karimnagar lok sabha
-
Karimnagar Lok Sabha: కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ రికార్డులు మరే పార్టీ బ్రేక్ చేయలేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామంటారు. ఆఖరు వరకు నాన్చుతారు. సీటు కోసం పోటీ పడుతున్న నేతలకు టెన్షన్ పెంచుతారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ తీరు ఇలాగే ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలపుడు కూడా గాంధీభవన్ దగ్గర ఇదే సీన్ కనిపించింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పాత సీన్లే కనిపిస్తాయంటున్నారు. ఉత్తర తెలంగాణలో ఓ కీలకమైన పార్లమెంట్ సీటు వ్యవహారం ఎలా ఉందో చూద్దాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాలిటిక్స్ బాగా హీటెక్కుతున్నాయి. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరోసారి పోటీ చేయనున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ బరిలో ఉంటారు. వీరిద్దరి పేర్లను ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించకపోయినా..ఒకరు సిటింగ్ ఎంపీ, మరొకరు మాజీ ఎంపీ కావడంతో పార్టీ నాయకత్వం ఇచ్చిన సానుకూల సంకేతాలతో ఇద్దరూ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో హస్తం టిక్కెట్ కోసం క్యూ లైన్ బాగా పెరిగింది. గతంలో పోటీ చేసినవారు, ప్రస్తుతం ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ, మంత్రి సోదరుడు ఇలా అనేక మంది కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ సీటు కోసం మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, వెలిచాల రాజేందర్ రావు వంటివారితో పాటు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు పేరు కూడా బాగా ప్రచారంలోకొస్తోంది. బీజేపీ నేత ఈటల రాజేందర్ ఎక్కడా తాను కాంగ్రెస్‌లో చేరి కరీంనగర్ ఎంపీగా పోటీచేస్తున్నట్లు ప్రకటించకపోయినా ఆయన పేరును కూడా ప్రచారం చేస్తున్నారు. ఈటల అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఆయన పేరు కూడా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కరీంగనర్ నుంచి వినిపిస్తోంది. ఇంతమంది పేర్లు ప్రచారంలోకి రావడంతో అసలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు కాబోతున్నారన్నది ఇప్పుడు కరీంనగర్లో ఉత్కంఠగా మారింది. అసెంబ్లీ ఎన్నికలపుడు నామినేషన్లు ముగిసేవరకు కూడా కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. అప్పుడు కూడా అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆఖరులో అభ్యర్థిని ప్రకటించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల సామాజిక వర్గానికి చెందిన నేతనే కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిగా ప్రకటించినా.. బాగా ఆలస్యం కావడంతో అసలు పోటీ ఇవ్వలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కొనసాగిన కన్ఫ్యూజన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జరుగుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం కొనసాగుతోంది. -
బీజేపీ తకరారు
సాక్షి, కరీంనగర్ : వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తులు ఉంటాయన్న ప్రచారం కమలనాథులను కలవరపెడుతోంది. టీడీపీతో పొత్తు వల్ల పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువని భావిస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకులు ఆ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రచారానికి తెర దించకపోతే నష్టం తప్పదని భావిస్తున్న కమలనాథులు వెంటనే అన్ని లోకసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కోరుతున్నారు. రెండు రోజుల క్రితం దక్షిణాది రాష్ట్రాల కార్యనిర్వాహక కార్యదర్శి సతీశ్‌జీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను సమీక్షించారు. అభ్యర్థుల ప్రకటన ద్వారా ఊహాగానాలకు ముగింపు పలకాలని సీనియర్ నేతలు సూచించగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్టు చెప్తున్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల కారణంగా అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియపై దృష్టి పెట్టలేదని, త్వరలోనే ఈ కసరత్తు జరుగుతుందని పేర్కొన్నట్టు సమాచారం. కరీంనగర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఈసారి సీనియర్ నేతలు ఆసక్తి చూపుతున్నందున ఇక్కడ అభ్యర్థి విషయంలో చివరి వరకు సందిగ్ధత తప్పదని కమలనాథులు భావిస్తున్నారు. ఎవరికి వారే తమ అభ్యర్థిత్వం కోసం హస్తినలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర మాజీ మంత్రి సీహెచ్.విద్యాసాగర్‌రావు స్థానం తనదేనన్న ధీమాతో ఉన్నారు. ఆయన గతంలో ఇక్కడ నుంచి గెలిచే కేంద్ర మంత్రివర్గంలో చేరారు. పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శిగా నియమితులయిన పి.మురళీధరరావు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయన పార్టీ పదవి చేపట్టిన వెంటనే పార్టీ ఆదేశిస్తే లోకసభకు పోటీ చేస్తానని ప్రకటించారు. సొంత వేదికలపై జిల్లాలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ అన్ని వర్గాల ప్రముఖులతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. వీరితో పాటు మాజీ ఎంపీ జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా టికెటు పోటీలో ఉన్నారు.టికెటును ఆశిస్తున్న వారు పార్టీ ముఖ్యనాయకులే అయినందున ఈ స్థానం నుంచి ఇంత ముందుగా అభ్యర్థిని ఖరారు చేయడం సాధ్యం కాకపోవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే అభ్యర్థికి సంబంధించి ఒకసారి వివాదం చెలరేగింది. కిసాన్‌మోర్చా జాతీయ అధ్యక్షుడు ఓంప్రకాశ్ ఒక నేత పేరును ప్రస్తావించడం పార్టీలో చిచ్చు రేపింది. ఈ పరిస్థితుల్లో పార్టీ ఆశావాహుల మధ్య సయోధ్య కుదరకుండా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉండదని పార్టీ నేతలు భావిస్తున్నారు. శాసనసభకు కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు నాయకత్వం కసరత్తు చేస్తోంది. తొలి విడతలో స్థానికంగా వివాదాలు లేని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారు. జిల్లాలోని 13 శాసనసభ నియోజకవర్గాలకు నాలుగైదు చోట్ల ఇద్దరికి మించి నేతలు రేసులో ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన నేతలకు నాయకత్వం నుంచి హామీ లభించిందన్న ప్రచారం ఉంది. వీరి పేర్లను ముందుగా ప్రకటించినా అభ్యంతరాలు ఉండవని అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొనడం ద్వారా పార్టీ బలపడిందని, మొదటినుంచి పార్టీలో పని చేస్తున్న నాయకులు వచ్చే ఎన్నికల పట్ల ఆసక్తితో ఉన్నారని పార్టీ నేతలు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇరు ప్రాంతాల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన టీడీపీతో కలిసి వెళ్లడం ఎంతమాత్రం ప్రయోజనకరం కాదని భావిస్తున్నారు.