రోజంతా ఎగిరేది ఎప్పుడో?! | I chose different ones all day! | Sakshi
Sakshi News home page

రోజంతా ఎగిరేది ఎప్పుడో?!

Published Mon, Sep 9 2013 3:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM

I chose different ones all day!

సాక్షి, విశాఖపట్నం:  శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న విశాఖ విమానాశ్రయం నుంచి 24 గంటల సేవలకు విఘాతాలు కొనసాగుతూనే ఉన్నా యి. ప్రయాణికుల డిమాండ్, కార్గో అవకాశాలు పుష్కలంగా ఉ న్నా, పలు విదేశీ విమానయాన సంస్థలు సర్వీసులందించేం దుకు ముందుకు వస్తున్నా  ముహూర్తం కుదర డం లేదు. నేవీ అధికారుల తీరు ప్రధాన అడ్డంకిగా మారిం ది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్  తర్వాత విశాఖ నుంచి ఏటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

డిమాండ్ పెరగడంతో పలు ప్రైవేటు విమానయాన సంస్థలు ఇక్కడ నుంచి సర్వీసులు ప్రారంభించాయి. మరికొన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దడానికి మాత్రం నేవీ తీరు అడ్డంకిగా మారింది. విమానాశ్రయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా తూర్పు నావికాదళం (నేవీ) అనుమతి తప్పనిసరి. నేవీ అధికారులు సహకరిస్తేనే పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయన్నది సత్యం. కానీ వారి స్పందనే సంతృప్తికరంగా లేదు.
 
అన్నీ ఉన్నా...

 ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం నుంచి రోజుకి దాదాపు 32 సర్వీసులు కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఒడిశా, చత్తీస్‌గడ్ రాష్ట్రాల్లోని పలుప్రాంతాలకు చెందిన 3 కోట్ల జనాభాకు ఈ విమానాశ్రయమే ఆధారం. విమానాశ్రయం పరిసరాల్లో దాదాపు 20 మంది ట్రావెల్ ఏజెంట్లున్నారు. వీరి ద్వారా 50 శాతం టికెట్లు బుక్ అవుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయంగా (అప్‌గ్రేడ్) అభ్యున్నతి సాధించాక ప్రయాణికుల సంఘాల ఒత్తిడి, కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఇక్కడ నుంచి 24 గంటల సేవలకు అనుమతించింది.

తొలుత నేవీ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఎయిడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది సంఖ్య 350కి పెంచారు. వారికి విడతల వారీగా శిక్షణ ఇప్పించేందుకు కూడా నేవీ అంగీకరించింది. ఒప్పందం కుదిరి 9 నెలలు దాటుతున్నా ఇప్పటికీ 24 గంటల సేవలు అందుబాటులోకి రాకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 ఆసక్తి చూపుతున్నా...

 విశాఖ నుంచి విదేశాలకు నేరుగా సర్వీస్‌లందించేందుకు పలు విమానయాన సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే సింగపూర్‌కు వారంలో మూడు రోజులు (బుధ, శుక్ర, ఆది) సర్వీస్‌లు నడుస్తున్నాయి. వచ్చేనెల 23 నుంచి వారానికి నాలుగు రోజులు సింగపూర్ విమానం నడుపుతామని సిల్క్‌యిర్‌వేస్ ప్రకటించింది. దుబాయ్‌కి రోజూ విమానం ఉంది. విశాఖ నుంచి సేవలందించేందుకు తాము సిద్ధమేనని థాయ్ ఎయిర్‌వేస్ ఇటీవల ప్రకటించింది. ఇందుకు అవసరమైన సర్వే కూడా ఆ సంస్థ చేపట్టింది.

ఇటీవల కాలంలో విమానాశ్రయం నుంచి కార్గో రవాణా కూడా అధికమైంది. విదేశీ సంస్థలు ఆసక్తికి ఇది కూడా కొంత కారణం. మరోవైపు హైదరాబాద్ వరకు లేట్‌నైట్ సర్వీస్‌లు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పైస్‌జెట్, ఇండిగో సంస్థలు ముందుకు వచ్చాయి. రాజధాని నుంచి రాత్రి బయల్దేరిన విమానం విశాఖకు అర్ధరాత్రి చేరుకుని తిరిగి తెల్లవారు జామున ఇక్కడ నుంచి బయలుదేరేలా చర్యలు తీసుకుంటే ఎంతోమంది ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుందని ప్రయాణికుల సంఘం ఎప్పటి నుంచో చెబుతున్నాయి.

ఇందుకు విమాన సంస్థలు సిద్ధంగా ఉన్నా పరిస్థితులే అనుకూలించడం లేదు. 24 గంటల సేవలకు రాతపత్రాలు సిద్ధమైనా ఇందుకు అనుకూలంగా నేవీ అధికారులు స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెరిగిన రద్దీకి అనుగుణంగా తామూ స్పందిస్తామని గతంలో మాటిచ్చిన నేవీ కేంద్రం అనుమతిచ్చినా తాను మాత్రం మోకాలడ్డుతోంది. ఇప్పటికైనా నేవీ అధికారులు లేట్‌నైట్ సర్వీసులు, కార్గోరవాణా, వివిధ దేశాల కనెక్టివిటీకి సంబంధించి ఏటీసీ సిబ్బందిని పెంచడం, 24 గంటల సేవలకు అనుమతి వంటి విషయాల్లో తక్షణం స్పందించాలని విశాఖ ఐటీ సెజ్ ఉపాధ్యక్షుడు ఓ.నరేష్‌కుమార్ కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement