కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల కొరత
Published Mon, Nov 4 2013 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
సాక్షి, కాకినాడ :ప్రాణాపాయ పరిస్థితుల్లో అత్యవసర వైద్యం అందించడానికి కాకినాడలోని వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రిలోని ‘క్యాజువాలిటీ’ విభాగానికి రోగులను తీసుకొస్తారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే రోగులను ఇక్కడ పరీక్షించాకే అవుట్ పేషంటా లేక ఇన్ పేషెంటా అనేది ఆ విభాగం చీఫ్ నిర్ణయిస్తారు. ఇంత ప్రాధాన్యం కలిగినకీలక విభాగంలో డాక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుతం ఏడుగురు వైద్యులతోనే దీనిని నెట్టుకొస్తున్నారు. ఇది టీచింగ్ ఆస్పత్రి కావడంతో ఇక్కడ వైద్య విద్యార్థులు సైతం సేవలు అందిస్తుంటారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు, పాముకాట్లకు గురైన వారు, అల్లర్లలో గాయపడిన బాధితులు, ఆత్మహత్యా యత్నం చేసుకున్న వారు ఇలా ఎంతో మంది ఈ విభాగానికి వస్తారు. వీరంతా మెడికో లీగల్ కేసుల పరిధిలో ఉంటారు.
ఆయా కేసుల్లో కొన్నిసార్లు వైద్యులు డ్యూటీ వదిలి కోర్టుకు హాజరుకావలసి ఉంటుంది. నాడి దొరకని, తీవ్రంగా గాయపడ్డ రోగుల వద్ద కొన్ని సందర్భాల్లో ఇద్దరు లేదా ముగ్గురు డాక్టర్లు సైతం చూడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోగులు చాలాసేపటి వరకు నిరీక్షించక తప్పడం లేదు. 36 పడకలు ఉన్న ఈ విభాగంలో దాదాపు 22 మంది రెగ్యులర్ డాక్టర్లు ఉండాలి. కాంట్రాక్టు డాక్టర్లతో కలిపి 20 మంది ఉండగా, ఇది టీచింగ్ ఆస్పత్రి అంటూ ఒకేసారి 13 మంది రెగ్యులర్ డాక్టర్లను ఇటీవల బోధన కోసం పంపిచేశారు. దీంతో ఏడుగురు వైద్యులే మిగిలారు. ఈ నేపథ్యంలో నలుగురు సాధారణ డాక్టర్లు, ముగ్గురు కాంట్రాక్టు డాక్లర్లు తీవ్ర ఒత్తిళ్ల మధ్య రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. క్యాజువాలిటీ విభాగంలో పడకల సంఖ్య, వైద్యుల సంఖ్య పెంచాలని నివేదికలు పంపుతున్నా.. ప్రభుత్వం ఈ ఆస్పత్రిపై చిన్నచూపు చూడటం వల్ల అరకొర వైద్యం అందే పరిస్థితి ఏర్పడుతోంది.
సర్దుకోక తప్పడం లేదు : సూపరింటెండెంట్
ఆయా విషయాలపై ఆదివారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకటబుద్ధ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. టీచింగ్ ఆస్పత్రి కావడంతో ఉన్నంతలో సర్దుకుని వెళ్తున్నామన్నారు. వైద్య విద్య బోధన కూడా అత్యవసరమైనందున ఈ లోటు భరించాల్సిందేనన్నారు. కొన్నిసార్లు 200 మందికి పైగా రోగులు వస్తే ఒకొక్క వైద్యుడు కనీసం 30 మందిని పరీక్షించాల్సి ఉంటుందన్నారు. ఆయా పరిస్థితులను ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు.
Advertisement
Advertisement