ఆటకట్టించే మందేది?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒడిశాలో తయారైన అక్రమ మద్యం మూలాలు జిల్లాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. నెలరోజుల వ్యవధిలోనే జిల్లాలోని పలు చోట్ల లక్షలాది రూపాయల విలువైన పన్ను చెల్లించని, నకిలీ మద్యం లభించడం అధికారులను విస్తుపోయేలా చేస్తున్నా.. దీన్ని అరికట్టేందుకు ఏం చేయాలన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. నకిలీ మద్యం (ఎన్‌డీపీఎల్), బిల్లులు లేకుండా సరఫరా అవుతున్న సరకు వివరాలు తెలుసుకునేందుకు, గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించినా కనుగొనేందుకు ఎక్సైజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దించినా సిండికేట్ వ్యాపారులు ఏమాత్రం వెరవకుండా రహస్య మార్గాల్లో మద్యం అక్రమ రవాణా, అమ్మకాలకు పాల్పడుతూనే ఉన్నారు.
అధికారులకు తెలియనది కాదు
జిల్లా వ్యాప్తంగా నకిలీ మద్యం ఏరులా పారుతున్న విషయం ఎక్సైజ్ శాఖలోని కొంతమంది అధికారులకు స్పష్టంగా తెలుసు. నెలవారీ వసూళ్లకు అలవాటు పడిన ఈ అధికారులు తెరవెనుక వ్యాపారులకు సహకరిస్తున్నారు. ఇచ్ఛాపురం పరిధిలో గత నెల 9, 10 తేదీల్లో పట్టుబడిన ఒడిశా మద్యం రాకెట్ వ్యవహారాలు స్థానిక సీఐ కనుసన్నల్లోనే సాగిందన్న ప్రచారం ఉంది. ఆ కేసు ఒడిశాకు బదిలీ కావడం, సెప్టెంబర్ 16న అరకభద్రలోని ఓ చెరువులో అక్రమ మద్యం బాటిళ్లు లభ్యం కావడం వెనుకా పెద్ద కుట్రే దాగి ఉంది. లారీ లోడు సరుకు సరిహద్దు దాటి జిల్లాకు వస్తోందన్న సమాచారంతోనే భారీ ఎత్తున ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగినా.. ఈ దాడి విషయాన్ని అదే శాఖలోని కొంతమంది సీఐలు లీక్ చేయడం వల్లే ఆపరేషన్ ఫెయిల్ అయిందని సిబ్బందే చెబుతున్నారు.
మద్యం వేలం పాటల సమయంలో కొన్ని దుకాణాలు తమకు కావాల్సిన వ్యక్తులకే దక్కేలా చేయించడం, వాహనాలు కొనుగోలు చేసి ఎక్సైజ్ శాఖకే అద్దెకివ్వడంలో సిబ్బంది పాత్ర లేకపోలేదని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. గత నెల పట్టణంలోని ఎస్‌వీఆర్ బార్ అండ్ రెస్టారెంట్‌లో సోదాలు నిర్వహించడం, ఆదిత్య దుకాణంలో సోదాలు జరపడం, సీజ్ చేయడం, నకిలీ మద్యం రాకెట్ విశాఖ జిల్లాకు విస్తరించడం వెనుక తమ శాఖ సిబ్బంది అండదండలు ఉన్నాయని ఇటీవలే అధికారులు గుర్తించారు. నకిలీ మద్యం రాకెట్ బయటపడిన తరువాత ఓ సీఐ ఇక్కడ నుంచి సెలవుపై వెళ్లిపోయేందుకు ప్రయత్నించడాన్నీ అధికారులు అనుమానిస్తున్నారు. తీగ లాగి డొంకను కదిలించేందుకు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు.
ఓరుగంటి వారి కిక్కు
ఎస్‌వీఆర్ దుకాణంలో నకిలీ మద్యం బయటపడిన తరువాత యజమాని ఓరుగంటి ఈశ్వరరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని అధికారులు చెబుతున్నారు. అయితే కొందరు అధికారులకు ఆయన కదలికలు తెలుసన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు నుంచి బయట పడే మార్గాలు, బెయిల్ పొందేందుకు అవసరమైన సలహాలను ఆయనకు వారే అందిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో చక్రం తిప్పుతున్న ఓ మంత్రి వద్ద కూడా ఓరుగంటి సమాచారం ఉందని విశ్వసనీయ సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎక్సైజ్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగితేనే ఓరిగంటి గుట్టు రట్టవుతుంది.