ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ రికార్డులు మరే పార్టీ బ్రేక్ చేయలేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామంటారు. ఆఖరు వరకు నాన్చుతారు. సీటు కోసం పోటీ పడుతున్న నేతలకు టెన్షన్ పెంచుతారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ తీరు ఇలాగే ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలపుడు కూడా గాంధీభవన్ దగ్గర ఇదే సీన్ కనిపించింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పాత సీన్లే కనిపిస్తాయంటున్నారు. ఉత్తర తెలంగాణలో ఓ కీలకమైన పార్లమెంట్ సీటు వ్యవహారం ఎలా ఉందో చూద్దాం.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాలిటిక్స్ బాగా హీటెక్కుతున్నాయి. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరోసారి పోటీ చేయనున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ బరిలో ఉంటారు. వీరిద్దరి పేర్లను ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించకపోయినా..ఒకరు సిటింగ్ ఎంపీ, మరొకరు మాజీ ఎంపీ కావడంతో పార్టీ నాయకత్వం ఇచ్చిన సానుకూల సంకేతాలతో ఇద్దరూ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో హస్తం టిక్కెట్ కోసం క్యూ లైన్ బాగా పెరిగింది. గతంలో పోటీ చేసినవారు, ప్రస్తుతం ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ, మంత్రి సోదరుడు ఇలా అనేక మంది కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ సీటు కోసం మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, వెలిచాల రాజేందర్ రావు వంటివారితో పాటు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు పేరు కూడా బాగా ప్రచారంలోకొస్తోంది.
బీజేపీ నేత ఈటల రాజేందర్ ఎక్కడా తాను కాంగ్రెస్‌లో చేరి కరీంనగర్ ఎంపీగా పోటీచేస్తున్నట్లు ప్రకటించకపోయినా ఆయన పేరును కూడా ప్రచారం చేస్తున్నారు. ఈటల అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఆయన పేరు కూడా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కరీంగనర్ నుంచి వినిపిస్తోంది. ఇంతమంది పేర్లు ప్రచారంలోకి రావడంతో అసలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు కాబోతున్నారన్నది ఇప్పుడు కరీంనగర్‌లో ఉత్కంఠగా మారింది.
అసెంబ్లీ ఎన్నికలపుడు నామినేషన్లు ముగిసేవరకు కూడా కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. అప్పుడు కూడా అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆఖరులో అభ్యర్థిని ప్రకటించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల సామాజిక వర్గానికి చెందిన నేతనే కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిగా ప్రకటించినా.. బాగా ఆలస్యం కావడంతో అసలు పోటీ ఇవ్వలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కొనసాగిన కన్‌ఫ్యూజన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జరుగుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment