అనంతపురం : న్యాయవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ పరీక్షను శనివారం (మే 30) నిర్వహిస్తున్నట్లు ఏపీ లాసెట్ కన్వీనర్ ఆచార్య శేషయ్య శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పది రీజనల్ కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. బీఎల్, ఎల్‌ఎల్‌బీ అభ్యర్థులకు ఉదయం 10గంటల నుంచి 11.30 వరకు, పీజీ అభ్యర్ధులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం నాలుగు వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. బ్లూ లేదా బ్లాక్ పెన్ మాత్రమే పరీక్షకు వాడాలన్నారు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాలులో నిషేధించినట్లు పేర్కొన్నారు.