‘బంగారు తల్లి’ పథకం అమలుకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పథకం అమలులోకి వచ్చి ఏడాది దాటినా శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా లక్ష్యంలో 50 శాతం కూడా సాధించలేదు.
సాక్షి, అనంతపురం : ‘బంగారు తల్లి’ పథకం అమలుకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పథకం అమలులోకి వచ్చి ఏడాది దాటినా శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా లక్ష్యంలో 50 శాతం కూడా సాధించలేదు. గత ఏడాది మే 1న ప్రభుత్వం దీన్ని చట్టంగా చేసింది. వైద్య, ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం ఆ రోజు నుంచి గతేడాది నవంబర్ వరకు జిల్లాలోని పీహెచ్‌సీపీల పరిధిలో 44,097 జననాలు ఉన్నాయి. ఇందులో 20,908 మంది ఆడపిల్లలు పుట్టారు. ఇందులో 90శాతం వరకు తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్ధిదారుల కుటుంబాల్లో పుట్టిన వారే. అంటే దాదాపు 18,090 మందికి పైగా ఆడపిల్లలు బంగారుతల్లులే. అయితే వీరిలో రికార్డులకు ఎక్కింది ఎవరన్నది పరిశీలిస్తే..వాస్తవాలు విస్తుగొలుపుతున్నాయి.
దరఖాస్తు ఓ ప్రహసనం
ఈ పథకానికి అర్హులు కావాలంటే స్థానిక సంస్థ జనన ధ్రువపత్రం లేదా సంబంధిత ఆస్పత్రి వైద్యాధికారి ఇచ్చిన ధ్రువపత్రం ఉండాలి. ఇదంతా శిశువు పుట్టిన వారంలోగా జరగాలి. ఏఎన్‌ఎంలు ఇందుకు బాధ్యత తీసుకోవాలి. కేవలం ప్రసవాలు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలపై దృష్టి సారిస్తున్నంతగా ఈ పథకం వైపు యంత్రాంగం దృష్టి పెట్టడం లేదు. మరో వైపు జనన ధ్రువపత్రం కేవలం మీ-సేవా కేంద్రాల ద్వారానే తీసుకోవాల్సి రావడం గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు ప్రధాన అడ్డంకిగా మారింది.
ఇదీ చాలదన్నట్లు ప్రధాన నిబంధన ఇంకొకటి ఉంది. ఎక్కడ డెలివరీ అయితే అక్కడ జనన ధ్రువపత్రం ఉండాలి. ఎక్కడ ధ్రువపత్రం ఉంటే అక్కడే అర్జీలు దాఖలు చేయాలి. వాస్తవానికి గర్భిణులు కాన్పు సమయానికి పుట్టింటికి వెళ్లే సంప్రదాయం ఉన్నందున ఆ గ్రామంలోనే 90శాతం డెలివరీలు జరుగుతున్నట్లు అంచనా. అంటే అక్కడే జనన ధ్రువపత్రం, దరఖాస్తు తదితర ప్రక్రియలన్నీ పూర్తి చేసుకోవాలి. మెట్టినింటికి (అత్తగారింటికి) వెళ్లాక.. అక్కడ వీరికి ఎలాంటి అవకాశం ఉండడం లేదు. బంగారు తల్లి పథకానికి ఇది పెద్ద అవరోధంగా మారిందని, జననాల సమాచారం కూడా ఆశ, ఏఎన్‌ఎం సిబ్బంది చెప్పడం లేదని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, స్థానిక సంస్థలు, డీఆర్‌డీఏల మధ్య ఉన్న సమన్వయలోపం సమాచార మార్పిడిలో జాప్యం కారణంగా లబ్ధిదారుల కుటుంబాలకు నష్టం జరుగుతోంది.
‘బంగారు తల్లి’ నమోదు ఇలా...
జిల్లాలోని పీహెచ్‌సీల పరిధిలో (గ్రామీణప్రాంతాల్లో) గత ఏడాది మే 1 నుంచి ఈ యేడాది మే వరకు దాదాపు 85 వేల జననాలు జరిగినట్లు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో దాదాపు 38,500 మంది ఆడపిల్లలున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే వైద్య ఆరోగ్యశాఖరికార్డుల మేరకు గత ఏడాది మే 1 నుంచి గత ఏడాది నవంబర్ చివరి వరకు జిల్లాలో 44,094 మంది జన్మించారు. వీరిలో బాలికలు 20,908 మంది ఉన్నారు. అయితే గత ఏడాది మే నుంచి ఈ ఏడాది మే వరకు డిఆర్‌డీఏ లెక్కల ప్రకారం 14,919 దరఖాస్తులు వచ్చాయి. అంటే గతేడాది నవంబర్ వరకు నమోదైన జననాలోనే జిల్లా అధికారుల ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించలేదన్నమాట.
కాగా దరఖాస్తు చేసుకున్న వాటిలో 12,537 అర్హత పొందాయి. ఇందులో 6,920 మందికి తొలి బిడ్డ అంటే ఒకొక్కరికి రూ.2,500 చొప్పున వెంటనే కేటాయించారు. వాస్తవానికి ఏడాది కాలంలో జిల్లాలో జరిగిన జననాల్లో ఇది కేవలం 25 శాతం కూడా దాటలేదని తెలుస్తోంది. ఇక 211 మంది దరఖాస్తుదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు జతచేయకపోగా, ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేని 20 మంది దరఖాస్తులను అధికారులు వెనక్కు పంపించారు.
ఇక 285 దరఖాస్తులు ఏపీఎం, 91 దరఖాస్తులు డీపీఎం పరిశీలనలో ఉండగా, 1784 మంది లబ్ధిదారులకు చెల్లింపులు చేయడానికి నివేదిక సిద్ధంగా ఉంది. ఇక మొదటి చెల్లింపులకు సంబంధించి 3,400 దరఖాస్తులను అధికారులు బ్యాంకులకు పంపించారు. నిజానికి ఈ చట్టం వర్తిస్తే ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి డిగ్రీ చదివే వరకు, వివాహం అయ్యే వరకు ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో ఆయా దశలను బట్టి డబ్బును జమ చేస్తుంది. 21 ఏళ్ల నాటికి మొత్తంగా రూ.2 లక్షలు మేర లబ్ధి కల్గించే ఈ పథకం పర్యవేక్షణ, అవగాహన లేమి కారణంగా నీరుగారుతోంది.