బీజేపీ తకరారు | I'd vote party alliances will be the next election campaign | Sakshi
Sakshi News home page

బీజేపీ తకరారు

Published Sun, Dec 15 2013 3:22 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

I'd vote party alliances will be the next election campaign

సాక్షి, కరీంనగర్ : వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తులు ఉంటాయన్న ప్రచారం కమలనాథులను కలవరపెడుతోంది. టీడీపీతో పొత్తు వల్ల పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువని భావిస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకులు ఆ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రచారానికి తెర దించకపోతే నష్టం తప్పదని భావిస్తున్న కమలనాథులు వెంటనే అన్ని లోకసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కోరుతున్నారు.
 
 రెండు రోజుల క్రితం దక్షిణాది రాష్ట్రాల కార్యనిర్వాహక కార్యదర్శి సతీశ్‌జీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను సమీక్షించారు. అభ్యర్థుల ప్రకటన ద్వారా ఊహాగానాలకు ముగింపు పలకాలని సీనియర్ నేతలు సూచించగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్టు చెప్తున్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల కారణంగా అభ్యర్థులను  ఖరారు చేసే ప్రక్రియపై దృష్టి పెట్టలేదని, త్వరలోనే ఈ కసరత్తు జరుగుతుందని పేర్కొన్నట్టు సమాచారం. కరీంనగర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఈసారి సీనియర్ నేతలు ఆసక్తి చూపుతున్నందున ఇక్కడ అభ్యర్థి విషయంలో చివరి వరకు సందిగ్ధత తప్పదని కమలనాథులు భావిస్తున్నారు. ఎవరికి వారే తమ అభ్యర్థిత్వం కోసం హస్తినలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర మాజీ మంత్రి సీహెచ్.విద్యాసాగర్‌రావు స్థానం తనదేనన్న ధీమాతో ఉన్నారు. ఆయన గతంలో ఇక్కడ నుంచి గెలిచే కేంద్ర మంత్రివర్గంలో చేరారు.
 
 పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శిగా నియమితులయిన పి.మురళీధరరావు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయన పార్టీ పదవి చేపట్టిన వెంటనే పార్టీ ఆదేశిస్తే లోకసభకు పోటీ చేస్తానని ప్రకటించారు. సొంత వేదికలపై జిల్లాలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ అన్ని వర్గాల ప్రముఖులతో సంబంధాలు కొనసాగిస్తున్నారు.
 
 వీరితో పాటు మాజీ ఎంపీ జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా టికెటు పోటీలో ఉన్నారు.టికెటును ఆశిస్తున్న వారు పార్టీ ముఖ్యనాయకులే అయినందున ఈ స్థానం నుంచి ఇంత ముందుగా అభ్యర్థిని ఖరారు చేయడం సాధ్యం కాకపోవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే అభ్యర్థికి సంబంధించి ఒకసారి వివాదం చెలరేగింది. కిసాన్‌మోర్చా జాతీయ అధ్యక్షుడు ఓంప్రకాశ్ ఒక నేత పేరును ప్రస్తావించడం పార్టీలో చిచ్చు రేపింది. ఈ పరిస్థితుల్లో పార్టీ ఆశావాహుల మధ్య సయోధ్య కుదరకుండా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉండదని పార్టీ నేతలు భావిస్తున్నారు.
 శాసనసభకు కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు నాయకత్వం కసరత్తు చేస్తోంది. తొలి విడతలో స్థానికంగా వివాదాలు లేని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారు.
 
 జిల్లాలోని 13 శాసనసభ నియోజకవర్గాలకు నాలుగైదు చోట్ల ఇద్దరికి మించి నేతలు రేసులో ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన నేతలకు నాయకత్వం నుంచి హామీ లభించిందన్న ప్రచారం ఉంది. వీరి పేర్లను ముందుగా ప్రకటించినా అభ్యంతరాలు ఉండవని అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొనడం ద్వారా పార్టీ బలపడిందని, మొదటినుంచి పార్టీలో పని చేస్తున్న నాయకులు వచ్చే ఎన్నికల పట్ల ఆసక్తితో ఉన్నారని పార్టీ నేతలు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇరు ప్రాంతాల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన టీడీపీతో కలిసి వెళ్లడం ఎంతమాత్రం ప్రయోజనకరం కాదని భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement