'అనగనగా ఓ రాజు మంత్రి అయ్యాడు'
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు విమానాశ్రయం ఒక్కటే ముఖ్యం కాదని కేంద్ర విమానాయాన శాఖ పదవిని దక్కించుకున్న విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు అన్నారు. తెలంగాణ, సీమాంధ్రలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి అభివృద్ధికి కేంద్ర సాయం కోసం కృషి చేయాల్సి ఉందని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అశోక్ గజపతి రాజు అన్నారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన.... అనగనగా ఓ రాజు మంత్రి అయ్యాడని చమత్కరించారు. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.
విమానయానం సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని అశోక్ గజపతి రాజు తెలిపారు. విమానయాన రంగం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాల ఏర్పాటుకు అధికారులతో చర్చలు జరుపుతామన్నారు. సున్నితమైన రాష్ట్ర విభజన అనే ఆపరేషన్ను యూపీఏ కఠిన పద్ధతుల్లో చేపట్టిందని అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడా అనేది ఇంకా ఖరారు కాలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఉన్నందున టీడీపీ మహానాడుకు హాజరు కాలేకపోవటం బాధాకరంగా ఉందని గజపతిరాజు తెలిపారు.