సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ పోస్టుల విభజన పూర్తయింది. ఏ రాష్ట్రానికి ఎన్ని పోస్టులో నిర్ణయిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరు రాష్ట్రాలకు ఏ స్థాయిలో ఎన్నెన్ని పోస్టులు ఉండాలో నిర్దేశించింది. ప్రస్తుతం పని చేస్తున్న కేడర్‌తోపాటు, ఖాళీను కూడా కలిపి ఇరు రాష్ట్రాలకు 13:10 నిష్పత్తిలో విభజన చేసింది.
ఐఏఎస్‌లను సీమాంధ్రకు 211, తెలంగాణకు 163 మందిని కేటాయించింది. వీరిలో సీమాంధ్రకు పదోన్నతుల ద్వారా 64 మంది, డెరైక్ట్ రిక్రూటీలు 147 మంది ఉండాలని, తెలంగాణలో పదోన్నతుల ద్వారా 49 మంది, డెరైక్టర్ రిక్రూటీలు 114 మంది ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో ఉన్న సంఖ్యలో ఏ మాత్రం తేడా లేకుండా వీరిని పంపిణీ చేశారు. ఐపీఎస్‌లను సీమాంధ్రకు 144 మంది, తెలంగాణకు 112 మందిని కేటాయించింది. డీజీ స్థాయి పోస్టులు సీమాంధ్రకు 2, తెలంగాణకు 1 కేటాయించారు. ఐఎఫ్‌ఎస్‌లు సీమాంధ్రకు 82, తెలంగాణకు 65 కేటాయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయిలో కేంద్రం నిర్ణయించిన సంఖ్యకు మించి ఎక్స్ కేడర్ పోస్టులను సృష్టించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సీనియర్ డ్యూటీ పోస్టుల్లో రాష్ట్ర డెప్యుటేషన్ రిజర్వ్ 25 శాతానికి, కేంద్ర డెప్యుటేషన్ రిజర్వ్ 40 శాతానికి మించడానికి వీల్లేదని పేర్కొంది. శిక్షణ, జూనియర్ రిజర్వ్ పోస్టులు 3.5 శాతానికి మించకూడదని చెప్పింది. రాష్ట్రంలో మొత్తం 258 ఐపీఎస్ పోస్టులుండగా, ప్రస్తుతం 206 మంది అధికారులే ఉన్నారు. మిగతా 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల్లో మాత్రం 256 పోస్టుల ప్రస్తావనే ఉంది. మిగిలిన రెండు పోస్టులనూ ఒక్కో రాష్ట్రానికి ఒకటి చొప్పున ఇచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు.
సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రతి 100 ఐపీఎస్ పోస్టులకు 67 మంది డెరైక్ట్ రిక్రూటీలు, 33 మంది కన్ఫర్డ్ ఐపీఎస్‌లు ఉండాలి. 67 డెరైక్ట్ పోస్టుల్లోనూ 2/3 వంతు బయటి రాష్ట్రాలకు చెందిన వారు, 1/3 వంతు సొంత రాష్ట్రం వారు ఉంటారు. ఈ లెక్క ప్రకారం సీమాంధ్రకు 101 డెరైక్ట్ రిక్రూట్, 43 కన్ఫర్డ్ పోస్టులు, తెలంగాణకు 78, 34 చొప్పున కేటాయించారు. వీటిలో హెచ్చుతగ్గులు ఉంటే డెప్యుటేషన్లపై ఆ లోటును పూడుస్తారు. ఐఎఫ్‌ఎస్‌లలో ఆంధ్రప్రదేశ్‌కు డెరైక్ట్ రిక్రూటీలు 58, పదోన్నతుల పోస్టులు 24, తెలంగాణలో డెరైక్ట్ రిక్రూటీలు 46, పదోన్నతుల పోస్టులు 19 కేటాయించారు.