సాక్షి ప్రతినిధి, కడప : ‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’ ఇది ఓ ప్రవేటు కంపెనీ ప్రచార స్లోగన్. దాన్ని ఆదర్శంగా తీసుకున్నారేమో ఏకంగా రూ.4 కోట్లు పైబడి విలువ కలిగిన ప్రభుత్వ స్థలానికి ఎసరు పెట్టారు. చేతులకు మట్టి అంటకుండా పక్కాగా పథక రచన చేశారు. ఉన్నతాధికారి నుంచి చిన్న సమస్యకు పదే పదే వచ్చిన సిఫార్సుల నేపథ్యంలో ఈ వాస్తవం వెలుగు చూసింది. ఉద్యోగాలకే ఎసరు వచ్చే ఘటన కావడంతో మండల రెవిన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది.
కింది స్థాయి సిబ్బంది రికార్డులను సరిచేసి ఉన్న విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. ప్రస్తుతం కడప గడపలో ఈఅంశం హాట్ టాఫిక్‌గా మారింది. కడప నగరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంతానికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభ దశకు చేరడంతో వ్యాపారులు ఆ ప్రాంతంలో స్థలాల కోసం విపరీతంగా ఆన్వేషిస్తున్నారు. ఇలాంటి తరుణంలో 23 సెంట్లు ఉన్న ప్రభుత్వ స్థలంపై ప్రవేటు వ్యక్తుల కన్ను పడింది.
ఎలాగైనా స్వాహా చేయాలనే తలంపుతో జట్టుగా ఏర్పడ్డారు. ఎవరి స్థాయిలో వారు అడ్డంకులు రాకుండా చక్కబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కింది స్థాయి సిబ్బంది సహకరించినా, ఎక్కడా అడ్డంకులు లేకుండా ఉండేందుకు రెవిన్యూ అధికారులకు పరిచయం ఉన్న వారితో జట్టు కట్టారు. ఈ క్రమంలో ఇటీవల డీసీసీబీ డెరైక్టర్‌గా ఎన్నికైన ఓ నేత ఏకంగా కడప ఆర్‌డిఓ చిన్నరాముడుతో సంప్రదింపులు నిర్వహించారు. సమాన వాటాలతో ప్రభుత్వ స్థలాన్ని సొమ్ము చేసుకునే ప్రక్రియకు పథక రచన చేశారు. తన చేతులకు మట్టి అంటుకోకుండా చక్కబెట్టే పని కావడంతో పైరవీలకు ఆర్డీఓ ప్రాధాన్యత ఇచ్చారు.
గుట్టు చప్పుడు కాకుండా..
కడప ఆర్ట్స్ కళాశాల ప్రాంతంలో సర్వే నంబర్ 955లో ఖాళీగా ఉన్న 23 సెంట్ల ప్రభుత్వ స్థలం విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.4 కోట్లు పలుకుతుంది. ఈ స్థలాన్ని స్వాహా చేసేందుకు రంగంలోకి దిగిన ఓ బృందానికి పెండ్లిమర్రి మండలంలో పనిచేస్తున్న ఓ విఆర్‌ఓ సూత్రధారిగా నిలిచారు. కడప రెవిన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఆర్‌ఐ పాత్రధారిగా మారి ముందుకు నడిపించారు. అందుకు ఏఆర్‌ఐకి రూ.12లక్షలు ఒప్పందం చేసుకొని రూ.7 లక్షలు ముట్టజెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
ఏఆర్‌ఐ చేయాల్సిందల్లా ఆన్‌లైన్‌లో సర్వే నంబర్ 955లోని భూమి చంద్రశేఖర్ అనే వ్యక్తికి చెందినదిగా పొందుపర్చడమే. ఈ పని చేయడంలో ఏఆర్‌ఐ సఫలీకృతుడైనట్లు సమాచారం. అనుకున్నట్లు పేరు రికార్డుల్లోకి చేరడంతో స్వాహారాయుళ్లు ఆర్‌టీఐ యాక్టును ప్రయోగించారు. సర్వే నంబర్ 955లోని 23 సెంట్ల భూమికి చెందిన వివరాలు ఇవ్వాలని కోరారు. ఆ స్థలం ప్రభుత్వ భూమి అని దస్త్రాలు పరిశీలించిన అప్పిలేట్ అథారిటీ అధికారిణి జవాబిచ్చారు.
ఖంగుతిన్న స్వాహారాయుళ్లు డీసీసీబీ డెరైక్టర్‌గా ఇటీవల ఎంపికైన ఓ నాయకుడి ద్వారా ఆర్డీఓ చిన్నరాముడును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మీరు కోరినట్లు రికార్డులు అందిస్తే 23 సెంట్లలో సమాన వాటా ఇవ్వాలని ఆ నాయకుడు స్వాహారాయుళ్లుకు చెప్పినట్లు సమాచారం. ఆ మేరకు ఆర్డీఓతో మాట్లాడి ఆన్‌లైన్‌లో నమోదైన రికార్డులు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
పదే పదే సిఫార్సులు చేయడంతో..
కడప నగరంలోని సర్వే నంబర్ 955లోని 23 సెంట్ల భూమి ఎవరిదనే విషయమై ఆన్‌లైన్ పక్రియలో నమోైదైన రికార్డుల ఆధారంగా సమాచారం ఇవ్వాల్సిందిగా ఆర్డీఓ చిన్నరాముడు సిఫార్సులు చేయడం ఆరంభించారు. ఇదే విషయంపై పదే పదే సిఫార్సులు రావడంతో మండల రెవిన్యూ యంత్రాంగానికి అనుమానం పెరిగింది. చిన్న సమస్యకు ఆర్డీఓ స్థాయి అధికారి పదేపదే సిఫార్సులు చేయడం ఏమిటనే కోణంలో ఆలోచించారు.
కంప్యూటర్ రికార్డులు పరిశీలించగా ఆ స్థలం.. ఓ వ్యక్తి అనువంశీకరణగా పొందుపర్చి ఉన్నట్లు సమాచారం. అప్రమత్తమైన యంత్రాంగం నిశితంగా పరిశీలించింది. మ్యానువల్ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉండడం, ఆన్‌లైన్‌లో వ్యక్తి పేరుపై ఉండడాన్ని గమనించారు. ఆర్టీఐ యాక్టు ప్రకారం అడిగిన వారి ఉద్దేశాన్ని పసిగట్టారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆన్‌లైన్ రికార్డుల్లో సైతం ప్రభుత్వ స్థలంగా మార్పు చేశారు. అనంతరం వారు ఈ వ్యవహారం ఉద్యోగాలకే ఎసరు వస్తుందని ఆర్డీఓకు వివరించినట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయాల స్థలాన్ని చాకచక్యంగా స్వాహా చేసే ఎత్తుగడను మండల రెవిన్యూ యంత్రాంగం నిలువరించింది. ఈ విషయం ఆనోటా ఈనోటా పడి బహిర్గతమైంది.
సమాచారం ఇవ్వడం లేదని గ్రీవెన్స్‌లో ఫిర్యాదు వచ్చింది : ఆర్డీఓ చిన్న రాముడు, కడప
గ్రీవెన్స్‌లో ఫిర్యాదులొస్తే ఆర్టీఐ యాక్టు మేరకు సమాచారం ఇవ్వాలని ఆదేశించాను. తెలిసిన వాళ్లు వచ్చి అడిగితే సమాచారం ఇవ్వలేదట.. ఇవ్వండి అని చెప్పి ఉంటాం. నేను చెప్పానని ఏది ఇవ్వమంటే అది ఇవ్వడానికి కడప రెవిన్యూ డివిజన్‌లో చట్టం తెలియని తహశీల్దార్లు ఎవరూ లేరు. రెవిన్యూ రికార్డుల మేరకే వివరాలు అందిస్తారు. కడప పరిధిలోని సర్వే నంబర్ 955 స్థలానికి సంబంధించి నా ప్రమేయంపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలు, అపోహలే చేశారు. తన చేతులకు మట్టి అంటుకోకుండా చక్కబెట్టే పని కావడంతో పైరవీలకు ఆర్డీఓ ప్రాధాన్యత ఇచ్చారు.
ఐడియా అదిరింది.. వ్యూహం బెడిసింది!
Published Sun, Jun 14 2015 2:48 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM
Advertisement