హైదరాబాద్ నగరానికి రాష్ట్ర హోదా ఇచ్చి కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించాలని తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ శుక్రవారం యూపీఏ సర్కార్ను డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి రాజకీయ కోణంలో రాష్ట్రాన్ని విభజిస్తున్నారని సెటిలర్స్ ఫ్రెంట్ ఆరోపించింది. రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నటికి క్షమించరని పేర్కొంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తమను ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మనడం సరికాదని తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రాంత వాసులకు రక్షణ కల్పించేందుకు చట్టం చేస్తామని కాంగ్రెస్ చెప్పడాన్ని ఫ్రంట్ తప్పుబట్టింది. ముంబయిలో మహారాష్ట్రేతరులపై జరిగే దాడుల విషయంలో అలాంటి చట్టాలు చేశారా అని ఫ్రంట్ ప్రశ్నించింది. హైదరాబాద్‌పై పీటముడి ఏర్పడిన ప్రస్తుత సమయంలో అంబేద్కర్ సూచించినట్టు హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా ప్రకటించాలని తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ డిమాండ్ చేసింది.
రాష్ట విభజనను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని ఎన్జీవో నేత సాగర్ శుక్రవారం విజయవాడలో స్ఫష్టం చేశారు. కేంద్రమంత్రులు, సీమాంధ్ర నేతలు భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రమంత్రుల మౌనం సీమాంధ్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 12 అర్థరాత్రి నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సాగర్ స్పష్టం చేశారు.
అలాగే సీమాంధ్రలో ఈ నెల 13 నుంచి గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు రాష్ట్ర గంథ్రాలయ సంస్థ అధ్యక్షుడు మధుసూదన్రాజ్ విజయవాడలో వెల్లడించారు. ఉద్యమంలో భాగంగా సీమాంధ్రలోని వెయ్యి గ్రంథాలయాలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సీమాంధ్రలోని దాదాపు 15 వందల మంది గ్రంథాలయ ఉద్యోగులు ఆ సమ్మెలో పాల్గొంటారని మధుసూదన్రాజ్ తెలిపారు.
రాష్ట్ర విభజన జరిగితే భవిష్యత్తులో రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ యంవీఎస్ నాగిరెడ్డి శుక్రవారం విజయవాడలో వెల్లడించారు. రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్కుమార్ రెడ్డి ఇప్పటికైన స్పందించడం హర్షించదగిన పరిణమం అని ఆయన పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఆనాడే సీఎం కిరణ్ అడ్డు చెప్పి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉండేది కాదని యంవీఎస్ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.