ఆ రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకల్లేవ్‌! | No Independence Day Functions In Himachal | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా ఆ రాష్ట్రం.. ఎందుకంటే.

Published Tue, Aug 15 2023 4:09 PM | Last Updated on Tue, Aug 15 2023 4:30 PM

No Independence Day Functions In Himachal  - Sakshi

దేశం మొత్తం(ఆ రాష్ట్రం మినహాయించి) అంగరంగ వైభవంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటోంది. కానీ, పరిస్థితులు ఆ రాష్ట్రాన్ని జెండా పండుగకు దూరంగా ఉంచేశాయి. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ఎర్రకోట ప్రసంగంలోనూ ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. 

భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని కుంభవృష్టితో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులు సైతం మూతపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రమాద ఘటనల్లో 55 మంది మరణించారు. ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించలేదు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై తన ప్రసంగంలో ఈ అంశాన్ని గుర్తు చేశారు. ఇటీవల దేశంలో విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని అన్నారు. ఊహించని స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని చెప్పారు. బాధితుల పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విపత్తు నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తాయని అన్నారు. 

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ప్రమాద ఘటనలు జరిగాయని సీఎం సుఖ్‌విందర్ సింగ్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోలాన్, సిమ్లా, మండి, హమిర్‌పూర్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన విపత్తు నిర్వహణ పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. చంఢీగర్‌-సిమ్లా జాతీయ రహదారితో సహా ప్రధాన రహదారులు మూతపడ్డాయని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో విపత్తులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా స్పందించారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించామని చెప్పారు.       

కొండచరియలు విరిగిపడిన ఘటనలో మొదట ఏడుగురు మరణించారు. శివమందిర్ కూలిపోయిన ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోచోట కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 17 మంది కాపాడామని సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ తెలిపారు.

కాగా.. మరో రెండు రోజులు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.  

ఇదీ చదవండి: వీడియో: జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన ఆరోగ్యశాఖ మంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement