
చంద్రబాబు రక్తపిపాసి.. చర్చకు సై: కేసీఆర్
తెలంగాణ అభివృద్ధిపై చంద్రబాబుతో ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సవాలు విసిరారు. ఎన్కౌంటర్ల పేరుతో వందలాది మంది యువకుల ప్రాణాలు తీసిన రక్తపిపాసి చంద్రబాబేనని, అవినీతికి ఆయన మారుపేరని మండిపడ్డారు. దాని ఫలితంగానే అలిపిరి దాడి జరిగిందని అన్నారు. తన గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, బహిరంగ చర్చకు వస్తే తన చరిత్ర ఏంటో, చంద్రబాబు చరిత్ర ఏంటో తేలిపోతుందని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం తాను కేంద్ర మంత్రిపదవిని కూడా గడ్డిపోచలా వదిలేస్తే బాబు మాత్రం పదవి కోసం మామకే వెన్నుపోటు పొడిచాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాగానే లోకేశ్, బ్రహ్మణి, భువనేశ్వరి.. ఇలా అందరి పేర్ల మీద ఉన్న బినామీ భూములన్నింటినీ కక్కిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు తనతో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి చిదంబరమే స్వయంగా చెప్పారని, కాంగ్రెస్తో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నది బాబేనని కేసీఆర్ విమర్శించారు.
''ఫాంహౌస్లో పడుకుంటా, నా ఇష్టం. నీకేం బాధ? కావాలంటే నువ్వు కూడా రా.. నీకేం అభ్యంతరం? కావాలంటే వారం రోజులుంటా, వ్యవసాయం చేసుకుంటా. నాకు వచ్చిన పనేంటో చూసుకుంటా. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి చెప్పి మరీ నేను ఆమరణ దీక్షకు దిగాను. చంద్రబాబు ఢిల్లీలో ఎందుకు దీక్ష చేశాడో చెప్పగలడా? ఒక్కోసారి ఒక్కోమాట చెబుతావు. ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చింది నువ్వు కాదా? ఉప ఎన్నికల్లో 12కు 12 స్థానాల్లోనూ డిపాజిట్లు పోయినా ఇంకా బుద్ధి రాలేదా? ఇలాంటి దొంగలకు ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారా?'' అని కేసీఆర్ అడిగారు.