♦ చిన్నారులను హతమార్చిన యువకుడు
♦ గోదారి చూపిస్తానని.. కాలువలో తోశాడు
♦ నిందితుడి ఇంటిని ధ్వంసం చేసిన గ్రామస్తులు
కొయ్యలగూడెం: పశ్చిమగోదావరి జిల్లా దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన కైకవరపు చిన్నారావు, మంగ దంపతులకు ప్రశాంత్ (10), విక్కీ(5)లు సంతానం. గత ఆదివారం పాలు తీసుకురావడానికి బయటకు వచ్చిన వారిని చిన్నారావు బంధువైన కైకవరపు రవిశేఖర్ గోదావరి కాలువ చూపిస్తానంటూ బైక్‌పై ఎక్కించుకుని పట్టిసీమ ఎత్తిపోతల పథకం జీరో పాయింట్ వద్దకు తీసుకువెళ్లాడు. కాలువ చూస్తున్న ఇద్దరు చిన్నారులను వెనుక నుంచి ప్రవాహంలోకి నెట్టివేయడంతో వారు మృత్యువాత పడ్డారు. ప్రశాంత్ మృతదేహం పోలవరం మండలం రేపల్లెవాడ, ఇటికిలకోట సమీపంలో మంగళవారం ఉదయం లభించగా, విక్కీ మృతదేహాన్ని గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెం సమీపంలో గుర్తించారు.
చిన్నారులు అదృశ్యమైన రోజునే వారి తండ్రి కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అప్పటికే చిన్నారులను బలితీసుకున్న రవిశేఖర్ ఏమీ ఎరగని వాడిలా చిన్నారావుతోపాటు పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. చిన్నారుల అదృశ్యం మెట్టప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో డీఎస్పీ చిటికెన మురళీకృష్ణ దర్యాప్తు చేపట్టారు. 24వ తేదీ దిప్పకాయలపాడు వెళ్లి విచారణ చేపట్టిన అనంతరం రవిశేఖర్‌పై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు.
ఫోన్‌కాల్స్‌తో పోలీసుల వల
దిప్పకాయలపాడు చిన్నారుల మృతికి కారణమైన రవిశేఖర్‌ని పోలీసులు ఫోన్ కాల్స్‌తో పట్టుకోగలిగారు. డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో రవిశేఖర్‌ను అనుమానించి 24వ తేదీ రాత్రి అతనికి ఫోన్ చేసి చిన్నారులు ఇరువురూ సేఫ్‌గా ఇంటికి తిరిగి వచ్చారని తెలిపారు. దీంతో పోలీసులకే రవిశేఖర్ పలుసార్లు తిరిగి ఫోన్ చేసి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, వారిని ఎవరైనా ఏదైనా చేశారా అంటూ పదే పదే సందేహాలు వ్యక్తంచేయడం పోలీసుల అనుమానానికి మరింత బలమైన ఆధారం ఏర్పడింది.
ఇరువురు చిన్నారులు దిప్పకాయపాడు ఇంటి వద్దకు వచ్చారని పోలీసులు తెలపగా రవిశేఖర్ మాత్రం దిప్పకాయలపాడు రాకపోవడంతో నిందితుడు అతనే అని అనుమానించారు. దీంతో అతని గురించి విచారణ చేపట్టి పట్టుకుని కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. విచారణలో రవిశేఖర్ నిజం వెల్లడించాడు. ఆ సమాచారంతో తెల్లవారు ప్రాంతంలో పోలీసులు కాలువ వెంబడి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి.
వివాహేతర సంబంధమే కారణం
చిన్నారులను బలితీసుకోవడానికి కారణం వివాహేతర సంబంధం అని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. చిన్నారుల తల్లితో రవిశేఖర్ గతంలో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. అయితే రెండు నెలలుగా ఆమె రవిశేఖర్‌తో కలవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పిల్లలే అడ్డుగా భావించిన రవిశేఖర్ వారిని చంపడానికి ప్రణాళికను సిద్ధం చేసుకుని ఈ నెల 23న కాలువలోకి నెట్టి హతమార్చినట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది.
గ్రామస్తుల ఆగ్రహం
కొయ్యలగూడెం : చిన్నారులను హతమార్చిన యువకుడు రవిశేఖర్‌ను తమకు అప్పగించండి, వాడికి సరైన శిక్షను అమలు చేసి మరొక వ్యక్తి ఇటువంటి అకృత్యం చేయకుండా ఉండటానికి గుణపాఠం నేర్పుతాం అంటూ దిప్పకాయలపాడు గ్రామస్తులు మంగళవారం తీవ్ర ఆగ్రహావేశాలతో పేర్కొన్నారు. చిన్నారులు ప్రశాంత్, విక్కీలను రవిశేఖర్ దారుణంగా హతమార్చాడన్న విషయం తెల్లవారే సరికల్లా దావానలంలా చేరడంతో దిప్పకాయలపాడు దళితవాడలో 500 మందికి పైగా ప్రజలు చేరుకుని రవిశేఖర్ ఇంటిని ధ్వంసం చేశారు. ఆగ్రహం చల్లారక అతని తండ్రి కాంతారావుపై దాడి చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను పక్కకు తోశారు. అయినా స్థానికులు శాంతించకపోవడంతో కాంతారావును పోలీసు జీపులో ఎక్కించుకుని కొయ్యలగూడెం తరలిస్తుండగా మహిళలు జీపునకు అడ్డంగా కూర్చొని అందోళనకు దిగారు. జీపు టైర్లలో గాలిని తీసివేసి కాంతారావును తమకు అప్పగించాలని నినాదాలు చేశారు. అప్పటికే కొందరు పెద్దలు నిందితుడు రవిశేఖర్ అని, కాంతారావు, అతని మరో కొడుకు, కుటుంబ సభ్యులకు ఏ సంబంధం లేదని నచ్చజెప్పారు. దీంతో వివాదం కొంత సర్దుమణిగింది.