నాకు న్యాయం చేయండి | I do justice to | Sakshi
Sakshi News home page

నాకు న్యాయం చేయండి

Published Fri, Dec 20 2013 5:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

I do justice to

=పెళ్లి చేసుకుంటానని సర్పంచ్ రాజేష్‌నాయక్ మోసగించాడు
 =గిరిజన యువతి ఆరోపణ
 =కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

 
తొర్రూరు, న్యూస్‌లైన్ : పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనను తొర్రూరు సర్పంచ్ రాజేష్ నాయక్ మోసగించాడని ఓ గిరిజన యువతి ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం శివారు నంద్యాతండాకు చెందిన బానోతు సుజాత గురువారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో విలేకరుల సమావేశంలో తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించింది. ఆమె కథనం ప్రకారం.. సుజాత ఏడాదిగా మానుకోటలోని ఓ నర్సింగ్ కళాశాలలో చదువుతోంది.

ఈ క్రమంలో ఆమె అన్నయ్య స్నేహితుడు కిషన్ నాలుగు నెలల క్రితం తొర్రూరు సర్పంచ్ రాజేష్‌నాయక్‌ను ఆమె చదువుతున్న కళాశాలకు తీసుకెళ్లాడు. ఆమె కు రాజేష్‌నాయక్‌ను పరిచయం చే సి, నిన్ను పెళ్లి చేసుకుంటాడని చెప్పాడు. అయితే తనకన్నా ఆయనకు ఎక్కువ వయసు ఉండడంతో పెళ్లికి ఒప్పుకోలేదని ఆమె తెలిపింది. అయితే అప్పటి నుంచి రాజేష్‌నాయక్ పెళ్లి చేసుకుంటానని తరచూ నంద్యాతండాకు వస్తూ, ఫోన్లు చేస్తూ ఆమెను వేధించాడు. కాగా ఆమె అన్నయ్య ఓ కేసులో నెల్లికుదురు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా, అతడిని బయటికి తీసుకొచ్చేందుకు ఆమె తప్పనిసరి పరిస్థితు ల్లో రాజేష్‌నాయక్‌కు ఫోన్ చేసింది.

అప్పటి నుంచి మరింతగా తనతో చనువుగా ఉంటున్నాడు. రెండు నెలల క్రితం రాత్రి తొమ్మిది గంటల సమయంలో సుజాతకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పాడు. రావొద్దని ఆమె చెప్పినా వినకుండా బైక్‌పై తండాకు వెళ్లి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని తొర్రూరుకు తీసుకొచ్చాడు. గ్రామపంచాయతీ ఆఫీస్‌లో తనతో రెండు గంటలపాటు ఉన్నాడని, ఇంతలోనే పోలీసులు వచ్చారంటూ వెంటనే తనను అక్కడి నుంచి ఓ వ్యక్తి బైక్‌పై తన ఇంటికి పంపించాడని ఆమె పేర్కొంది. మరుసటి రోజు రాజేష్‌నాయక్ స్నేహితులు రాజు, భాస్కర్, బాబురావు తనను కారులో శ్రీకాళహస్తికి తీసుకెళ్లి వారం రోజులపాటు అక్కడే ఉంచారని తెలిపింది.

తిరిగొచ్చిన తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని రెండు నెలలుగా అడుగుతుంటే నీవు మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ అసత్య ప్రచారం చేస్తూ, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని వాపోయింది. నెల్లికుదురు, తొర్రూరు పోలీస్‌స్టేషన్లతోపాటు డీఎస్పీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశానని, అయినా పోలీసులు పట్టించుకోకుండా అతడిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. తనకు అన్యాయం చేసిన రాజేష్‌పై కఠిన చర్యలు తీసుకుని, మరో యువతికి ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని వేడుకుంది.
 
ఓర్వలేకే ఆరోపణలు : సర్పంచ్ రాజేష్ నాయక్

 గ్రామపంచాయతీలో జరిగిన ఘటన తర్వాత రెండు నెలలుగా ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా నా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే  కొందరు ఆరోపణలు చేయిస్తున్నారు. ఆమెకు నా రాజకీయ ప్రత్యర్థులు తరచూ ఫోన్ చేస్తూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, మీడియా ముందుకు వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారు. నా ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement