ఇలాగైతే విధులు నిర్వర్తించలేం
ప్రొద్దుటూరు క్రైం: వైద్యుడిపట్ల అనుచితంగా ప్రవర్తించిన రేడియో గ్రాఫర్‌పై చర్యలు తీసుకోకుంటే ఎన్ని రోజులైనా విధులకు హాజరయ్యేది లేదని జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం రాత్రి ఆస్పత్రిలోని ఎక్స్‌రే ల్యాబ్‌లో ఉన్న రేడియోగ్రాఫర్ రామచంద్రయ్య క్యాజువాలిటీలో ఉన్న వైద్యుడు శివరాంను దూషించడమే గాక అనుచితంగా ప్రవర్తించినందుకు నిరసనగా సోమవారం వైద్యులందరూ విధులను బాయ్‌కాట్ చేశారు. ముందుగా వైద్యులందరూ క్యాజువాటీలో సమావేశమయ్యారు.
అందరి అభిప్రాయం మేరకు విధులను బహిష్కరిస్తున్నట్లు వైద్యులు శివరాం, సుధీర్‌రెడ్డి ప్రకటించారు. ఆస్పత్రిలో వైద్యులంటే ఎవరికీ గౌరవమే లేదని ఈ సందర్భంగా డాక్టర్ శివరాం అన్నారు. ఇలానే ఉంటే ప్రతి ఒక్కరూ వైద్యులపై తిరగబడతారన్నారు. ఇంత చదువు చదివింది వీళ్లతో మాటలు పడటానికా అని ఆవేదన చెందారు. ఎక్స్‌రే కోసం ఫోన్ చేయాలంటే క్యాజువాలిటీ లోని నర్సులు కూడా భయపడుతున్నారన్నారు.
ఎక్స్‌రే ఎందుకు రాస్తున్నావని వైద్యుడిని ప్రశ్నించడం ఎక్కడా జరగలేదన్నారు. నర్సింగ్ సిబ్బంది, రోగుల మధ్య రేడియోగ్రాఫర్ తనను దూషించాడన్నారు. అందుకు బాధిత రోగుల బంధువులు, ఆస్పత్రి సిబ్బందే సాక్ష్యమన్నారు. ఇంత చేసి కూడా మళ్లీ తమపైనే నిందారోపణలు చేయడం సమంజసంగా లేదన్నారు. 24 గంటల్లో రేడియోగ్రాఫర్‌పై చర్యలు తీసుకోకుంటే తదుపరి కార్యాచరణ ప్రణాళిక వెల్లడిస్తామన్నారు. మరో వైద్యుడు సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ మద్యం మత్తులో విధులకు హాజరు కావడమే గాక ఒక డాక్టర్‌ను దూషించడం ఎంత మాత్రం సబబుగా లేదన్నారు.
ఆది నుంచి ఆయన ప్రవర్తన అంతే..
డాక్టర్ శివరాం సంఘటన జరిగిన తర్వాత వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అందరూ ముందుకు వచ్చారు. రేడియోగ్రాఫర్ రామచంద్రయ్య గతంలో తమను కూడా చాలా ఇబ్బంది పెట్టాడని, పరుష పదజాలంతో దూషించాడని కొందరు వైద్యులు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. వైద్యులు విశ్వనాథరెడ్డి, ప్రతాపరెడ్డి, రామచంద్రారెడ్డిలతో పాటు పలువురు నర్సింగ్ సిబ్బంది ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. అనంతరం వైద్యులందరూ సూపరింటెండెంట్ బుసిరెడ్డి, ఆర్‌ఎంఓ డేవిడ్‌లకులిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
బెదిరింపు ఫోన్ కాల్‌పై డీఎస్పీకి ఫిర్యాదు
వైద్యులందరూ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఉండగా యూనియన్ నాయకుడంటూ కడప నుంచి ఒక వ్యక్తి డాక్టర్ శివరాంకు ఫోన్ చేశాడు. జరిగిందేదో జరిగింది.. పట్టింపులు మాని విధులకు వెళ్లండి.. లేదంటే మేము కూడా రేపటి నుంచి బంద్ చేస్తాం అని ఫోన్ చేసినట్లు శివరాం తెలిపారు.
ఫోన్ సంభాషణను సెల్‌ఫోన్ మైక్ ఆన్ చేసి అందరికీ వినిపించారు. దీంతో వైద్యులందరూ డీఎస్పీ శ్రీనివాసులరెడ్డికి ఫిర్యాదు చేశారు. డాక్టర్ల నుంచి అందిన ఫిర్యాదును డీసీహెచ్‌ఎస్‌కు పంపిస్తానని సూపరింటెండెంట్ బుసిరెడ్డి అన్నారు. రేడియోగ్రాఫర్ రామచంద్రయ్య విలేకరులతో మాట్లాడుతూ తాను డాక్టర్ శివరాంను దూషించలేదన్నారు.