ఏపీకి 211, తెలంగాణకు 163
ఐఏఎస్‌ల కేటాయింపుపై కేంద్రం నోటిఫికేషన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 211 ఐఏఎస్, 144 ఐపీఎస్, 82 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) పోస్టులను కేటాయిస్తున్నట్టు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి 163 ఐఏఎస్, 112 ఐపీఎస్, 65 ఐఎఫ్‌ఎస్ పోస్టులను కేటాయించింది. మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రత్యూష్‌సిన్హా నేతృత్వంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ రూపొందించిన మార్గదర్శకాల మేరకు కేంద్రం ఈ కేటాయింపులు జరిపింది.
ఏపీ ఐఏఎస్‌లలో ఒక చీఫ్ సెక్రటరీ, ఇద్దరు అడిషనల్ చీఫ్ సెక్రటరీలు, 12 మంది ముఖ్య కార్యదర్శులు, 11 మంది కార్యదర్శులు, 23 మంది సెక్రటరీ కమ్ కమిషనర్లు, ఒక సెక్రటరీ టు సీసీఎల్‌ఏ, 13 మంది కలెక్టర్లు, 13 మంది జాయింట్ కలెక్టర్లు, ఐటీడీఏ పీవో/పీడీ డీఆర్‌డీఏ/జెడ్పీ సీఈవోలు 8 మంది, వాణిజ్య పన్నుల విభాగంలో జాయింట్/డిప్యూటీ కమిషనర్లు ఇద్దరు, డెరైక్టర్లు 22 మంది, చీఫ్ రేషనింగ్ అధికారి , అడిషనల్ సెక్రటరీలు ఆరుగురు ఉంటారు.
ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 144 మంది ఐపీఎస్ ఆఫీసర్లను కేటాయించగా.. వీరిలో ఒకరు డీజీపీ (పోలీసు బలగాల హెడ్), మరొక డీజీపీ ర్యాంకు అధికారి, ఏడుగురు అడిషనల్ డీజీపీలు, 17 మంది ఐజీపీలు, 13 మంది డీఐజీలు, 40 మంది ఎస్పీలు ఉంటారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్టులు 82 కేటాయించగా.. వీరిలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్(విభాగ అధిపతి), మరొక ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, ఐదుగురు అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్లు, ఆరుగురు చీఫ్ కన్జర్వేటర్లు, 13 మంది కన్జర్వేటర్లు, 25 మంది డిప్యూటీ కన్జర్వేటర్లు ఉంటారు.