయ కట్టుబాట్లు పాటించడం లేదు. మరీ ముఖ్యంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు వ్యవహారశైలి పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉంటోంది. నిక్కచ్చిగా పనిచేస్తూ జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షిస్తున్న పోలీసులను అభినందించాల్సింది పోయి..వారికి రాజకీయ దురుద్దేశాలను అంటగడుతున్నారు.
ఇటీవల జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ చెలామణి, ఆయుధాల సరఫరా ముఠాను అరెస్టు చేసిన విషయం విదితమే. దేశవ్యాప్త నెట్‌వర్క్ కల్గిన ఈ ముఠా ఆట కట్టించడానికి పోలీసులు ఎంతగానో శ్రమించారు. కానీ వారి శ్రమను వృథా చేసేలా కాలవ వ్యాఖ్యలు చేశారు. ముఠా సభ్యుల్లో ఒకరితో అధికార పార్టీ నేతలకు సంబంధం ఉందంటూ నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా కేసు దర్యాప్తులో పోలీసులకు ఆటంకాలు సృష్టించేలా వ్యవహరించారు. ఆయన వ్యాఖ్యలను పోలీసు అధికారులు నేరుగా ఖండించాల్సిన పరిస్థితులను కల్పించారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి..రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థపై ఆరోపణలు చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.
సమర్థతకు నిదర్శనాలెన్నో..
జిల్లా పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. సెల్‌ఫోన్ల రికవరీలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాను అగ్రస్థానంలో నిలిపారు. ‘చాట్‌బాట్’ సేవల ద్వారా గతే ఏడాది ఆఖరు వరకు సుమారు రూ.7 కోట్లు విలువ చేసే 4,294 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. 2021–22 మధ్యకాలంలో మత్తుపదార్థాలు, పేకాట, మట్కా, గుట్కా, బెట్టింగ్ తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. ఒక్క జూదాలపైనే 5,236 కేసులు నమోదు చేశారంటే పోలీసు వ్యవస్థ సమర్థతను అర్థం చేసుకోవచ్చు. నకిలీ ఎన్‌ఓసీలు, ఆధార్‌కార్డుల మార్ఫింగ్, రియల్ ఎస్టేట్ దందాల ముఠాల ఆట కట్టించారు. ఈ కేసుల్లో పలువుర్ని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
డీజీపీ నుంచి ప్రశంసలు
ఆయుధాల సరఫరా ముఠా అరెస్టులో ‘అనంత’ పోలీసులు చూపిన తెగువను స్వయాన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశంసించారు. ఈ ముఠా సభ్యులకు నకిలీనోట్ల చెలామణి మొదలుకుని..గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా, కిరాయి హత్యలు తదితర వాటితో సంబంధాలు ఉన్నాయి. ఈ అంతర్రాష్ట్ర ముఠాలోని ఆరుగురు సభ్యులను గత డిసెంబరులో అరెస్టు చేసిన జిల్లా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టి ఆయుధ నెట్‌వర్క్ మూలాలను గుర్తించారు. ముఠా సభ్యుల్లో కీలకమైన మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్‌పాల్‌సింగ్ ఆ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఆయుధాల తయారీ కేంద్రాలపైనా దాడులు నిర్వహించారు.
కొత్త ప్రాంతాల్లో, అది కూడా ఆయుధ ముఠా కేంద్రాలపై దాడులు చేయడమంటే ఆషామాషీ కాదు. అయినప్పటికీ జిల్లా పోలీసులు ప్రాణాలకు సైతం తెగించి దాడులు చేసి..ఆయుధాలను, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంతటి ధైర్యసాహసాలను ప్రదర్శించిన పోలీసులను ఉన్నతాధికారులతో పాటు పలువురు అభినందించగా.. టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు మాత్రం వారి శ్రమను తక్కువ చేసేలా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు పోలీసు వర్గాలను విస్మయానికి, వేదనకు గురి చేశాయి.
కాలవ తీరు హేయం
జిల్లా పోలీసులు ప్రాణాలకు సైతం తెగించి ఆయుధ ముఠాను పట్టుకున్నారు. వారి శ్రమను గుర్తించాల్సింది పోయి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అభాండాలు వేయడం హేయమైన చర్య. స్వార్థ రాజకీయాల కోసం కేసునే తప్పుదారి పట్టించేలా మాట్లాడటం పద్ధతిగా లేదు.
– బీటీపీ గోవిందు, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు
ఎక్కడా రాజీ పడలేదు
అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల ఆట కట్టించడానికి డీజీ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుదీర్ఘంగా ఆపరేషన్ చేశాం. ఈ ముఠాలో కరుడుగట్టిన నేరగాళ్లు ఉన్నా ధైర్యంగా అరెస్టు చేశాం. కేసు దర్యాప్తులో ఎక్కడా రాజీపడలేదు. ఈ కేసు విషయంలో అనవసరమైన ఆరోపణలు చేయడం తగదు.
– డాక్టర్ ఫక్కీరప్ప, ఎస్పీ
సంబంధం లేని అంశాలను తేవొద్దు
జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నాం. ఆయుధ ముఠాను పట్టుకోవడంలో మన పోలీసులు చూపిన ప్రతిభ రాష్ట్రానికే తలమానికం. డీజీపీ నుంచి రివార్డు అందుకోవడం గర్వంగా ఉంది. దర్యాప్తుతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించడం మంచిపద్ధతి కాదు.
– బి.శ్రీనివాసులు, డీఎస్పీ, కళ్యాణదుర్గం
Comments
Please login to add a commentAdd a comment