కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్: జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.రామమోహన్ డిమాండ్ చేశారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో 5270 మంది భవన నిర్మాణ కార్మికులు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇంతవరకు వాటికి రిజిస్ట్రేషన్ చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వెంటనే రిజిస్ట్రేషన్ చేయించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని లేకుంటే ఆందోళనబాట పడతామని హెచ్చరించారు. కొంతమంది కార్మిక శాఖ అధికారులను గుర్తింపుకార్డుల విషయమై ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికార యం త్రాంగం ఈ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
జిల్లావ్యాప్తంగా రెండు లక్షల మంది భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నారని, వారందరికీ సంక్షేమ ఫథకాలు వర్తించే విధంగా ఆ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరుతున్నామన్నారు. కార్మికుల సమస్యలపై సోమవారం జిల్లా కలెక్టర్‌కు, డీసీఎల్‌కు వినతిపత్రమివ్వడం, 9,10 తేదీల్లో ఏసీఎల్‌కు వినతిపత్రం అందజేయడం, 28న డీసీఎల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. యూనియన్ నాయకులు లక్ష్మినారాయణ, సిద్దిరామయ్య, వెంకటయ్య, ప్రతాప్ నాయుడు, స్వామిదాస్, హఫీజ్, రామమునిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలి
Published Mon, Jan 6 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement