సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్, ఎకో టూరిజం కేంద్రాన్ని పచ్చని ఉద్యానవనంలా ఆహ్లాదకర దర్శనీయ ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గతంలో ఇడుపులపాయంలో ఎకోటూరిజం కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని రూపకల్పన చేసి మధ్యలో వదిలేశారని, దీన్ని ఇప్పుడు అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకవసరమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లాలోని వైఎస్సార్ స్మృతివనం విశేషాలపై రూపొందించిన ‘మహానేతకు హరిత హారం’ (గ్రీన్ ట్రిబ్యూట్ టు ఎ గ్రేట్ లీడర్) పుస్తకాన్ని శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖరరెడ్డి హైదరాబాద్ నుంచి రచ్చబండలో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లాకు వెళుతుండగా కర్నూలు జిల్లా ఆత్మకూరు అభయారణ్యంలో హెలికాప్టర్ కూలిపోయి మరణించడం తెలిసిందే. ఆయన స్మారక చిహ్నంగా నల్లకాలువ సమీపంలో వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేయాలని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి నిధులు కేటాయించింది. వైఎస్సార్ స్మృతివనం ప్రాజెక్టు డైరెక్టర్‌గా అప్పట్లో పనిచేసిన ఎన్.చంద్రమోహన్‌రెడ్డి (ప్రస్తుతం ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్) చక్కటి ప్రణాళికతో స్మృతివనాన్ని అభివృద్ధిచేశారు. మొత్తం 3,500 ఎకరాల అభయారణ్యాన్ని వైఎస్సార్ స్మృతి వనంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అయితే అభయారణ్యంలో కట్టడాలు ఉండరాదన్న నిబంధన నేపథ్యంలో దీనిపక్కనే 22.20 ఎకరాల ప్రైవేటు భూమిని కొనుగోలు చేసి ఇందులో 20 అడుగుల ఎత్తయిన వైఎస్సార్ విగ్రహం, బయో డైవర్సిటీ పార్కు, వాటర్ ఫౌంటెన్లు, ఉద్యానవనాలు, బటర్‌ఫ్లై పార్కు లాంటివి ఏర్పాటు చేశారు.
ఐదంతస్తులతో వ్యూపాయింట్ కూడా నిర్మించారు. మొత్తం పార్కుతోపాటు వైఎస్సార్ మరణించిన కొండ కూడా కనిపించేలా వ్యూపాయింట్‌ను రూపొందించారు. ఈ వివరాలన్నింటితో దివంగత ముఖ్యమంత్రికి నివాళిగా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు ఎన్.చంద్రమోహన్‌రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. దీన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని, ఇందుకు రూ.10 కోట్లు అవసరమన్నారు. అన్ని అంశాలను ఆసక్తిగా విన్న సీఎం జగన్ తాను స్మృతివనాన్ని సందర్శించానని, చాలా బాగా అభివృద్ధి చేశారని ప్రశంసించారు. ఇదేతరహాలో ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్, ఎకో టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని సూచించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీరు బలరామిరెడ్డి కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment