సాక్షి, గుంటూరు: ఎన్నికలు వచ్చినవి కాబట్టే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రజలను మోసం చేయడానికి వచ్చారని స్థానిక వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. గల్లా జయదేవ్ కేవలం అతిథి ఎంపీ అని, ఐదేళ్ల కాలంలో ప్రజల సమస్యలను ఏమైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. గుంటూరులో జయదేవ్‌ను తాను, మంగళగిరిలో లోకేష్‌ను ఆళ్ల రామకృష్ణారెడ్డి ఖచ్చితంగా ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. ఆర్కే భారీ మెజార్టీతో లోకేష్‌ను మట్టికరిపించడం ఖాయమన్నారు. గల్లాను ఓడించేందుకే తాను గుంటూరు ఎంపీగా పోటీచేస్తున్నానని మోదుగుల వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలన్న భావన్న ప్రజలందరిలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. (విజిటింగ్ ప్రొఫెసర్ గల్లా.. గుల్లే..!)
ఐదేళ్ల కాలంలో గల్లా జయదేవ్ ఎన్నిసార్లు గుంటూరు వచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని మండలాల పేర్లు కూడా గల్లాకు సరిగ్గా తెలియవని ఆరోపించారు. ఆయనకు ఎంపీ పదకి ఆభరణమని, తనకు ఆయుధమని వర్ణించారు. దాని ద్వారానే ఏపీకి ప్రత్యేక హోదాని తీసుకువస్తామని వ్యాఖ్యానించారు. పొన్నురులో ఐదుసార్లు గెలిచిన ధూళ్లిపాళ్ల నరేంద్రకి ఈసారి చెక్‌పెడతామని, ఆయనొక కిలాడి అని విమర్శించారు. గుంటూరుకు ఐదేళ్ల కాలంలో తొమ్మిది మంది మున్సిపల్ కమిషనర్లను మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment