ఆలూరు: తెలుగుదేశం పార్టీలో గుర్తింపు లేనందుకే పార్టీని వీడానని టీడీపీ ఆలూరు నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి వైకుంఠం శివప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన స్థానిక క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి తన కుటుంబం పార్టీకి విశేష సేవలు అందించిందన్నారు. చివరికి పార్టీ కోసం తన తల్లిదండ్రులను, తన కుటుంబానికి సహకరించిన కొందరిని కూడా పోగొట్టుకున్నానన్నారు. తమ సేవలను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గుర్తించకపోవడం చాలా బాధాకరమన్నారు.
ఆ పార్టీలో ఉండలేకనే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇటీవల హైదరాబాద్‌లో కలిసినట్లు చెప్పారు. త్వరలో అధికారికంగా పార్టీలో తన అనుచరవర్గంతో చేరుతున్నట్లు చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా తన అభివృద్ధిని కోరుకునే నాయకులు, కార్యకర్తలకు సహాయ, సహకారాలను అందిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఆలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానన్నారు.