nagalapuram
-
భైరవ కుటీరం
కుక్కలు కనిపించగానే చాలా మంది భయపడతారు. కొందరు కసురుకుంటారు. వీలుంటే ఓ రాయి విసురుతారు. కానీ ఈ కుటుంబం ఇందుకు భిన్నం. 53 శునకాలను తమతోపాటు ఇంట్లో ఉంచుకుంటున్నారు. వాటికి ప్రేమాభిమానం పంచుతున్నారు. ఇతరులకు ఇబ్బంది కలగకూడదని ఊరికి చివర నివాసమేర్పరుచుకున్నారు. వాటి సేవలోనే రోజంతా గడుపుతున్నారు. ఆ ఇంటికి వెళ్తే భౌ భౌ అంటూ అరుపులు వినిపిస్తాయి. ఇదేంటి ..చాలా ఇళ్లలో పెంపుడు కుక్క అరుస్తుంది కదా అనుకుంటున్నారా..ఒకటైతే ఓకే..ఏకంగా 53శునకాలు.. ఆశ్చర్యంగా ఉంది కదూ..ఔను నిజమే..ఇన్ని భైరవులున్న ఆ ఇల్లు చిన్నదే..కానీ ఆ ఇంటి యజమాని మనసు మాత్రం చాలా పెద్దది. ఓ చిన్న గదిలో కుటుంబ సభ్యులుంటూ మిగిలిన చోటంతా కుక్కలకే ఇచ్చేశారు. రోజూ వాటిని ప్రేమతో సాకుతున్నారు. ఒక కుక్కను పెంచడమే కష్టమనుకునే రోజుల్లో తనసంపాదనంతా వాటికే వెచ్చిస్తున్నారు. అవి కూడా తమ కుటుంబ సభ్యులే అనిచిరునవ్వుతో సమాధానమిస్తారీ మధ్యతరగతి ప్రకృతి వైద్యుడు..ఆయన వాటినిభైరవులుగా సంబోధిస్తారు. ఆయన నిస్వార్ధ సేవ గురించి తెలుసుకుందామా.. చిత్తూరు, నాగలాపురం: అది నాగలాపురం మండలం.. రాజులకండ్రిగ గ్రామానికి దూరంగా కొండలు..పచ్చని పొలాల మధ్య ఓ ఇల్లు.. జన సంచారం పెద్దగా కనిపించదు. ఆ ఇంట్లోకి తొంగి చూస్తే ఓ ముగ్గురు వ్యక్తులు శునకాలకు సేవ చేస్తూ కనిపిస్తారు. వారే ఏసుపాదం బాబు, ఆయన భార్య రిబ్కా, కుమార్తె ప్రియ. వీరు ముగ్గురూ జీవకారుణ్యమున్నవారే. ఆయనేమీ పెద్ద స్థోమతుపరుడు కాదు. ఇల్లుకూడా సొంతం కాదు. ఆయన సోదరిచ్చినదే. ఆత్మాభిమానం మెండు. చిన్న పాటి సేవలకే ఎంతో ప్రచారం కోరుకునే రోజుల్లో ఆయన ఏనాడూ తన సేవల గురించి ఎవరికీ చెప్పరు. ఎవరి సాయమూ తీసుకోరు కూడా. తన చిరు సంపాదనతో కుటుంబాన్ని ..భైరవులను పోషిస్తున్నారు. ఇక్కడున్న భైరవుల్లో అధిక భాగం ఎవరో గాలికొదిలేసినవే. వాటిని కన్నబిడ్డల్లా కాపాడుతున్నారు. స్వార్థ చింతన లేని ప్రేమను పంచుతున్నారు. జీవకారుణ్యం పదానికి నిలువెత్తు నిదర్శనం ఈ కుటుంబమే. రోజంతా వీటి సేవే.. రోజూ ఈ 53 శునకాలకు స్నానపానాదులు చేయించడం, ఆహారాన్ని అందించడంలో భార్య, కుమార్తె పాలుపంచుకుంటున్నారు. వారి దినచర్య పూర్తిగా వీటితో గడిచిపోతోంది. ఏరోజూ వీటిని విడిచి ఉండలేదు..ఉండలేం కూడా అంటుంది ఆయన కుమార్తె ప్రియ. కేవలం వాటికి భోజనం పెట్టడమే కాదు అంటు వ్యాధులు రాకుండా ముందస్తు వ్యాక్సిన్లు వేయిస్తున్నారు. ఇటీవలే ఒక శునకానికి చెవి వ్యాధి సోకితే చెన్నై తీసుకెళ్లి నయం చేయించారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు వారు ఎలా వాటిని సాకుతున్నారో తెలుసుకోడానికి. మూలికా వైద్యనిపుణలు.. ఏసుపాదం బాబుకు మూలికా వైద్యంపై మంచి పట్టు ఉంది. ఈ వైద్యాన్ని కూడా ఆయన వాణిజ్య దృక్పథం లేకుండానే అందిస్తున్నారు. జీవనశైలి మార్చుకోవడం ద్వారానే రోగాలను నయం చేసుకోవచ్చునని చెబుతారీయన. తనదగ్గర కొచ్చే రోగులకు ఈ మార్గం ద్వారానే స్వçస్థత చేకూర్చుతున్నారు. రెండు కిడ్నీలకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసరు ఇప్పుడు మామూలు మనిషయ్యారు. పూర్తిగా రోగం నయమైంది. ఫెయిత్ పవర్ పేరున పెయిన్ రిలీవర్ ఎక్స్టర్నల్ తైలం, గర్భధారణలో స్పెర్మ్ కౌంటింగ్ పెరగడానికైన వాల్యూం పౌడర్, చర్మవ్యాధులు నివారించ గలిగే (38 మూలికలతో తయారు చేసిన) పౌడర్, కరివేపాకు, నువ్వులు, సాంబార్, పప్పుల పొడులను తయారు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఖాదీ భాండార్‌లో విక్రయిస్తారు. రోజు ఎనిమిదివందల రూపాయల వరకు శునకాల పోషణకు వెచ్చించడం వారి ఉదారత్వానికి నిదర్శనం. చెన్నై టు రాజుల కండ్రిగ ఇంతకీ ఏసుపాదం బాబుకు ఈ జంతుప్రేమ ఎలా వచ్చిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. మేం చాలా క్రితం చెన్నైనగరంలో ఉండేవాళ్లం. మొదట్లో ఒకటే భైరవుడు (శునకం) ఉండేవాడు. అది పిల్లలను పెట్టడంతో సంఖ్య నాలుగైంది. వాటి శబ్దాలకు చాలామంది అటుగా వచ్చేవారు కాదు. దీంతో ఇంటి యజమాని ఒప్పుకోలేదు. ఇల్లు ఖాళీ చేయాల్సిందేనన్నారు. ఏం చేస్తాం..ప్రేమాభిమానంతో పెంచుకున్న భైరవులను విడిచిపెట్టడానికి మనసు అంగీకరించలేదు. దీంతో ఉద్యోగం మానుకున్నాను. వాటిని తీసుకుని ఊతుకోట తాలూకా బాలిరెడ్డి కండ్రిగకు మకాం మార్చాను. రాన్రానూ భైరవుల సంఖ్య పెరిగింది. అక్కడ ఉండడం కూడా ఇబ్బంది అయ్యింది. ఏదో ఒకటో చేయాలి. మనుషుల మధ్య ఉండాలంటే ఇవి దగ్గర ఉండకూడదు. కానీ మనసొప్పుకోలేదు. అందుకే మనుషులకు దూరంగా వచ్చేయాలనుకున్నాను. నాగలాపురం మండలం రాజులకండ్రిగకు కొంచెం దూరంలో భైరవులకు సౌకర్యార్థంగా ఉండేలా చిన్న ఇల్లు కట్టుకున్నాం. ఇరుకుగానే ఉంది. కానీ ఇల్లు చిన్నదని పిల్లలను వదిలేయలేం కదా..అందుకే కష్టమో నష్టమో వాటితో కలిసే ఈ ఇంటిలో జీవిస్తున్నామని ఏసుపాదంబాబు వివరించారు. ఇప్పుడు వారిల్లే భైరవాశ్రమంగా మారిపోయింది. వైద్యులు చేతులెత్తేసిన వారికి వైద్యం మొండిరోగాలని చేతులెత్తేసిన పరిస్థితుల్లోనూ ఏసుపాదం స్పందించి వైద్యం చేస్తున్నారు. ఆయుర్వేద, సిద్ధ్ద విధానాల్లో ప్రకృతి చికిత్స మార్గాలతో నయం చేస్తున్నారని ఇక్కడికొచ్చే రోగులు చెబుతున్నారు. ఇప్పుడున్న జీవన విధానాలే సర్వరోగాలకు కారణమని..వాటిలో మార్పు తెచ్చుకోవాల్సిన అవసరముందని సూచిస్తారీయన. పెద్ద పెద్ద రోగాలకూ ఇందులోనే మందు ఉందంటారు. . క్యాన్సర్ రోగులనూ ఆరోగ్యవంతులుగా మార్చవచ్చంటారీయన.∙తాత, ముత్తాతల నుంచి వంశపారపర్యంగా వస్తున్న మూలికా వైద్యాన్ని ఉచితంగా అందించడం విధిగా పెట్టుకున్నారు. ఈ వైద్యుని ఇంట్లో అన్నీ మట్టి పాత్రలనే వాడటం విశేషం. అల్యూమినియం పాత్రలు, కుక్కర్లు, నాన్‌స్టిక్ తవ్వాల వాడకం శ్రేయస్కరం కాదంటారు. ధ్యానం, యోగా చేస్తూ అందరితో చేయిస్తుంటారు. క్రమశిక్షణకు మారుపేరు.. భైరవాశ్రమంలో శునకాలు పూర్తిగా శాఖాహారులు. వీటికి ఆ రకమైన తర్ఫీదునిచ్చారు. ఇక్కడ వీధి కుక్కలే కాదు వివిధ జాతులకు చెందినవి కూడా ఉన్నాయి. ప్రకృతిసిద్ధంగా లభించే గడ్డి రకాలు, గడ్డిపూలు, ఆకుకూరలు, దుంపలు, క్యారెట్టు, బీటు, నూల్‌కోల్, చౌచౌ, ఉల్లిగడ్డలు, టమాట, అటుకులు, బొరుగులు, బిస్కట్లను ఆహారంగా తీసుకుంటూ ఈ శునకాలన్నీ ఆరోగ్యకరంగా ఉన్నాయి. అంతేకాదు క్రమ శిక్షణను పాటిస్తాయి. ఆహారం తీసుకున్న సమయంలో పోట్లాడుకోవు. తన వంతు వచ్చే వరకు ఎదురుచూస్తాయి. -
ఆగని వసూళ్ల దందా...
► నాగలాపురం చెక్‌పోస్టులో పెరిగిన మామూళ్లు ► బరితెగిస్తున్న వాణిజ్య పన్నుల శాఖ ► ప్రయివేటు వ్యక్తులతో వసూళ్ల పర్వం ► తిరుపతి ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు ► రూ.21,860 ల నగదు స్వాధీనం నాగలాపురం చెక్‌పోస్టు...అక్రమ వసూళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడ పనిచేసే వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులు పూర్తిగా బరితెగిస్తున్నారు. చెక్‌పోస్టులో ఏకంగా వసూళ్ల దుకాణాన్ని తెరిచేశారు. అడ్డదారిలో అక్రమ సంపాదన కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, ఏసీబీ దాడులను లెక్కలేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మామూళ్లు ఇవ్వని వాహన యజమానులను ముప్పతిప్పలు పెడుతున్నారు. సరిగ్గా ఐదు నెలల కిందట ఇక్కడి వసూళ్ల వ్యవహారం కమిషనర్ దృష్టికి వెళ్లింది. అప్పట్లో ఒకరిద్దరు అధికారులు, సిబ్బందిపై వేటు పడింది. అయినా ఆ శాఖ ఉద్యోగుల్లో మార్పు లేదు. గురువారం జరిగిన ఏసీబీ దాడుల్లో మరో మారు అడ్డంగా దొరికి పోయారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి /నాగలాపురం : నాగలాపురంలోని వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్ట్‌పై మరోసారి ఏసీబీ దాడులు జరిగాయి. గురువారం ఉదయం 8 గంటలకు ఆకస్మికంగా దాడులు ప్రారంభించిన అధికారులు రెండు గంటల పాటు ఉద్యోగులు, సిబ్బందికి చెమటలు పట్టించారు. రికార్డులను పరిశీలించి రూ.21,860 ల అదనపు నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న కమర్షియల్ ట్యాక్సు అధికారులు, ఉద్యోగులను ప్రశ్నించారు. అక్రమ వసూళ్లకు పాల్పడ్డ వారిపై రిపోర్టు తయారు చేశారు. అవినీతి నిరోధక శాఖ డీజీ ద్వారా సంబంధిత ఉద్యోగులపై చర్యలకు సిఫార్సు చేయనున్నారు. వీళ్లు మారరంతే... నాగలాపురం చెక్‌పోస్టులో గడచిన రెండేళ్లుగా అవినీతి పెరిగింది. సరుకు రవాణాలో అవకతవకలను గుర్తించి పన్ను విధించా ల్సిన అధికారులే అక్రమార్కులతో చేయి కలుపుతున్నారు. చేయి తడపందే వాహనం కదిలేందుకు అనుమతి ఇవ్వడం లేదు. 2015 నుంచి ఇప్పటివరకూ ఈ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు నాలుగుసార్లు దాడిచేశారు. ప్రతిసారీ అనధికార నగదు దొరుకుతూనే ఉంది. ఏసీబీ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులకు సైతం మామూళ్లు వెళ్తుండబట్టే అవినీతికి అడ్డుకట్ట పడడం లేదనే విమర్శలున్నాయి. ఇక్కడి సిబ్బంది ప్రయివేటు వ్యక్తుల ద్వారా వసూళ్లు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఏసీబీ సైతం గుర్తించింది. ముందస్తు సమాచారంతోనే.. నాగలాపురం చెక్‌పోస్ట్ అవినీతిపై లారీ యజమానులు, చదువుకున్న డ్రైవర్లు ఫిర్యాదు చేస్తుంటారు. ఏసీబీ అధికారులు సైతం లారీ డ్రైవర్లు ఇచ్చిన ముందస్తు సమాచారంతోనే దాడులకు పూనుకున్నారు. ప్రధానంగా ఇక్కడి చెక్‌పోస్టులో ప్రయివేటు వ్యక్తుల పెత్తనం ఎక్కువగా కనిపిస్తోంది. సాధ్యమైనంత మేర అధికారులు, సిబ్బంది తమ చేయి కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ తరహాలోనే గురువారం విధుల్లో ఉన్న ఏసీటీవో చెన్నరాయుడు, సీనియర్ అసిస్టెంట్ నరసింహులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది శ్రీనివాసులు, ఎస్. శ్రీనివాసులు, మురుగదాస్‌లతో పాటు ప్రయివేటు వ్యక్తులు ఉమాపతి, రాజేష్, పరంధామ్ చెక్‌పోస్టు లోపల ఉన్నారు. ప్రయివేటు వ్యక్తుల నుంచి రూ.14,560లు, కిచెన్ నుంచి రూ.7300లు స్వాధీనం చేసుకున్నారు. నిఘాను పెంచాం తమిళనాడు సరిహద్దు చెక్‌పోస్ట్ కావడంతో పాటు ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న దరిమిలా నాగలాపురం చెక్‌పోస్ట్‌పై నిఘా పెంచామని ఏసీబీ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. అవినీతిని తగ్గించేందుకు దాడులు కొనసాగిస్తూనే ఉన్నామన్నారు. వాణిజ్య పన్నుల శాఖలో కలవరం నాగలాపురం చెక్‌పోస్ట్‌లో ఏసీబీ దాడులు జరిగిన నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాల్లో పనిచేసే వాణిజ్య పన్నుల శాఖలో కలవరం మొదలైంది. కాగా 2016 డిసెంబరు మొదటి వారంలో ఒకిరిద్దరు ఉద్యోగులపై వేటు పడిందనీ, ఈసారి ఎవరిపై దెబ్బ పడుతుందోనని బెంబేలెత్తుతున్నారు. -
చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి: భారీగా నగదు స్వాధీనం
చిత్తూరు: చిత్తూరు జిల్లా నాగులాపురం అంతరాష్ట్ర చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టు సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్న రూ. 34,080 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు ఏసీబీ అధికారులు చెక్‌పోస్టులో ప్రవేశించి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సిబ్బంది కృష్ణయ్య వద్ద రూ.15వేలు, ఉమాపతి వద్ద రూ.4,080 లభించాయి. అలాగే కార్యాలయంలోని గ్యాస్ సిలిండర్ కింద రూ.10 వేలు, వంటగదిలో ర్యాక్ కింద మరో రూ.3 వేలు, బ్యాటరీ కింద రూ.2 వేలు దొరికాయి. రాత్రి డ్యూటీలో ఉన్న ఏసీటీవో ప్రతాపరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ కోటేశ్వరరావు, ఆఫీసు సబార్డినేట్ సుదర్శన్‌ను అధికారులు విచారించి, వివరాలు రాబట్టారు. సిలిండర్, ర్యాక్, బ్యాటరీ కింద దొరికిన నగదుతో తమకు సంబంధం లేదని వారు ఏసీబీ అధికారులకు వెల్లడించారు. -
ఐటీ అధికారులమంటూ వచ్చి... దోచుకు పోయారు
తిరుపతి : చిత్తూరు జిల్లా నాగులాపురంలో దోపిడి దొంగలు గురువారం తెల్లవారుజామున హల్చల్ చేశారు. ఐటీ అధికారులమంటూ స్థానిక అంబికా జ్యూయలర్స్‌లోకి చొరబడ్డారు. అనంతరం యజమానిని బంధించి... దోపిడికి పాల్పడ్డారు. షాపులోని దాదాపు రూ. 7 లక్షలు విలువైన నగలతోపాటు రూ. 5 వేలు నగదు అపహరించి... అక్కడ నుంచి పరారైయ్యారు. గురువారం ఉదయం షాపు యజమాని బిగ్గరగా అరవడంతో స్థానికులు స్పందించి.... యజమాని కట్లు విప్పారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... దోపిడి జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెక్‌పోస్ట్ పై ఏసీబీ దాడులు
నాగాలపురం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా నాగాలపురం కమర్షియల్ చెక్‌పోస్ట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆదివారం తిరుపతి ఏసీబీ అధికారి శంకర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో రూ. 39,889లు అదనంగా కలిగి ఉన్నట్లు గుర్తించారు. కాగా తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
చెక్‌పోస్ట్‌లో ఏసీబీ తనిఖీలు: ముగ్గురు అరెస్ట్
చిత్తూరు : చిత్తూరు జిల్లా నాగలాపురం కమర్షియల్ ట్యాక్స్ చెక్‌పోస్ట్‌లో ఆదివారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్‌పోస్ట్ సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న రూ. 40 వేల నగదును స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. సదరు నగదుపై ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు చెక్‌పోస్ట్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. దాంతో అందుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. -
వైభవంగా సూర్యపూజ మహోత్సవం
నాగలాపురం: చిత్తూరు జిల్లా నాగలాపురంలో వెలసిన వుత్స్యావతార వేదనారాయణస్వామి సూర్యపూజ వుహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు బుధవారం నిర్వహించిన ఈ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై సూర్యపూజ దర్శనం చేసుకున్నారు. సాయం సంధ్య వేళ సూర్యుని కిరణాలు గర్భాలయుం వరకు చేరిన అధ్భుత సన్నివేశాన్ని భక్తులు భక్తి ప్రపత్తులతో తిలకించారు. పరిచారిక పుణ్యజలాన్ని చిలకరిస్తుండగా భక్తజనులు రవి కిరణాలకు భక్తి ప్రపత్తులతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఘనంగా స్నపన తిరుమంజనం నాగలాపురం వేదనారాయణస్వామి ఆలయంలో జరుగుతున్న సూర్యపూజ మహోత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం గోదాదేవి సమేత వేదనారాయణస్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయ ప్రధాన అర్చకులు దొరైరాజ భట్టాచార్య, రాజాభట్టాచార్యులు స్నపన తిరుమంజన సేవను ఘనంగా నిర్వహించారు. కోలాహలంగా తిరువీధి ఉత్సవం వేదమంత్రోచ్ఛారణలు, కేరళవారుుద్యాలు, కోలాట భజన బృందాల నృత్యాలు, మంగళవారుుద్యాల సవ్వడి నడుమ గోదాదేవి సమేత వేదనారాయణస్వామి వారి తిరువీధి ఉత్సవం కోలాహలంగా సాగింది. సూర్యపూజ దర్శనానంతరం స్వర్ణకచిత ఆభరణాలు, సుగంధ పరిమళాలను వెదజల్లే పుష్పాలతో గోదాదేవి సమేత వేదనారాయుణస్వామిని అలంకరించి తిరుచ్చిపై ఆశీనులను చేసి తెప్పోత్సవానికి సిద్ధం చేశారు. విద్యుత్ కాంతుల వుధ్య స్వామి అవ్మువార్ల తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆలయంలో ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథా గానం, అన్నమయ్య ప్రాజెక్ట్ సౌజన్యంతో నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల ఆలాపన భక్తులకు వీనుల విందు కలిగించారు. ఈ కార్యక్రమాలను సూపరెంటెండెంట్ చంద్రశేఖరరెడ్డి, ఆలయూధికారి లోకనాథరెడ్డి పర్యవేక్షించారు. -
పెళ్లి చేసుకుని వెళుతూ...
అచ్చవునాయుుడు కండ్రిగ(నాగలాపురం) : పెళ్లి చేసుకుని వె ళుతూ రోడ్డు ప్రమాదానికి గురై ఐదుగురు చెన్నైవాసులు గాయపడిన సంఘటన నాగలాపురం మండలం అచ్చమనాయుడు కండ్రిగ మలుపు సమీపంలో సోమవారం ఉదయుం 11 గంటల ప్రాంతంలో జరిగింది. ఆదివారం రాత్రి నారాయణవనం సొరకాయలస్వామి ఆలయంలో చెన్నై పెరంబూరుకు చెందిన లోకేష్(55), విజయలక్ష్మి(28) వివాహం జరిగింది. సొంత కారులో తిరుగు ప్రయణవుయ్యరు.అచ్చవునాయుుడుకండ్రిగ మలుపు వద్ద రోడ్డు పక్కన ఉన్న మంచినీటి బావి గోడకు కారు అదుపు తప్పి ఢీకొంది. కారు నడుపుతున్న వరుడు లోకేష్(55), విజయులక్ష్మి(28), షర్మిల(40), పూర్ణివు(41), వునోర్మణి(67) గాయపడ్డారు. వారిని 108 వాహనంలో తమిళనాడులోని ఊతుకోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానిక ఎస్ఐ సువున్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పగబట్టిన పాము!
పాము పగ నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చాయి. వాటికి భిన్నమైన కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘నంజుపురం’, తెలుగులో ‘నాగలాపురం’ పేరుతో విడుదల కానుంది. కె. సృజన సమర్పణలో మురళీమోహన్ కూసుపాటి ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. రాఘవ్, మోనికా జంటగా చార్లెస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ యువకుడు చేసిన పొరపాటు వల్ల పాము పగబడుతుంది. చంద్రగ్రహణం నాటికి అతన్ని చంపేయాలనుకుంటుంది. మహాభక్తురాలైన అతని ప్రేయసి ఎలాగైనా ప్రియుణ్ణి కాపాడుకోవాలనుకుంటుంది. తను అనుకున్నది సాధించిందా? లేదా అనేది తెరపై ఆసక్తిగా ఉంటుంది. ప్రేమ, పగ, సెంటిమెంట్‌తో సాగే సినిమా’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాత: పి.మంగమ్మ. -
పగబట్టిన పాము కథ
అదో అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఓ యువతి, యువకుడు ప్రేమించుకుంటారు. తెలియక ఆ యువకుడు చేసిన ఓ పని వల్ల ఒక పాము అతనిపై పగబడుతుంది. మహా భక్తురాలైన అతని ప్రేయసి ఎలాగైనా ప్రియుణ్ణి కాపాడాలనుకుంటుంది. తర్వాత ఏం జరిగింది? అనే కథతో రూపొందిన తమిళ చిత్రం ‘నంజుపురం’. ఈ చిత్రాన్ని ‘నాగలాపురం’ పేరుతో కె. సృజన సమర్పణలో మురళీమోహన్ కూసుపాటి తెలుగులో విడుదల చేయనున్నారు. ‘శివరామరాజు’లో చెల్లెలి పాత్ర, ‘మా అల్లుడు వెరీ గుడ్డు’ తదితర చిత్రాల్లో కథానాయికగా నటించిన మోనిక ఈ చిత్రంలో హీరోయిన్. రాఘవ్ హీరో. ప్రేమ, పగ, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో రూపొందిన చిత్రమని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: మంగమ్మ, దర్శకత్వం: చార్లెస్. -
ఎస్పి ఫిర్యాదుని పట్టించుకోని పోలీసులు