నేనే మంత్రిని | i am the minister says devineni uma | Sakshi
Sakshi News home page

నేనే మంత్రిని

Published Wed, Aug 27 2014 3:04 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

నేనే మంత్రిని - Sakshi

నేనే మంత్రిని

నేను చెబితేనే నామినేటెడ్ పదవి
అధికారులంతా నా మాట వినాల్సిందే లేకుంటే శంకరగిరి మాన్యాలే
ఇంటి వద్దే అధికారులతో సమీక్షా సమావేశాలు
బందరులో ఓ టీడీపీ నాయకుడి హల్‌చల్

 
ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి అధికార పార్టీ నేతల ఆగడాలు శృతిమించి పోతున్నాయి. ఓ వైపు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల పైన ప్రత్యక్షంగా దాడులకు దిగుతూనే మరోవైపు  అధికారులపై పెత్తనం చలాయిస్తున్నారు. తమ మాట వినకుంటే          శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని బెదిరిస్తూ వారి పబ్బం గడుపుకొంటున్నారు. బందరులో ఓ మాజీ ప్రజా ప్రతినిధి వ్యవహరిస్తున్న తీరు విమర్శలపాలవుతోంది.
 
 మచిలీపట్నం : ‘‘ప్రభుత్వం మాదే, నేనే మంత్రిని, నా మాట వినకుంటే ఎవరినైనా శంకరగిరి మాన్యాలు పట్టిస్తా, నామినేటెడ్ పదవులు నేను చెప్పిన వారికే వస్తాయి. నేను చెప్పిన వారికే కాంట్రాక్టులు, కమీషన్లు ఇవ్వాలి. అధికారులంతా నా మాట వినాల్సిందేనంటూ’’ ఓ టీడీపీ నాయకుడు మచిలీ  పట్నంలో హల్‌చల్ చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా మండల పరిషత్, జిల్లా పరిషత్ తదితర శాఖల అధికారులను తన ఇంటికి పిలిపించుకుని సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.  గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాస్థాయి పదవిలో కొనసాగిన ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అధికార, అనధికార కార్యక్రమాల్లో  ఎక్కడపడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా కార్యక్రమాలకు హాజరై తానే ప్రభుత్వం నడుపుతున్నట్లు మాటల కోటలు                  దాటిస్తున్నారు.

అంతా ఆయన కనుసన్నల్లోనే.....

 మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొల్లు రవీంద్ర టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటుండగా ఇదే అదనుగా భావించిన ఈ నాయకుడు అధికారులను తన ఇంటికి పిలిపించుకుంటున్నారు. ప్రభుత్వం ద్వారా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కాంట్రాక్టు పనులను తాను సిఫార్సు చేసిన వారికే ఇవ్వాలని  ఆదేశాలు  జారీ చేస్తున్నారు. లేదు, కాదు అంటే ఇబ్బందులు పడతారని బెదిరింపులకు దిగుతున్నారు. ఇటీవల జిల్లా పరిషత్, మండల పరిషత్ తదితర విభాగాలకు చెందిన అధికారులకు ఫోన్ చేసి మీతో మాట్లాడాలి ఇంటికి రండని తనదైన శైలిలో చెప్పి వారిని ఇంటికి పిలిపించుకున్నట్లు టీడీపీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. అసలు మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీ సమావేశాల్లో ఉండగా మచిలీపట్నంలో ఈయన మరో అనధికార మంత్రిగా పెత్తనం చెలాయించడం అధికారులు, టీడీపీ కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది.

నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తానంటూ...

సెప్టెంబరు 5వ తేదీ నుంచి జిల్లాలోని నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ అవుతాయని, తాను చెప్పిన వారికే నామినేటెడ్ పోస్టులు నూటికి నూరుశాతం వస్తాయంటూ ఈయన చేసే హడావుడికి కార్యకర్తలు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకైనా మంచిదని కొందరు కార్యకర్తలు ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు పడిగాపులు పడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల కోసం ఆయన వద్దకు వెళ్లిన కార్యకర్తలను తనదైన శైలిలో గాలం వేస్తూ మీకు తప్పకుండా పదవులు వస్తాయంటూ భుజం తట్టి మరీ భరోసా ఇస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మచిలీపట్నం నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొనడం అటు అధికారులకు, ఇటు కార్యకర్తలకు తలనొప్పిగా మారిందనే వాదన వినబడుతోంది. మంత్రి కొల్లు రవీంద్ర మాట వినాలా లేక తానే మంత్రినని చెప్పుకునే టీడీపీ నాయకుడి మాట వినాలో తెలియక అధికారులు, టీడీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement