Public space
-
ప్రభుత్వ స్థలం ఆక్రమణ విషయంలో బరితెగింపు
కొమ్మాది: ప్రభుత్వ స్థలాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుకాడకూడదని నిర్ణయించుకున్నాడు ఓ నాయకుడు. గతంలో రెవెన్యూ అధికారులు హెచ్చరించినా ఆక్రమణ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. జీవీఎంసీ 4వ వార్డు కాపులుప్పాడ ఎస్సీ కాలనీలో స్థానిక నాయకుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు వెనుకాడటం లేదు. అక్టోబర్ 23న ఇక్కడి ప్రభుత్వ స్థలంలోని తాటిచెట్లను పొక్లెయిన్‌తో తొలగించాడు. ఈ విషయం అధికారులకు తెలియడంతో అతన్ని మొక్కుబడిగా మందలించి వదిలేశారు. ఇప్పుడు ఈ స్థలాన్ని చదును చేసేందుకు అడ్డుగా ఉన్న సీసీ రోడ్డు, డ్రైనేజీలను ధ్వంసం చేశాడు. మౌనం వహిస్తున్న అధికారులు ఈ ప్రభుత్వ స్థలంలో కొంత భాగాన్ని కల్యాణ మండపానికి కేటాయించారు. ప్రస్తుతం ఈ మండపం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీని పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని సదరు వ్యక్తి దర్జాగా పొక్లెయిన్ పెట్టి పనులు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లు వ్యహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయం వెనుకాలే కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణ జరుగుతున్నప్పటికీ వారు స్పందించక పోవడం విశేషం. ప్రభుత్వ స్థలం ఆక్రమణలో భాగంగా ఎస్సీ కాలనీకి ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు కొంత మేర ధ్వంసమైంది. డ్రైనేజీలను కూడా మూసివేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేదని అంటున్నారు. ఇంత జరుగుతున్నా సచివాలయం నుంచి గానీ, రెవెన్యూ నుంచి గానీ ఒక్క అధికారి కూడా రాలేదని.. దీనిపై సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తామని స్థానికులు తెలిపారు. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తాం ఇక్కడ కొంత మేర ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కావడం వాస్తవమే. గతంలో హెచ్చరించాం. అయితే మరల ఈ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. ఆక్రమణకు గురైన స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తాం. – బడే శ్రీనివాస్, వీఆర్వో, కాపులుప్పాడ చదవండి: డెల్టా, ఒమిక్రాన్ ఒకేసారి సోకితే ఏమౌతుందో తెలుసా? కొత్త వేరియంట్ ప్రత్యేకత అదే.. -
ఎమ్మెల్యే వర్సెస్ సబ్‌కలెక్టర్
ఎస్సారెస్పీ స్థలంలో ఎమ్మెల్యే డ్రైవర్ ఇంటి నిర్మాణం కూల్చివేసిన తహసీల్దార్ తిరిగి నిర్మించిన టీఆర్‌ఎస్‌నాయకులు పనులు నిలిపివేయించిన సబ్‌కలెక్టర్ మెట్పల్లి: ప్రభుత్వ స్థలంలో ఓ ఇంటి నిర్మాణం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సబ్‌కలెక్టర్ ముషారఫ్‌ల మధ్య వివాదానికి దారి తీసింది. పట్టణంలోని రాంనగర్లో ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూటరీ కాల్వ–32కు చెందిన స్థలాన్ని ఎమ్మెల్యే వద్ద డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి అక్రమించి కొన్ని రోజుల నుంచి ఇంటిని నిర్మిస్తున్నాడు. దీనిపై కొందరు సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన దానిని తొలగించాలని తహశీల్దార్ సుగుణాకర్రెడ్డిని ఆదేశించారు. దీంతో తహశీల్దార్ మంగళవారం సాయంత్రం సిబ్బందితో అక్కడకు వెళ్లి దానిని తొలగించారు. పలువురు టీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ తహశీల్దార్ పట్టించుకోకుండా కూల్చివేయించారు. ఇదే విషయాన్ని నాయకులు ఎమ్మెల్యేకు తెలుపగా, ఆయన తహశీల్దార్‌పై తీవ్ర స్థాయిలో అగ్రహాం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతేగాకుండా రాత్రి సమయంలో భారీ ఎత్తున టీఆర్ఎస్ నాయకులు సంఘటనా స్థలానికి తరలివచ్చి తిరిగి ఇంటి నిర్మాణం చేపట్టారు. తహాశీల్దార్పై ఎమ్మెల్యే అగ్రహాం వ్యక్తం చేయడం, తిరిగి నిర్మాణ పనులు చేపడుతున్నారని తెలుసుకున్న సబ్‌కలెక్టర్ నేరుగా పోలీస్ బందోబస్తుతో సంఘటనా స్థలానికి వచ్చారు. ప్రభుత్వ స్థలంలో ఇంటిని ఎలా నిర్మిస్తారంటూ అక్కడ ఉన్న నాయకులపై అగ్రహాం వ్యక్తం చేసి ఇటుకలను తొలగించాలని సిబ్బందికి సూచించారు. దీనికి నాయకులు అడ్డుతగిలి సబ్‌కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. సీఐ సురేందర్‌తో సబ్‌కలెక్టర్ ఆయనతో మాట్లాడి నిర్మాణ పనులు జరుగకుండా చూడాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
బ్రిటన్ కూడా ఆ కారును టెస్ట్ చేసేసిందట!
లండన్ : సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలపై ఓ వైపు టెక్ దిగ్గజాలు, మరోవైపు స్థానిక ప్రభుత్వాలు పట్టుబిగ్గుస్తున్నాయి. స్థానికంగా తయారుచేసిన డ్రైవర్‌లెస్ వాహనాలను మొట్టమొదటిసారి బ్రిటన్ బహిరంగ ప్రదేశాల్లో విజయవంతంగా పరీక్షించింది. దక్షిణ బ్రిటన్‌లోని మిల్టన్ కీన్స్ పట్టణంలో ఈ వాహనాలను పరీక్షించినట్టు ఆక్స్బోటికా అనే కంపెనీ వెల్లడించింది. సాప్ట్‌వేర్‌తో నడిచే టెస్ట్ వెహికిల్ సెలీనియమ్ను ఆక్స్బోటికా కంపెనీ ఇంటిగ్రేటెడ్‌గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అభివృద్ధి చేశారు. కెమెరాల నుంచి లేడార్ సిస్టమ్‌తో తనకు తానుగా మార్గనిర్దేశం చేయబడుతూ సెలీనియం ప్రయాణించగలదని ఆక్స్బోటికా కంపెనీ తెలిపింది. మిల్టన్ కీన్స్ రైల్వే స్టేషన్లో, బిజినెస్ జిల్లాలో ఈ వాహనం విజయవంతంగా పరీక్షించామని కంపెనీ ఆనందం వ్యక్తంచేసింది. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ క్యాటాపుల్ట్(టీఎస్సీ) 18 నెలల కృషి అనంతరం వీటిని అమలోకి తెచ్చినట్టు కంపెనీ పేర్కొంది. సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీస్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ వాహనాలను పరీక్షిస్తున్నామని తెలిపింది. బ్రిటీష్ ప్రభుత్వ ఇన్నోవేషన్ ఏజెన్సీ, ఇన్నోవేట్ యూకే స్థాపించిన టెన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్లలో టీఎస్సీ ఒకటి. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను యూకే, ప్రపంచ రోడ్లపై పరుగులెత్తించడానికి ఇది ఓ మైలురాయి అని ఆక్స్బోటికా సీఈవో గ్రేమ్ స్మిత్ అన్నారు. భవిష్యత్తులో అర్బన్ ప్రాంతాల్లో కూడా స్థానిక ట్రాన్స్ఫోర్టేషన్కు ఈ వాహనాలను వాడేలా అభివృద్ధి చేయగలుగుతామని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. -
వెయ్యి కోట్ల స్థలం..
► శేరిలింగంపల్లిలో సర్కారు స్థలాల ప్రక్షాళన షురూ ► ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తే మినహాయింపు గచ్చిబౌలి: శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూముల ప్రక్షాళన మొదలైంది. రాయదుర్గం నవకల్సాలో దాదాపు వెయ్యి కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో వెయ్యి కోట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తహసీల్దార్ మధుసూదన్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజిత్ కుమార్ షైనీ ఆదేశాలతో రాయదుర్గం నవకల్సా సర్వే నెంబర్ 66/1, 66/2లో రెండు వారాలుగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రహరీలు, బారికేడ్లు తొలగించి సరిహద్దులు నిర్ణయిస్తున్నారు. దీంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కబ్జాదారుల్లో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులున్నట్టు తెలుస్తోంది. తమ పాట్లు, స్థలాలకు మినహాయింపు ఇవ్వాలని వీరు రెవెన్యూ ఉన్నతాధికారులు, మంత్రులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. 40 ఎకరాలకు సరిహద్దులు ... రాయదుర్గం నవకల్సా సర్వే నెంబర్ 66/2లో 45 ఎకరాల స్థలం ఉంది. ఇందులో 20 ఎకరాలు ప్రభుత్వ స్థలం. కొందరు రియల్టర్లు ఏడాది క్రితం అప్పటి రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతో ప్రధాన రహదారి వెంట ఉన్న 4 ఎకరాల స్థలంలో బారికేడ్లు నిర్మించి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ప్రభుత్వ భూములు సర్వే చేపట్టిన అధికారులు ఈ సర్వే నెంబర్లో 15 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకొని సరిహద్దులు నిర్ణయించారు. ఒవర్లాప్లో 3 ఎకరాలు చిత్రపురి కాలనీలోకి పోయిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. రాయదుర్గం సవకల్సా సర్వే నెంబర్ 66/1లో 55 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులో 5 ఎకరాల్లో శశ్మానlవాటిక ఉంది. ఈ సర్వే నెంబర్లోని ప్రహరీ గోడలను కూల్చి సరిహద్దులు ఏర్పాటు చేశారు. దాదాపు 25 ఎకరాల ప్రభుత్వ స్థలం గుర్తించినట్లు తెలుస్తోంది. సర్వే నెంబర్ 66/1, 66/2లలో ఇప్పటికే 40 ఎకరాలకు సరిహద్దులు ఏర్పాటు చేశారు. అక్కడ ఎకరం ధర 25 కోట్ల పైగా ఉంది. గ్రామ మ్యాప్ ఆధారంగా ఇప్పటికే ఓ సారి సర్వే చేసిన అధికారుల... ఇందులో సరిహద్దులు సరిగ్గా రాకపోవడంతో డాక్యుమెంట్ల ప్రకారం సర్వే చేస్తున్నారు. శుక్రవారంతో పూర్తి కానున్న ఈ సర్వే అనతరం ఎన్ని ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నారో స్పష్టం కానుంది. వంద ఎకరాలు గుర్తించాల్సి ఉంది: - మధుసూదన్ , తహసీల్దార్ రాయదుర్గం సవకల్సా సర్వే నెంబర్ 66/1, 66/2, 66/3లో 260 ఎకరాలను ప్రభుత్వ స్థలమని 2001లో అప్పటి ప్రభుత్వం ప్రకటించిందని శేరిలింగంపల్లి తహసీల్దార్ మధుసూదన్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో అప్పటి వరకు ఉన్న డాక్యుమెంట్లు చెల్లవని చెప్పారు. అయితే, ప్రభుత్వం క్రమబద్ధీకరించినా, కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్లు అయినా మినహాయింపు ఉంటుందన్నారు. నవకల్సాలోని మూడు సర్వే నెంబర్లలో 100 ఎకరాల ప్రభుత్వ స్థలం గుర్తించాల్సి ఉందన్నారు. మియాపూర్‌లోని సర్వే నెంబర్ 28ను ప్రక్షాళన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని అన్ని సర్వే నెంబర్లలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి సరిహద్దులు నిర్ణయిస్తామన్నారు. -
ఐడియా అదిరింది.. వ్యూహం బెడిసింది!
సాక్షి ప్రతినిధి, కడప : ‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’ ఇది ఓ ప్రవేటు కంపెనీ ప్రచార స్లోగన్. దాన్ని ఆదర్శంగా తీసుకున్నారేమో ఏకంగా రూ.4 కోట్లు పైబడి విలువ కలిగిన ప్రభుత్వ స్థలానికి ఎసరు పెట్టారు. చేతులకు మట్టి అంటకుండా పక్కాగా పథక రచన చేశారు. ఉన్నతాధికారి నుంచి చిన్న సమస్యకు పదే పదే వచ్చిన సిఫార్సుల నేపథ్యంలో ఈ వాస్తవం వెలుగు చూసింది. ఉద్యోగాలకే ఎసరు వచ్చే ఘటన కావడంతో మండల రెవిన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. కింది స్థాయి సిబ్బంది రికార్డులను సరిచేసి ఉన్న విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. ప్రస్తుతం కడప గడపలో ఈఅంశం హాట్ టాఫిక్‌గా మారింది. కడప నగరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంతానికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభ దశకు చేరడంతో వ్యాపారులు ఆ ప్రాంతంలో స్థలాల కోసం విపరీతంగా ఆన్వేషిస్తున్నారు. ఇలాంటి తరుణంలో 23 సెంట్లు ఉన్న ప్రభుత్వ స్థలంపై ప్రవేటు వ్యక్తుల కన్ను పడింది. ఎలాగైనా స్వాహా చేయాలనే తలంపుతో జట్టుగా ఏర్పడ్డారు. ఎవరి స్థాయిలో వారు అడ్డంకులు రాకుండా చక్కబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కింది స్థాయి సిబ్బంది సహకరించినా, ఎక్కడా అడ్డంకులు లేకుండా ఉండేందుకు రెవిన్యూ అధికారులకు పరిచయం ఉన్న వారితో జట్టు కట్టారు. ఈ క్రమంలో ఇటీవల డీసీసీబీ డెరైక్టర్‌గా ఎన్నికైన ఓ నేత ఏకంగా కడప ఆర్డిఓ చిన్నరాముడుతో సంప్రదింపులు నిర్వహించారు. సమాన వాటాలతో ప్రభుత్వ స్థలాన్ని సొమ్ము చేసుకునే ప్రక్రియకు పథక రచన చేశారు. తన చేతులకు మట్టి అంటుకోకుండా చక్కబెట్టే పని కావడంతో పైరవీలకు ఆర్డీఓ ప్రాధాన్యత ఇచ్చారు. గుట్టు చప్పుడు కాకుండా.. కడప ఆర్ట్స్ కళాశాల ప్రాంతంలో సర్వే నంబర్ 955లో ఖాళీగా ఉన్న 23 సెంట్ల ప్రభుత్వ స్థలం విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సుమారు రూ.4 కోట్లు పలుకుతుంది. ఈ స్థలాన్ని స్వాహా చేసేందుకు రంగంలోకి దిగిన ఓ బృందానికి పెండ్లిమర్రి మండలంలో పనిచేస్తున్న ఓ విఆర్ఓ సూత్రధారిగా నిలిచారు. కడప రెవిన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఆర్ఐ పాత్రధారిగా మారి ముందుకు నడిపించారు. అందుకు ఏఆర్ఐకి రూ.12లక్షలు ఒప్పందం చేసుకొని రూ.7 లక్షలు ముట్టజెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఏఆర్ఐ చేయాల్సిందల్లా ఆన్లైన్లో సర్వే నంబర్ 955లోని భూమి చంద్రశేఖర్ అనే వ్యక్తికి చెందినదిగా పొందుపర్చడమే. ఈ పని చేయడంలో ఏఆర్ఐ సఫలీకృతుడైనట్లు సమాచారం. అనుకున్నట్లు పేరు రికార్డుల్లోకి చేరడంతో స్వాహారాయుళ్లు ఆర్టీఐ యాక్టును ప్రయోగించారు. సర్వే నంబర్ 955లోని 23 సెంట్ల భూమికి చెందిన వివరాలు ఇవ్వాలని కోరారు. ఆ స్థలం ప్రభుత్వ భూమి అని దస్త్రాలు పరిశీలించిన అప్పిలేట్ అథారిటీ అధికారిణి జవాబిచ్చారు. ఖంగుతిన్న స్వాహారాయుళ్లు డీసీసీబీ డెరైక్టర్‌గా ఇటీవల ఎంపికైన ఓ నాయకుడి ద్వారా ఆర్డీఓ చిన్నరాముడును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మీరు కోరినట్లు రికార్డులు అందిస్తే 23 సెంట్లలో సమాన వాటా ఇవ్వాలని ఆ నాయకుడు స్వాహారాయుళ్లుకు చెప్పినట్లు సమాచారం. ఆ మేరకు ఆర్డీఓతో మాట్లాడి ఆన్లైన్లో నమోదైన రికార్డులు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. పదే పదే సిఫార్సులు చేయడంతో.. కడప నగరంలోని సర్వే నంబర్ 955లోని 23 సెంట్ల భూమి ఎవరిదనే విషయమై ఆన్లైన్ పక్రియలో నమోైదైన రికార్డుల ఆధారంగా సమాచారం ఇవ్వాల్సిందిగా ఆర్డీఓ చిన్నరాముడు సిఫార్సులు చేయడం ఆరంభించారు. ఇదే విషయంపై పదే పదే సిఫార్సులు రావడంతో మండల రెవిన్యూ యంత్రాంగానికి అనుమానం పెరిగింది. చిన్న సమస్యకు ఆర్డీఓ స్థాయి అధికారి పదేపదే సిఫార్సులు చేయడం ఏమిటనే కోణంలో ఆలోచించారు. కంప్యూటర్ రికార్డులు పరిశీలించగా ఆ స్థలం.. ఓ వ్యక్తి అనువంశీకరణగా పొందుపర్చి ఉన్నట్లు సమాచారం. అప్రమత్తమైన యంత్రాంగం నిశితంగా పరిశీలించింది. మ్యానువల్ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉండడం, ఆన్లైన్లో వ్యక్తి పేరుపై ఉండడాన్ని గమనించారు. ఆర్టీఐ యాక్టు ప్రకారం అడిగిన వారి ఉద్దేశాన్ని పసిగట్టారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్ రికార్డుల్లో సైతం ప్రభుత్వ స్థలంగా మార్పు చేశారు. అనంతరం వారు ఈ వ్యవహారం ఉద్యోగాలకే ఎసరు వస్తుందని ఆర్డీఓకు వివరించినట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయాల స్థలాన్ని చాకచక్యంగా స్వాహా చేసే ఎత్తుగడను మండల రెవిన్యూ యంత్రాంగం నిలువరించింది. ఈ విషయం ఆనోటా ఈనోటా పడి బహిర్గతమైంది. సమాచారం ఇవ్వడం లేదని గ్రీవెన్స్‌లో ఫిర్యాదు వచ్చింది : ఆర్డీఓ చిన్న రాముడు, కడప గ్రీవెన్స్‌లో ఫిర్యాదులొస్తే ఆర్టీఐ యాక్టు మేరకు సమాచారం ఇవ్వాలని ఆదేశించాను. తెలిసిన వాళ్లు వచ్చి అడిగితే సమాచారం ఇవ్వలేదట.. ఇవ్వండి అని చెప్పి ఉంటాం. నేను చెప్పానని ఏది ఇవ్వమంటే అది ఇవ్వడానికి కడప రెవిన్యూ డివిజన్లో చట్టం తెలియని తహశీల్దార్లు ఎవరూ లేరు. రెవిన్యూ రికార్డుల మేరకే వివరాలు అందిస్తారు. కడప పరిధిలోని సర్వే నంబర్ 955 స్థలానికి సంబంధించి నా ప్రమేయంపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలు, అపోహలే చేశారు. తన చేతులకు మట్టి అంటుకోకుండా చక్కబెట్టే పని కావడంతో పైరవీలకు ఆర్డీఓ ప్రాధాన్యత ఇచ్చారు.