నాకు ప్రాణహాని ఉంది
పార్వతీపురం: ‘క్షణ క్షణం...ప్రాణ భయం...నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎక్కడ చంపుతారోననే భయం... పోలీ సులను ఆశ్రయించినా ఫలితం లేదు..’ ఇదీ విశాఖపట్నం ట్రెజరర్ అండ్ అకౌం ట్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డెరైక్టర్ హోదాలో ఉన్న జి.నిర్మలమ్మ అనే గ్రూప్-1 అధికారిణి ఆవేదన. పోస్టల్ సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేసిన తన తండ్రి వద్ద నుంచి రూ.25లక్షలు అప్పుగా తీసుకున్న కొంతమంది వ్యక్తులు.. ఆ డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరింపులతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె బుధవారం మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ నిర్మలమ్మ ఆవేదన.. ‘నా పేరు జి.నిర్మలమ్మ. విశాఖపట్నంలోని ట్రెజరర్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డెరైక్టర్ హోదాలో పని చేస్తున్నా. మా నాన్న పార్వతీపురం పట్టణానికి చెందిన విశ్రాంతి పోస్టల్ సూపరింటెండెంట్ గూనాన వెంకటయ్య వద్ద కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి ఇవటూరి జయరాం అనే వ్యక్తి 2014, మే 25వ తేదీన రూ.25 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆయనకు అప్పు ఇచ్చే సమయంలో సాక్షులుగా పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామానికి చెందిన బొత్స రవికుమార్, పార్వతీపురం పట్టణానికి చెందిన దొనకొండ గౌరునాయుడు ఉన్నారు.
మా తండ్రి వెంకటయ్య 2015, నవంబర్ 25న పార్వతీపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఒక్కగానొక్క వారసురాలినైన నేను, నాన్న ఇచ్చిన అప్పు తీర్చాలని అడిగితే ఈ రోజు.. రేపు.. అంటూ సంవత్సరాలు గడిపారు. చివరికి ఇవ్వం.. నీ దిక్కున్నచోట చెప్పుకో.. అంటూ బెదిరిస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ష్యూరిటీ ఇచ్చిన చెక్కులు కూడా బౌన్సు కావడంతో కోర్టును ఆశ్రయించి నెలలు తరబడి వాయిదాలకు తిరుగుతున్నాను. నా తండ్రి కూడా అప్పుతీర్చాలని ఒత్తిడి చేయడంతో పథకం ప్రకారం రోడ్డు ప్రమాదం చేయించి ఉంటారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను. మాక్కు డబ్బు ఇవ్వకుండా ఉన్న వ్యక్తితో పార్వతీపురం పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు చేయి కలిపి అప్పులు ఇప్పించడం, తరువాత వారిని మోసం చేస్తున్నారు.
చంపుతామని బెదిరిస్తున్నారు. ప్రస్తుతం నా తండ్రి వద్ద తీసుకున్న అప్పు తీర్చకుండా నన్ను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు నాకు న్యాయంచేయాలి. నా తండ్రి మరణంపై దర్యాప్తు చేయాలి..’ అని ఆమె వేడుకున్నారు. నిర్మలమ్మకు ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ చైర్మన్ జేటీ రామారావు అండగా నిలిచారు. నిర్మలమ్మకు న్యాయం చేయకపోతే మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్‌ను ఆశ్రయించి ఆందోళన చేపడతామని రామారావు చెప్పారు. విలేకరుల సమావేశంలో కౌన్సిలర్ ఒ.రామారావు, గూనాన రాములు తదితరులు పాల్గొన్నారు.