ప్రభుత్వ పాఠశాలలపై ప్రైవేటు పిడుగు | If the number 19 of students of the school to cancel | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలపై ప్రైవేటు పిడుగు

Published Wed, Mar 30 2016 3:08 AM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

ప్రభుత్వ పాఠశాలలపై  ప్రైవేటు పిడుగు

ప్రభుత్వ పాఠశాలలపై ప్రైవేటు పిడుగు

విద్యార్థుల సంఖ్య 19 ఉంటే పాఠశాల రద్దు!
మూతబడ్డ స్కూళ్ల స్థలాలు, భవనాలు కెన్యా సంస్థకు!
వేసవిలో రేషన్‌లైజేషన్ అమలుకు ఆదేశాలు
గతేడాది 114 పాఠశాలల మూసివేత
ఈ ఏడాది మరో 200 పాఠశాలల రద్దు!
నిర్బంధ విద్యా చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ చర్యలు

 

ముదినేపల్లి రూరల్/మచిలీపట్నం : రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధమైంది. మూతబడిన పాఠశాలల భవనాలు, స్థలాలను కెన్యాకు చెందిన బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి వేసవిలో రేషనలైజేషన్‌ను అమలు చేసేందుకు నివేదికలు తయారు చేయాలని సూచించినట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.

 విద్యార్థుల సంఖ్యపై స్పష్టత లేదు...
 ప్రభుత్వ పాఠశాలల్లో రేషనలైజేషన్ అమలుకు సిద్ధమైన ప్రభుత్వం పాటించాల్సిన ప్రమాణాల విషయంలో మాత్రం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం లేదనే వాదన ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది. పాఠశాలలో పది మంది లోపు విద్యార్థులు ఉంటే మూసివేస్తామని ఒకసారి, 19 మంది ఉన్నా మూసివేస్తామని మరోసారి ఆదేశాలు జారీ చేయటంపై గందరగోళం వ్యక్తమవుతోంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది, ఉన్నత పాఠశాలల్లో 75 మంది కన్నా తక్కువగా విద్యార్థులు ఉంటే వాటిని మూసివేస్తారని ఉపాధ్యాయ సంఘ నేతలు చెబుతున్నారు.

వేసవిలో పాఠశాలల్లో రేషనలైజేషన్ చేపడితే  ప్రాధమికోన్నత  పాఠశాలల్లో 6,7 తరగతుల్లో 35 మంది కన్నా తక్కువగా విద్యార్థులు ఉంటే  సంబందిత పాఠశాలలను మూసివేసే అవకాశం ఉంది.  ఉన్నత పాఠశాలల్లో 75 మంది కన్నా తక్కువగా విద్యార్థులు ఉంటే  ఈ పాఠశాలలను మూసివేస్తారని ఉపాధ్యాయ సంఘం నాయకులు చెబుతున్నారు.

పేద విద్యార్థులు విద్యకు దూరం...
ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తే పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. గ్రామంలో 15 మంది విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలను మూసివేసి సమీప గ్రామంలోని పాఠశాలలో కలిపితే ఆ విద్యార్థుల్లో కనీసం ఐదారుగురైనా బడి మానేస్తారని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే 114 పాఠశాలల మూత
 గత ఏడాది నవంబరులో రేషనలైజేషన్ ప్రక్రియను ప్రాథమిక పాఠశాల్లో అమలు చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 114 పాఠశాలలను గుర్తించి వాటిని సమీప గ్రామాల్లోని మోడల్ పాఠశాలల్లో కలిపారు. అప్పట్లో డీఈవోగా పనిచేసిన కె.నాగేశ్వరరావు జిల్లాలో 19 పాఠశాలలే మూతపడతాయని ప్రభుత్వానికి నివేదిక అందించారు. అనంతరం ఆ సంఖ్యను 114కు పెంచారు. వివాదం నెలకొనడంతో విచారణ జరిపి డీఈవో నాగేశ్వరరావును అప్పట్లో సస్పెండ్ చేశారు. ఈ వేసవిలో చేపట్టే రేషనలైజేషన్‌లో మరో 200 పాఠశాలల వరకు మూతబడే అవకాశముందని తెలుస్తోంది.
ఆధార్ నిలిపివేత...
 ప్రభుత్వం విద్యార్థులకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి చేసింది. దీని ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణ ంగా ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది. గత విద్యా సంవత్సరం ముగిం పు రోజున ఉన్న ఆధార్ సంఖ్య ఆధారంగా రేషనలైజేషన్ చేపట్టారు. అయితే కొంతకాలంగా పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించి ఆధార్ సీడింగ్ నిలిపివేశారు. దీనివల్ల విద్యార్థుల సంఖ్యలో స్పష్టత ఉండదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తాం
 ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుపరం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ప్రభుత్వం ఆ యోచన విరమించుకోవాలి. పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూర్చకుండా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం తగదు. - బేతాళ రాజేంద్రప్రసాద్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు
 
 విద్యార్థులు చదువుకు దూరమవుతారు
 గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేస్తే డ్రాపవుట్లు పెరుగుతాయి. ఇది నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే. పేద విద్యార్థులకు విద్య దూరమవుతుంది.  - ఆగొల్లు హరికృష్ణ, ఉపాధ్యాయ సంఘ నాయకుడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement