ఆగని వసూళ్ల దందా...
► నాగలాపురం చెక్‌పోస్టులో పెరిగిన మామూళ్లు
► బరితెగిస్తున్న వాణిజ్య పన్నుల శాఖ
► ప్రయివేటు వ్యక్తులతో వసూళ్ల పర్వం
► తిరుపతి ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు
► రూ.21,860 ల నగదు స్వాధీనం
నాగలాపురం చెక్‌పోస్టు...అక్రమ వసూళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడ పనిచేసే వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులు పూర్తిగా బరితెగిస్తున్నారు. చెక్‌పోస్టులో ఏకంగా వసూళ్ల దుకాణాన్ని తెరిచేశారు. అడ్డదారిలో అక్రమ సంపాదన కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, ఏసీబీ దాడులను లెక్కలేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
మామూళ్లు ఇవ్వని వాహన యజమానులను ముప్పతిప్పలు పెడుతున్నారు. సరిగ్గా ఐదు నెలల కిందట ఇక్కడి వసూళ్ల వ్యవహారం కమిషనర్ దృష్టికి వెళ్లింది. అప్పట్లో ఒకరిద్దరు అధికారులు, సిబ్బందిపై వేటు పడింది. అయినా ఆ శాఖ ఉద్యోగుల్లో మార్పు లేదు. గురువారం జరిగిన ఏసీబీ దాడుల్లో మరో మారు అడ్డంగా దొరికి పోయారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి /నాగలాపురం : నాగలాపురంలోని వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్ట్‌పై మరోసారి ఏసీబీ దాడులు జరిగాయి. గురువారం ఉదయం 8 గంటలకు ఆకస్మికంగా దాడులు ప్రారంభించిన అధికారులు రెండు గంటల పాటు ఉద్యోగులు, సిబ్బందికి చెమటలు పట్టించారు. రికార్డులను పరిశీలించి రూ.21,860 ల అదనపు నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న కమర్షియల్ ట్యాక్సు అధికారులు, ఉద్యోగులను ప్రశ్నించారు. అక్రమ వసూళ్లకు పాల్పడ్డ వారిపై రిపోర్టు తయారు చేశారు. అవినీతి నిరోధక శాఖ డీజీ ద్వారా సంబంధిత ఉద్యోగులపై చర్యలకు సిఫార్సు చేయనున్నారు.
వీళ్లు మారరంతే...
నాగలాపురం చెక్‌పోస్టులో గడచిన రెండేళ్లుగా అవినీతి పెరిగింది. సరుకు రవాణాలో అవకతవకలను గుర్తించి పన్ను విధించా ల్సిన అధికారులే అక్రమార్కులతో చేయి కలుపుతున్నారు. చేయి తడపందే వాహనం కదిలేందుకు అనుమతి ఇవ్వడం లేదు. 2015 నుంచి ఇప్పటివరకూ ఈ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు నాలుగుసార్లు దాడిచేశారు. ప్రతిసారీ అనధికార నగదు దొరుకుతూనే ఉంది.
ఏసీబీ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులకు సైతం మామూళ్లు వెళ్తుండబట్టే అవినీతికి అడ్డుకట్ట పడడం లేదనే విమర్శలున్నాయి. ఇక్కడి సిబ్బంది ప్రయివేటు వ్యక్తుల ద్వారా వసూళ్లు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఏసీబీ సైతం గుర్తించింది.
ముందస్తు సమాచారంతోనే..
నాగలాపురం చెక్‌పోస్ట్ అవినీతిపై లారీ యజమానులు, చదువుకున్న డ్రైవర్లు ఫిర్యాదు చేస్తుంటారు. ఏసీబీ అధికారులు సైతం లారీ డ్రైవర్లు ఇచ్చిన ముందస్తు సమాచారంతోనే దాడులకు పూనుకున్నారు. ప్రధానంగా ఇక్కడి చెక్‌పోస్టులో ప్రయివేటు వ్యక్తుల పెత్తనం ఎక్కువగా కనిపిస్తోంది. సాధ్యమైనంత మేర అధికారులు, సిబ్బంది తమ చేయి కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ తరహాలోనే గురువారం విధుల్లో ఉన్న ఏసీటీవో చెన్నరాయుడు, సీనియర్ అసిస్టెంట్ నరసింహులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది శ్రీనివాసులు, ఎస్. శ్రీనివాసులు, మురుగదాస్‌లతో పాటు ప్రయివేటు వ్యక్తులు ఉమాపతి, రాజేష్, పరంధామ్ చెక్‌పోస్టు లోపల ఉన్నారు. ప్రయివేటు వ్యక్తుల నుంచి రూ.14,560లు, కిచెన్ నుంచి రూ.7300లు స్వాధీనం చేసుకున్నారు.
నిఘాను పెంచాం
తమిళనాడు సరిహద్దు చెక్‌పోస్ట్ కావడంతో పాటు ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న దరిమిలా నాగలాపురం చెక్‌పోస్ట్‌పై నిఘా పెంచామని ఏసీబీ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. అవినీతిని తగ్గించేందుకు దాడులు కొనసాగిస్తూనే ఉన్నామన్నారు.
వాణిజ్య పన్నుల శాఖలో కలవరం
నాగలాపురం చెక్‌పోస్ట్‌లో ఏసీబీ దాడులు జరిగిన నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాల్లో పనిచేసే వాణిజ్య పన్నుల శాఖలో కలవరం మొదలైంది. కాగా 2016 డిసెంబరు మొదటి వారంలో ఒకిరిద్దరు ఉద్యోగులపై వేటు పడిందనీ, ఈసారి ఎవరిపై దెబ్బ పడుతుందోనని బెంబేలెత్తుతున్నారు.