సంప్రదాయాన్ని విస్మరించం | Ignore tradition | Sakshi
Sakshi News home page

సంప్రదాయాన్ని విస్మరించం

Published Thu, Mar 19 2015 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

Ignore tradition

ఒంటిమిట్ట : ఒంటిమిట్టలో కోదండరాముని కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్ తెలిపారు. స్థానిక కోదండ రామాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్ట కోదండ రామాలయ సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఆలయంలో కల్యాణం ఎప్పటిలాగానే రాత్రి సమయంలో నిర్వహిస్తామన్నారు.

ఒంటిమిట్ట కోదండ రామాలయం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి, తిరుమలను ఒక సర్క్యూట్‌గా ఏర్పాటు చేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు. కోదండ రామాలయం చుట్టు పక్కల ఇళ్లను తొలగించేందుకు సహకరించిన వాటి యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు. ఒంటిమిట్ట చెరువుకు నీరు చేరితే అన్ని విధాలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.

బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోదండరాముని బ్రహ్మోత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి శ్రీరామనవమి ఉత్సవాలు ఒంటిమిట్టలో జరుపుకోవడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ఈనెల 28వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోదండరాముని దర్శనానికి రానున్నట్లు ఆయన తెలిపారు. సీతారాముల కల్యాణోత్సవానికి ఏప్రిల్ 2వ తేదీన గవర్నర్ చేతుల మీదుగా పట్టు వస్త్రాలు, అధికారిక లాంఛనాలతో స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు.

ఆలయంలో నూతన నిర్మాణాలకు తావు లేదన్నారు. ఆలయ శిల్ప సంపదను చెన్నైలోని ప్రత్యేక చిత్రకారుల సహకారంతో పునరుద్ధరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామకుటీరం, కృంగిశైల పర్వతం, ఇళ్లు కూలదోస్తున్న ప్రదేశాలను ఆయన పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లు కోల్పోయిన వారు నిరుత్సాహపడవద్దని, వారికి సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ కేవీ రమణ, దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ, ఆర్డీఓ ప్రభాకర్ పిళ్లై, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement