causality
-
ఇలాగైతే విధులు నిర్వర్తించలేం
ప్రొద్దుటూరు క్రైం: వైద్యుడిపట్ల అనుచితంగా ప్రవర్తించిన రేడియో గ్రాఫర్‌పై చర్యలు తీసుకోకుంటే ఎన్ని రోజులైనా విధులకు హాజరయ్యేది లేదని జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం రాత్రి ఆస్పత్రిలోని ఎక్స్‌రే ల్యాబ్‌లో ఉన్న రేడియోగ్రాఫర్ రామచంద్రయ్య క్యాజువాలిటీలో ఉన్న వైద్యుడు శివరాంను దూషించడమే గాక అనుచితంగా ప్రవర్తించినందుకు నిరసనగా సోమవారం వైద్యులందరూ విధులను బాయ్‌కాట్ చేశారు. ముందుగా వైద్యులందరూ క్యాజువాటీలో సమావేశమయ్యారు. అందరి అభిప్రాయం మేరకు విధులను బహిష్కరిస్తున్నట్లు వైద్యులు శివరాం, సుధీర్‌రెడ్డి ప్రకటించారు. ఆస్పత్రిలో వైద్యులంటే ఎవరికీ గౌరవమే లేదని ఈ సందర్భంగా డాక్టర్ శివరాం అన్నారు. ఇలానే ఉంటే ప్రతి ఒక్కరూ వైద్యులపై తిరగబడతారన్నారు. ఇంత చదువు చదివింది వీళ్లతో మాటలు పడటానికా అని ఆవేదన చెందారు. ఎక్స్‌రే కోసం ఫోన్ చేయాలంటే క్యాజువాలిటీ లోని నర్సులు కూడా భయపడుతున్నారన్నారు. ఎక్స్‌రే ఎందుకు రాస్తున్నావని వైద్యుడిని ప్రశ్నించడం ఎక్కడా జరగలేదన్నారు. నర్సింగ్ సిబ్బంది, రోగుల మధ్య రేడియోగ్రాఫర్ తనను దూషించాడన్నారు. అందుకు బాధిత రోగుల బంధువులు, ఆస్పత్రి సిబ్బందే సాక్ష్యమన్నారు. ఇంత చేసి కూడా మళ్లీ తమపైనే నిందారోపణలు చేయడం సమంజసంగా లేదన్నారు. 24 గంటల్లో రేడియోగ్రాఫర్‌పై చర్యలు తీసుకోకుంటే తదుపరి కార్యాచరణ ప్రణాళిక వెల్లడిస్తామన్నారు. మరో వైద్యుడు సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ మద్యం మత్తులో విధులకు హాజరు కావడమే గాక ఒక డాక్టర్‌ను దూషించడం ఎంత మాత్రం సబబుగా లేదన్నారు. ఆది నుంచి ఆయన ప్రవర్తన అంతే.. డాక్టర్ శివరాం సంఘటన జరిగిన తర్వాత వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అందరూ ముందుకు వచ్చారు. రేడియోగ్రాఫర్ రామచంద్రయ్య గతంలో తమను కూడా చాలా ఇబ్బంది పెట్టాడని, పరుష పదజాలంతో దూషించాడని కొందరు వైద్యులు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. వైద్యులు విశ్వనాథరెడ్డి, ప్రతాపరెడ్డి, రామచంద్రారెడ్డిలతో పాటు పలువురు నర్సింగ్ సిబ్బంది ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. అనంతరం వైద్యులందరూ సూపరింటెండెంట్ బుసిరెడ్డి, ఆర్ఎంఓ డేవిడ్లకులిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. బెదిరింపు ఫోన్ కాల్‌పై డీఎస్పీకి ఫిర్యాదు వైద్యులందరూ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఉండగా యూనియన్ నాయకుడంటూ కడప నుంచి ఒక వ్యక్తి డాక్టర్ శివరాంకు ఫోన్ చేశాడు. జరిగిందేదో జరిగింది.. పట్టింపులు మాని విధులకు వెళ్లండి.. లేదంటే మేము కూడా రేపటి నుంచి బంద్ చేస్తాం అని ఫోన్ చేసినట్లు శివరాం తెలిపారు. ఫోన్ సంభాషణను సెల్‌ఫోన్ మైక్ ఆన్ చేసి అందరికీ వినిపించారు. దీంతో వైద్యులందరూ డీఎస్పీ శ్రీనివాసులరెడ్డికి ఫిర్యాదు చేశారు. డాక్టర్ల నుంచి అందిన ఫిర్యాదును డీసీహెచ్ఎస్కు పంపిస్తానని సూపరింటెండెంట్ బుసిరెడ్డి అన్నారు. రేడియోగ్రాఫర్ రామచంద్రయ్య విలేకరులతో మాట్లాడుతూ తాను డాక్టర్ శివరాంను దూషించలేదన్నారు. -
నిమ్స్ గతి ఇంతే!
బీబీనగర్‌లో 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.93 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన నాలుగు అంతస్తుల నిమ్స్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి చేసింది. చిన్నపాటి వర్షానికే స్లాబుల నుంచి నీరు కారుతుండడంతో పాటు గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. తలుపులు, కిటికీలు, అద్దాలు, ఎలక్ట్రికల్ వైరింగ్ అప్పుడే పాడవడంతో నిర్మాణ పనులు, నిధుల మంజూరులో అనేక అక్రమాలు జరిగినట్లు, విలువైన టైల్స్, ఫర్నిచర్ కూడా మాయం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పనులు చాలా వరకు లోపభూయిష్టంగా ఉన్నట్లు నిర్ధారించిన విజిలెన్స్ కమిషన్ ఆ మేరకు నివేదిక కూడా అందజేసింది. కాంట్రాక్టర్ కొత్త పేచీ.. ఇదే సమయంలో బకాయి చెల్లిస్తే కానీ, మిగిలిన పనులు పూర్తి చేయబోమని కాంట్రాక్టర్ పేచీపెట్టారు. పనులను మధ్యలోనే నిలిపేశారు. నిమ్స్ డెరైక్టర్‌గా డాక్టర్ నరేంద్రనాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీబీనగర్ నిమ్స్ నిర్మాణ పనులను సమీక్షించారు. తొలి దశలో భాగంగా 200 పడకలతో ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని భావించి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, వైద్య పరికరాల కోసం ప్రభుత్వం ఇటీవల మరో రూ.60 కోట్లు మంజూరు చేసింది. చేసిన పనికంటే ఎక్కువ చెల్లింపు.. మధ్యలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలని సదరు కాంట్రాక్టర్‌ను డెరైక్టర్ నరేంద్రనాథ్ కోరగా, పెండింగ్ బకాయితో పాటు ముందస్తుగా మరో రూ.6 కోట్లు చెల్లిస్తేనే మిగిలిన పనులు పూర్తి చే స్తామని స్పష్టం చేయడంతో ఇదే అంశంపై ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తై పనులు, చేసిన చెల్లింపులపై అధ్యయనం చేయించాలని భావించింది. ఆ మేరకు పంచాయతీరాజ్ రిటైర్డ్ ఇంజినీర్ ఇన్‌చీఫ్ కొండలరావు నేతృత్వంలోని ముగ్గురు రిైటె ర్డ్ ఇంజినీర్లతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు మాసాలు శ్రమించి నిర్మాణానికి సంబంధించిన పనులను కాంట్రాక్టర్ సమక్షంలోనే పరిశీలించింది. చేసిన పనికంటే కాంట్రాక్టర్‌కు అధికంగా చెల్లించినట్లు స్పష్టంచేసింది. ఈ విషయంపై సదరు కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించడం కొసమెరుపు. ఆస్పత్రి అందుబాటులోకి వస్తే... స్థానికుల తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తొలివిడతగా 200 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావాలని భావిం చారు. ఆస్పత్రిలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ, జనర ల్ మెడిసిన్, జనరల్ సర్జరీలాంటి వివిధ విభాగాలతో పాటు అధునాతన బ్లడ్ బ్యాంక్, ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్ఐ సేవలతో పాటు అన్ని రకాల వైద్యపరీక్షలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. 6 నెలలు పడుతుంది.. నిర్మాణ పనుల్లో చాలా లోపాలు ఉన్నట్లు ఇప్పటికే నిపుణుల కమిటీ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా అందజేసింది. గతంలో పని చేసిన కొంత మంది అధికారులు చేసిన పనికంటే అదనంగా కాంట్రాక్టర్‌కు చెల్లించినట్లు కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరితే చేయని పనులకు ముందే డబ్బు చెల్లించాల్సిందిగా సదరు కాంట్రాక్టర్ పేచీ పెడుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే కాంట్రాక్టర్‌తో చర్చించాం. ఎంత చెప్పినా వినకుండా ఆయన కోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్టర్‌తో మళ్లీ చర్చించి ఓ నిర్ణ యం తీసుకుంటాం. ప్రస్తుతం పనులు ప్రారంభిస్తే కానీ మరో6 నెలల తర్వాత సేవలు అందుబాటులోకి రాని దుస్థితి. - డాక్టర్ నరేంద్రనాథ్, డెరైక్టర్ నిమ్స్ -
కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల కొరత
సాక్షి, కాకినాడ :ప్రాణాపాయ పరిస్థితుల్లో అత్యవసర వైద్యం అందించడానికి కాకినాడలోని వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రిలోని ‘క్యాజువాలిటీ’ విభాగానికి రోగులను తీసుకొస్తారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే రోగులను ఇక్కడ పరీక్షించాకే అవుట్ పేషంటా లేక ఇన్ పేషెంటా అనేది ఆ విభాగం చీఫ్ నిర్ణయిస్తారు. ఇంత ప్రాధాన్యం కలిగినకీలక విభాగంలో డాక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుతం ఏడుగురు వైద్యులతోనే దీనిని నెట్టుకొస్తున్నారు. ఇది టీచింగ్ ఆస్పత్రి కావడంతో ఇక్కడ వైద్య విద్యార్థులు సైతం సేవలు అందిస్తుంటారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు, పాముకాట్లకు గురైన వారు, అల్లర్లలో గాయపడిన బాధితులు, ఆత్మహత్యా యత్నం చేసుకున్న వారు ఇలా ఎంతో మంది ఈ విభాగానికి వస్తారు. వీరంతా మెడికో లీగల్ కేసుల పరిధిలో ఉంటారు. ఆయా కేసుల్లో కొన్నిసార్లు వైద్యులు డ్యూటీ వదిలి కోర్టుకు హాజరుకావలసి ఉంటుంది. నాడి దొరకని, తీవ్రంగా గాయపడ్డ రోగుల వద్ద కొన్ని సందర్భాల్లో ఇద్దరు లేదా ముగ్గురు డాక్టర్లు సైతం చూడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోగులు చాలాసేపటి వరకు నిరీక్షించక తప్పడం లేదు. 36 పడకలు ఉన్న ఈ విభాగంలో దాదాపు 22 మంది రెగ్యులర్ డాక్టర్లు ఉండాలి. కాంట్రాక్టు డాక్టర్లతో కలిపి 20 మంది ఉండగా, ఇది టీచింగ్ ఆస్పత్రి అంటూ ఒకేసారి 13 మంది రెగ్యులర్ డాక్టర్లను ఇటీవల బోధన కోసం పంపిచేశారు. దీంతో ఏడుగురు వైద్యులే మిగిలారు. ఈ నేపథ్యంలో నలుగురు సాధారణ డాక్టర్లు, ముగ్గురు కాంట్రాక్టు డాక్లర్లు తీవ్ర ఒత్తిళ్ల మధ్య రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. క్యాజువాలిటీ విభాగంలో పడకల సంఖ్య, వైద్యుల సంఖ్య పెంచాలని నివేదికలు పంపుతున్నా.. ప్రభుత్వం ఈ ఆస్పత్రిపై చిన్నచూపు చూడటం వల్ల అరకొర వైద్యం అందే పరిస్థితి ఏర్పడుతోంది. సర్దుకోక తప్పడం లేదు : సూపరింటెండెంట్ ఆయా విషయాలపై ఆదివారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకటబుద్ధ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. టీచింగ్ ఆస్పత్రి కావడంతో ఉన్నంతలో సర్దుకుని వెళ్తున్నామన్నారు. వైద్య విద్య బోధన కూడా అత్యవసరమైనందున ఈ లోటు భరించాల్సిందేనన్నారు. కొన్నిసార్లు 200 మందికి పైగా రోగులు వస్తే ఒకొక్క వైద్యుడు కనీసం 30 మందిని పరీక్షించాల్సి ఉంటుందన్నారు. ఆయా పరిస్థితులను ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు.