ప్రభుత్వ స్థలంలో తొలగించిన చెట్లు
కొమ్మాది: ప్రభుత్వ స్థలాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుకాడకూడదని నిర్ణయించుకున్నాడు ఓ నాయకుడు. గతంలో రెవెన్యూ అధికారులు హెచ్చరించినా ఆక్రమణ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. జీవీఎంసీ 4వ వార్డు కాపులుప్పాడ ఎస్సీ కాలనీలో స్థానిక నాయకుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు వెనుకాడటం లేదు. అక్టోబర్ 23న ఇక్కడి ప్రభుత్వ స్థలంలోని తాటిచెట్లను పొక్లెయిన్‌తో తొలగించాడు. ఈ విషయం అధికారులకు తెలియడంతో అతన్ని మొక్కుబడిగా మందలించి వదిలేశారు. ఇప్పుడు ఈ స్థలాన్ని చదును చేసేందుకు అడ్డుగా ఉన్న సీసీ రోడ్డు, డ్రైనేజీలను ధ్వంసం చేశాడు.
మౌనం వహిస్తున్న అధికారులు
ఈ ప్రభుత్వ స్థలంలో కొంత భాగాన్ని కల్యాణ మండపానికి కేటాయించారు. ప్రస్తుతం ఈ మండపం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీని పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని సదరు వ్యక్తి దర్జాగా పొక్లెయిన్ పెట్టి పనులు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లు వ్యహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయం వెనుకాలే కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణ జరుగుతున్నప్పటికీ వారు స్పందించక పోవడం విశేషం. ప్రభుత్వ స్థలం ఆక్రమణలో భాగంగా ఎస్సీ కాలనీకి ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు కొంత మేర ధ్వంసమైంది. డ్రైనేజీలను కూడా మూసివేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేదని అంటున్నారు. ఇంత జరుగుతున్నా సచివాలయం నుంచి గానీ, రెవెన్యూ నుంచి గానీ ఒక్క అధికారి కూడా రాలేదని.. దీనిపై సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తామని స్థానికులు తెలిపారు.
హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తాం
ఇక్కడ కొంత మేర ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కావడం వాస్తవమే. గతంలో హెచ్చరించాం. అయితే మరల ఈ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. ఆక్రమణకు గురైన స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తాం.
– బడే శ్రీనివాస్, వీఆర్వో, కాపులుప్పాడ
చదవండి: డెల్టా, ఒమిక్రాన్ ఒకేసారి సోకితే ఏమౌతుందో తెలుసా? కొత్త వేరియంట్ ప్రత్యేకత అదే..
Comments
Please login to add a commentAdd a comment