Revenue Bhavan
-
తాగునీరే.. సాగుకు లేదు!
ఐఏబీ సమావేశంలో స్పష్టం చేసిన మంత్రులు, అధికారులు – టీబీ డ్యాంలో ప్రస్తుత నీటి నిల్వ 64 టీఎంసీలు - హెచ్చెల్సీ కోటా 9.8 టీఎంసీలు – అనంత, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల తాగునీటి అవసరాలకు 10టీఎంసీలు – ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉండటంతో డ్యాంలో నీటిలభ్యత పెరిగే అవకాశం – అదే జరిగితే 12 టీఎంసీల వరకూ అందే అవకాశం – ఆయా ప్రాంతాల తాగు, సాగునీటి అవసరాలను ప్రస్తావించిన మూడు జిల్లాల ప్రజాప్రతినిధులు సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘తుంగభద్రడ్యాంలో ప్రస్తుతం 64 టీఎంసీల నీరు ఉంది. ఏపీకి దామాషా ప్రకారం 9.8 టీఎంసీలు కేటాయించారు. ఆ నీటిని పూర్తిగా తాగునీటికే వినియోగిస్తాం. ప్రస్తుతం డ్యాంలో ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉంది. మంచి వర్షాలు కురిసి, డ్యాంలో నీటి లభ్యత పెరిగితే సాగునీటి గురించి తర్వాత ఆలోచిస్తాం’ అని జిల్లా ఇన్చార్జ్మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో బుధవారం ఐఏబీ (నీటిపారుదల సలహా మండలి) సమావేశం నిర్వహించారు. మంత్రులు దేవినేని, కాలవ శ్రీనివాసులుతో పాటు అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో నీరు : ఎస్ఈ టీబీడ్యాంలో నీటిలభ్యత, హెచ్చెల్సీ కోటా, తాగు, సాగునీటి అవసరాలు, ప్రాధాన్యతలను హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావు వివరించారు. ఏటా తుంగభద్ర నుంచి వచ్చే నీటిని ఎగువ ప్రాంతంలోని ఆయకట్టుకు ఇస్తూ దిగువన ఉన్న పీఏబీఆర్, ఎంపీఆర్, సీబీఆర్‌లకు కూడా ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. అయితే ఈ ఏడాది డ్యాంలో నీటిలభ్యత తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం డ్యాంలో 64 టీఎంసీలు ఉన్నాయని, ఇందులో హెచ్చెల్సీ వాటాను 9.8 టీఎంసీలుగా టీబీ బోర్డు నిర్ణయించిందన్నారు. అయితే హెచ్చెల్సీ పరిధిలో తాగునీటి అవసరాలకే 10 టీఎంసీల నీరు అవసరమన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన సమీక్షలో హెచ్చెల్సీకి ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో నీరిస్తామని టీబీబోర్డు స్పష్టం చేసిందన్నారు. 20 రోజులు ఆన్, 10 రోజులు ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తామన్నారని వివరించారు. టీబీడ్యాం నుంచి ఎంపీఆర్‌కు నీరు చేరాలంటే కనీసం 30 రోజులు పడుతుందన్నారు. 20 రోజులు విడుదల చేసి పదిరోజులు నీటి విడుదల ఆగిపోతే నీరు చేరదన్నారు. అందుకే మొదటి 30 రోజులు నీటిని విడుదల చేసి, ఆపై 10 రోజులు కావాలంటే ‘ఆఫ్ పద్ధతి’లో కర్ణాటకకు వినియోగించుకోవాలని తెలిపామన్నారు. ఇలా కాకుండా దామాషా ప్రకారం నిరాటకంగా నీరు విడుదల చేస్తే 1100 క్యూసెక్కులు ఇచ్చినా సరిపోతుందన్నారు. ఈ నీటిని 85 రోజుల వరకూ తీసుకోవచ్చన్నారు. టీబీడ్యాంలో నీటినిల్వ సామర్థ్యం 16 టీఎంసీలకు తగ్గితే హెచ్చెల్సీ ద్వారా చుక్కనీరు కూడా తీసుకునే అవకాశం ఉండదని, అందుకే నీటి సామర్థ్యం 16 టీఎంసీలకు చేరకముందే కోటా మేర నీటిని తీసుకోవాలన్నారు. తర్వాత ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంత అవసరాలను ప్రస్తావించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమస్యలు, సూచనల తర్వాత కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడారు. 12 టీఎంసీలు తీసుకునే అవకాశం : కలెక్టర్ డ్యాంలో ప్రస్తుతం 64 టీఎంసీలు ఉన్నాయని, ప్రస్తుతం 26 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. డ్యాంలో 75–80 టీఎంసీల నీటి లభ్యత ఉండే అవకాశం ఉందన్నారు. కాబట్టి 11.5 నుంచి 12 టీఎంసీలు హెచ్చెల్సీ ద్వారా తీసుకునే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ప్రతినీటి చుక్కును తాగునీటి అవసరాలకే వినియోగిస్తామన్నారు. భవిష్యత్తులో మంచి వర్షాలు కురిసి, డ్యాంలో నీటి లభ్యత పెరిగితే సాగునీరు, రక్షకతడుల గురించి ఆలోచిస్తామన్నారు. హంద్రీ–నీవా ద్వారా నీరు వచ్చే అవకాశం ఉందని, అన్ని ప్రాంతాల అవసరాలను పరిగణలోకి తీసుకుంటామని ప్రజాప్రతినిధులు సహకరించాలని విన్నవించారు. నీటి లభ్యత బాగా తగ్గింది : మంత్రి కాలవ మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ టీబీడ్యాం చరిత్రలో ఎన్నడూలేని విధంగా నీటిలభ్యత తగ్గిపోయిందన్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లోకాస్త మాత్రం ఆశాజనకంగా ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాగునీటికే ప్రాధాన్యత ఇస్తామని, ఆ దిశగానే అధికారులు ప్రణాళికలు రూపొందించారన్నారు. శ్రీశైలం నుంచి కూడా నీరు వచ్చే అవకాశం ఉందని, దీన్ని కూడా తాగునీటి అవసరాలకు వినియోగించాలన్నారు. కణేకల్ చెరువుకు మొదట నీళ్లిస్తాం : మంత్రి దేవినేని అందరి అభిప్రాయాలు ఆలకించిన తర్వాత చివరగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ప్రజాప్రతినిధులు సూచించిన మేరకు ఆయా ప్రాంత అవసరాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఆయకట్టు రైతులు కూడా కలిసి సమస్యలను విన్నవించారన్నారు. అయితే డ్యాంలో నీరు తక్కువగా ఉండటంతో ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిన తీసుకుంటున్నామన్నారు. టీబీడ్యాం నుంచి మొదట కణేకల్ చెరువును నింపుతామన్నారు. తర్వాత పీఏబీఆర్, ఎంపీఆర్, సీబీఆర్ నింపుతామన్నారు. ముచ్చుమర్రి ద్వారా సెప్టెంబర్ రెండోవారంలో ఎత్తిపోతల ప్రారంభిస్తామన్నారు. గండికోటతో పాటు హంద్రీ–నీవా ద్వారా వచ్చేనీటితో మూడు జిల్లాలలో తాగునీటి సమస్యను నివారిస్తామన్నారు. ఎవరివాదన వారిది... సీబీఆర్ పూర్తిగా అడుగంటిపోవడం, ఎంపీఆర్‌లో నీరు లేకపోవడం, పీఏబీఆర్ ప్రమాదకరస్థాయిలో ఉండటంతో ప్రజాప్రతినిధులు ఎవరికివారు తమ ప్రాంత అవసరాల గురించి మాట్లాడారు. 4 దశాబ్దాలుగా ఐఏబీ సమావేశంలో పాల్గొంటున్నానని, ఇప్పటికీ తాడిపత్రికి సాగునీరు అందించలేకపోతున్నానని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ‘ఇన్నేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నావు. సాగునీళ్లు ఇప్పించలేకపోతే నువ్వేం నేతవని మా ప్రాంత ప్రజలు నిలదీసే అవకాశం ఉందని, ఆ పరిస్థితి రానివ్వొద్దన్నారు. వచ్చేనీటిలో తొలిప్రాధాన్యతగా తాడిపత్రికి తాగునీరు అందించాలని కోరారు. శింగనమలలో 26 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయని, నీళ్లు రాగానే మొదట టైఎల్అండ్ అంటూ పులివెందులకు తీసుకెళ్తున్నారని, శింగనమలకే మొదట నీళ్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ శమంతకమణి కోరారు. సీబీఆర్ పరిస్థితి దారుణంగా ఉందని, యుద్ధప్రాతిపదికను నీళ్లు వదలకపోతే పులివెందుల, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాలలోని 850 గ్రామాలకు తాగునీరు ఆగిపోతుందని ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, చాంద్‌బాషా తెలిపారు. చిత్రావతికి ఎప్పుడూ అన్యాయమే ‘టీబీడ్యాంలో 64 టీఎంసీలు ఉన్నాయి. ఇన్ఫ్లోబాగానే ఉంది. గతంతో పోలిస్తే నీటి లభ్యత తగ్గింది. పీఏబీఆర్, సీబీఆర్లు తాగునీటికి నిర్ధేశించినవి. సీబీఆర్‌లో 0.1 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, పులివెందులలో తాగునీటి పథకాలు పనిచేయడం లేదు. చిత్రావతికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది. ఎంపీఆర్ నుంచి వెంటనే సీబీఆర్‌కు నీటిని విడుదల చేయాలి. అలాగే పులివెందుల పరిధిలోని చీనీచెట్లను కాపాడాలి. – అవినాశ్‌రెడ్డి, ఎంపీ, కడప ఆలూరు కెనాల్‌కు నీళ్లివ్వండి ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఖాజాపూర్ రిజర్వాయర్ ఎండిపోయింది. మాకు 15 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీరు లేకపోయినా ఫర్వాలేదు. మొదట తాగునీరు విడుదల చేయండి. హంద్రీ–నీవా ద్వారా నీరు వస్తే ఆ నీటిని ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు విడుదల చేయాలి. – గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే, ఆలూరు ‘ప్రాంతాలతో పనిలేదు. జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందించాలి. పశువులకు నీరు లేక కబేళాలకు తరలుతున్నాయి. నీరు అనేది ప్రాణాధారం. మాకంటే మాకివ్వండని ఎమ్మెల్యేలు అడగటం కరెక్ట్ కాదు. అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలి. సాగుకు వినియోగించే నీటిని అరికట్టాలి. ఎస్పీని కూడా సమావేశానికి పిలిపించాలి. అవసరమైతే ఒక చెరువు నుంచి మరో చెరువుకు కాలువలు నిర్మించి అన్నింటినీ నీటితో నింపాలి.’’ – వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ‘నీటి వినియోగంపై ప్రభుత్వానికి ప్రణాళిక లేదు. గతేడాది హంద్రీనీవా ద్వారా 26 టీఎంసీలు వచ్చాయి. భవిష్యత్ అవసరాలు పట్టించుకోకుండా ఎవరికి బలం ఉంటే వారు చెరువులకు తీసుకెళ్లారు. నీటి విడుదలలో మంత్రులు, ఎమ్మెల్యేలు మినహా అధికారుల ప్రమేయం ఉండటం లేదు. ఈ ఏడాది టీబీ డ్యాంలోకి నీరు రాకపోయి ఉంటే తాగునీటి పరిస్థితి ఏంటి? ఉరవకొండకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రాజకీయంగా చూస్తున్నారు. కర్ణాటక అన్యాయంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం స్పందించడంలో వైఫల్యం చెందింది. – విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ -
మహిళే జగతికి వెలుగు
అనంతపురం కల్చరల్: ‘మహిళ ఒక శక్తి స్వరూపిణి. ఆమె అనుకుంటే సాధించలేనిదేదీ లేదు. మహిళతోనే జగతికి వెలుగు వస్తుంద’ని వక్తలు అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ (ఏజేసీ) ఖాజా మొహిద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ స్వరూప, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖరబాబు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తోందన్నారు. మహిళలలో మరింత చైతన్యం రావాలన్నారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని, మహిళా అక్షరాస్యత పెరగాలని ఆకాంక్షించారు. మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్లను 33 నుంచి 50 శాతానికి పెంచాల్సిన అవసరముందన్నారు. కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందన్నారు. ఏ రంగంలో చూసినా మహిళలు పురుషులకు తీసిపోరన్నారు. దేశాభివృద్ధిలో వారి పాత్ర కీలకమని ప్రశంసించారు. మహిళల ప్రతిభకు తగిన గుర్తింపు లభించేలా ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. దేశంలో 65 శాతం, రాష్ట్రంలో 59 శాతం మాత్రమే మహిళా అక్షరాస్యత ఉందని తెలిపారు. మహిళలు వంద శాతం అక్షరాస్యులుగా మారినప్పుడే ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. గ్రామీణ ప్రాం తాలలో మహిళలు ఆత్మగౌరవం చంపుకుని బహిర్భూమికి వెళుతుండడం మనమంతా సిగ్గుపడాల్సిన విషయమన్నారు. కావున ప్రతిఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే మహిళలకు ఎటువంటి ఛీత్కారాలు, అగౌరవం లేకుండా ప్రవర్తించాలని ఉద్యోగులకు సూచించారు. ఎస్పీ రాజశేఖరబాబు మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం తాము ముందుంటామన్నారు. మహిళా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసి డీఎస్పీలను నియమించామని, ఎటువంటి సమస్యలొచ్చినా కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సమాజంలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతుండడం విచారకరమన్నారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ అభివృద్ధికి మూలం విద్య అని, అందరూ చదువుకోవాలని సూచించారు. నవసమాజ నిర్మాణంలో స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా నేపాల్‌లో మాత్రమే అత్యధికంగా మహిళా ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. మన దేశంలో 27 శాతం మాత్రమే ఉండడం విచారకరమన్నారు. మహిళా సాధికారత, స్వావలంబన ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతున్నారన్నారు. అనంతరం వివిధ రంగాలలో కృషి చేసిన సామాజిక కార్యకర్తలకు జ్ఞాపికలందించారు. కాంతమ్మ, డాక్టర్ ప్రసూన, పుష్పవతి, డాక్టర్ షంషాద్‌బేగం తదితరులు జ్ఞాపికలు అందుకున్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ విజయకృష్ణన్, సిరికల్చర్ జేడీ అరుణకుమారి, లీగల్ సెక్రటరీ సుబ్బారావు, డీఎంహెచ్‌వో ప్రభుదాస్, డీఆర్డీఏ పీడీ వెంకటేశం, అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నాగవేణి, ఐసీడీఎస్ ఏపీడీ సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
మీ పని తీరులో ‘మార్పు’ రావాలి
అనంతపురం మెడికల్: ‘ఒక మంచి ప్రయోజనాన్ని ఆశించి చేపట్టే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి సత్ఫలితాన్ని సాధించాలంటే అందుకు తగ్గట్టుగా మన పనితీరు ఉండాలి. మాతా శిశు మరణాల శాతం తగ్గించేందుకు చేపట్టిన ‘మార్పు’ కార్యక్రమం విషయంలో ఇది కనిపిం చడం లేదు. ముందుగా మన పనితీరు మారితేనే ‘మార్పు’ ఉద్దేశం ఫలిస్తుంది.’ అని అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ ఉద్బోధ చేశారు. ‘మార్పు’ కార్యక్రమంపై రెవెన్యూ భవన్లో ఆదివారం ఐకేపీ పీడీ నీలకంఠారెడ్డి, అదనపు జిల్లా ఆరోగ్య వైద్యాధికారి వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి, డీసీహెచ్ఎస్ రామకృష్ణారావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మాతా శిశు మరణాల వివరాల సేకరణలో విఫలం చెందారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాతాశిశు మరణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నది ‘మార్పు’ ప్రధాన ఉద్దేశమన్నారు. దీనిని ప్రజల్లో తీసుకెళ్లడంలో విఫలమయ్యారన్నారు. గత ఏడాది జిల్లా వ్యా ప్తంగా 72 వేల జననాలు జరిగితే.. తల్లులు 117 మంది, శిశువులు 552 మంది చనిపోయినట్లు ఇచ్చిన సంఖ్య వాస్తవం కాదనేది స్పష్టమవుతోందన్నారు. ఏదో ఒక సంఖ్య ఇస్తే సరిపోతుందనే విధంగా మీ నివేదిక కనిపిస్తోందన్నారు. ఎంత మంది చనిపోయారనే వివరాలు మీ వద్ద ఉన్నాయా..? మీరిచ్చిన గణాంకాలు కరెక్టేనని ఎవరైనా చెప్పగలరా? అని కలెక్టర్ అడిగిన ప్రశ్నకు ఎవ్వరి నుంచి సమాధానం రాలేదు. ఇకపై అలా జరగకూడదని చెప్పారు. అంకిత భావంతో పనిచే సి మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించాలని, నిర్దేశించుకున్న లక్ష్యం సాధించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జననాలు సంఖ్య తక్కువగా ఉంది.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు 30 శాతం మించి లేదనేది స్పష్టమవుతోందన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ కాన్పునకు కూడా సిజేరియన్ చేసి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఫీజు వసూలు చేసే పరిస్థితి ఉందన్నారు. దీనివల్ల పేదవారు ఆర్థిక ఇబ్బందులకు గురవుతారన్నారు. ఇకపై అందరూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా కృషి చేయాలన్నారు. ప్రతి కేంద్రంలో ప్రతి నెలా 20 కాన్పులు తప్పకుండా జరిగేలా చూడాలన్నారు. నెలలో 3వ శుక్రవారం సమావేశం నిర్వహించుకోండి మార్పు కార్యక్రమంపై ప్రతి నెలా 3వ శనివారం ‘మార్పు’ కార్యక్రమంపై సమావేశం నిర్వహించుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. మీ సమావేశం తరువాత ఒకటి రెండు రోజుల్లో జిల్లా స్థాయిలో తాను సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఈ దఫా సమావేశానికి వచ్చేప్పుడు కచ్చితమైన వివరాలతో రావాలన్నారు. ఒక తల్లి లేదా బిడ్డ చనిపోతే అందుకుగల కారణాలు తప్పక నమోదు చేయాలన్నారు. ‘మార్పు’ కింద సేకరించాల్సిన సమాచారానికి సంబంధించి ఒక ఫార్మెట్‌ను డీఆర్డీఏ అధికారులు ఇస్తారని, ఆ ప్రకారం పూర్తి సమాచారం సేకరించాలని చెప్పారు. నివేదికలు తప్పుగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ప్రభుత్వ వైద్యులు, డీఆర్డీఏ, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
టమక వద్ద అతిపెద్ద రెవెన్యూ భవన్
కోలారు, న్యూస్‌లైన్ : కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా రెవెన్యూ భవన ఏర్పాటు చేయాలనే జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. నగరంలోని టమక వద్ద దేవరాజ్ అరస్ మెడికల్ కళాశాల ఎదుట రెవెన్యూ భవన్‌ను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి కేహెచ్ మునియప్ప వెల్లడించారు. ఇందు కోసం ఎనిమిది ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. స్థానిక జిల్లా పంచాయతీ భవనంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌తో పాటు అన్ని కార్యాలయాలు ఓకే చోట ఉండేలా అతి పెద్ద రెవెన్యూ భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేష్‌కుమార్ మాట్లాడుతూ ఉడిపి జిల్లా కేంద్రం, లేదా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించిన రెవెన్యూ భవన్ తరహాలో ఇక్కడ కూడా నిర్మాణాలు చేపట్టాలనే యోచన ఉందన్నారు. జిల్లాలో నెలకొన్న మంచినీటి ఎద్దడి నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో రూ.10కోట్లతో యాక్షన్ ప్లాన్న ప్రభుత్వానికి అందజేసే విషయంపై ఎమ్మెల్యేలతో చర్చించినట్లు తెలిపారు. ఏయే గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉందో గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఎంపి, ఎమ్మెల్యే నిధులు దుర్వినియోగం కాకుండా ప్రత్యేక విజిలెన్స్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఇందు కోసం కాంట్రాక్టు పద్దతిపై సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో చెరువుల పునరుద్ధరణ కొనసాగించాలని అధికారులతో జరిగిన సమావేశంలో తీర్మానించినట్లు ఆయనతెలిపారు.చెరువుల వద్ద పశువుల నీటి తొట్టీలు, దోభిఘాట్లు నిర్మించనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎమ్మెల్యేలందరూ పార్టీల కతీతంగా సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారన్నారు. చెరువులనుంచి తీసిన పూడిక మట్టిని రైతుల పొలాలకు తరలించేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించేలా చర్యలు చేపడుతామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కొత్తూరు మంజునాథ్, మంజునాథ్‌గౌడ, వై రామక్క, ఎం నారాయణస్వామి, ఎమ్మెల్సీలు నజీర్ అహ్మద్, వై ఏ నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే వై సంపంగి, జిల్లా కలెక్టర్ డీ ఎస్ రవి, సీఈఓ జుల్ఫికరుల్లా తదితరులు పాల్గొన్నారు.