తడబడుతున్న బంగారు తల్లి | bangaru thalli scheme not followed correctly | Sakshi
Sakshi News home page

తడబడుతున్న బంగారు తల్లి

Published Tue, Dec 3 2013 4:09 AM | Last Updated on Fri, Jun 1 2018 8:59 PM

bangaru thalli scheme not followed correctly

సాక్షి, అనంతపురం : జిల్లాలోని పురపాలికలు, నగర పంచాయతీల్లో బంగారుతల్లి పథకం కింద ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. లబ్ధిదారులు నిత్యం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ‘బంగారుతల్లి’ పథకం  ప్రారంభంలోనే తడబడుతోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మానస పుత్రికగా ప్రచారం పొందిన ఈ పథకం ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వచ్చినా, ఇప్పటి వరకు జిల్లాలోని 11 మునిసిపాలిటీలు, ఒక కార్పొరేషన్ పరిధిలో ఒక్క తల్లికి కూడా పారితోషికం అందించలేకపోయారు.

 ఈ ఏడాది మే ఒకటి తరువాత పుట్టిన ప్రతి ఆడపిల్లను ఈ పథకంలో చేర్చుతామని అధికారులు చెబుతున్నా.. లబ్ధి మాత్రం చేకూర్చడంలేదు. అర్భాటపు ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం.. అమలులో మాత్రం చతికిలపడుతోంది. జిల్లాలోని అనంతపురం కార్పొరేషన్, ధర్మవరం, రాయదుర్గం, కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, గుత్తి, కళ్యాణదుర్గం, హిందూపురం మునిసిపాలిటీలతో పాటు పుట్టపర్తి, మడకశిర, పామిడి నగర పంచాయతీలలో ఇప్పటి వరకు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి 647 మంది దరఖాస్తు చేశారు. వారిలో 482 మంది అర్హులని అధికారులు తేల్చారు. మిగతా వారి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. అర్హమైన వాటిలో బ్యాంకు ఖాతా నెంబర్ సరిగా ఉందా? లేదా? అన్ని పత్రాలు సరిగా ఉన్నాయా లేదా అని చూసి 191 తేల్చగా తొలివిడత ప్రోత్సాహకం రూ.2,500 వంతున ఈ పాటికే జమ చేయాలి. అయితే ఈ ప్రక్రియ నేటీకి జరగకపోవడంతో ప్రభుత్వ తీరుపై నిరసనలు వ్యక్తమౌతున్నాయి.
 ఏం.. జరుగుతోందంటే..
 2012 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రతి 100 మంది బాలురకు 74 మంది బాలికలు ఉన్నట్లు సర్వేలు తేల్చాయి. దీంతో ఆడపిల్లల సంఖ్య పడిపోకూడదని, వీరి శాతం పెరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బాలికాభ్యుదయ సాధికారిక చట్టాన్ని 2013 జులై 2వ తేదీ నుంచి అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే బంగారు తల్లి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఐకే పీ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా పర్యవేక్షిస్తున్నాయి. 2013 మే ఒకటో తేదీ తర్వాత పుట్టిన ఆడపిల్లకు దీనిని వర్తింపజేస్తారు. ఇద్దరు ఆడపిల్లల వరకే ఇది వర్తిస్తుంది. రెండో కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా అర్హులే. ఈ పథకం కింద శిశువు పుట్టిన నాటి నుంచి డిగ్రీ పూర్తి చేసే వరకు రూ.2 లక్షలు పైచిలుకు డబ్బు అందుతుంది. నిర్ధేశిత లక్ష్యం పూర్తి చేస్తూ పోతేనే లబ్ధి పొందుతారని నిబంధన  విధించారు.
 గ్రామీణ ప్రాంతాల్లో మెరుగు..
 గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి కాస్త బాగానే కనిపిస్తోంది. 63 మండలాల్లో మొత్తం 6,826 మంది దరఖాస్తు చేసుకోగా 4,831 మంది అర్హులని తేల్చారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి. వీటిలో అన్ని పత్రాలు సరిగా ఉన్నాయా లేదా? బ్యాంకు ఖాతా నెంబర్ సరిగా ఉందా లేదా అని చూసి 3,178 మంది తల్లుల ఖాతాలకు తొలివిడత ప్రోత్సాహకం రూ.2,500 జమ చేశారు.
 మంజూరు పత్రాలు అందజేశాం
 జిల్లాలోని మునిసిపాలిటీలలోని ‘బంగారుతల్లి’ పథకం కింద అర్హులైన 191 మంది రచ్చబండలో మంజూరు పత్రాలు అందజేశాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల నగదు జమ కాలేదు. హైదరాబాద్ స్థాయిలో ప్రాసెసింగ్‌లో ఉంది. వారం పది రోజుల్లో వారి ఖాతాల్లో ప్రోత్సాహకం జమ అవుతుంది.        
     -నీలకంఠారెడ్డి, మెప్మా
 ఇన్‌చార్జ్ పీడీ, అనంతపురం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement