ఐ-సెట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థుల తాకిడి
గుంటూరు ఎడ్యుకేషన్
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఐ-సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. గుంటూరులోని రెండు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో చేపట్టిన సర్టిఫికెట్ల పరిశీలనకు 763 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐ-సెట్ కౌన్సెలింగ్ కోసం ఇన్నాళ్లూ ఆత్రుతగా ఎదురుచూసిన విద్యార్థులు జిల్లా నలుమూలల నుంచి పెద్ధ సంఖ్యలో తరలివచ్చారు. నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలన సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రం రాత్రి 10 గంటల వరకూ కొనసాగటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. ఈ కేంద్రానికి 400 మంది హాజరయ్యారు.
విద్యార్థులకు తిప్పలు
హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోవటంతో విద్యార్థులు ఇక్కట్ల పాలయ్యూరు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 9 గంటలకే వచ్చినవారు తమ వంతు కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తాగేందుకు నీరు, కూర్చునేందుకు తగినన్ని కుర్చీలు లేక చెట్ల కిందే గడిపారు.
నేడు 25,001 నుంచి 50 వేల ర్యాంకు
వరకు పరిశీలన
ఐ-సెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా గురువారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో 25,001 నుంచి 37,500 వరకూ, నల్లపాడు హెల్ప్‌లైన్ కేంద్రంలో 37,501 నుంచి 50 వేల ర్యాంకు వరకూ విద్యార్థులు హాజరుకావాలి.