తాడేపల్లిగూడెంలో షాపింగ్‌మాల్‌ను కూలుస్తున్న పొక్లెయిన్
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చమగోదావరి) : అక్రమార్కులపై అధికారులు మళ్లీ కొరడా ఝుళిపించారు. పార్కింగ్ నిమిత్తం ప్లానులో చూపించిన స్థలంలోనూ దుకాణ సముదాయాలు(షాపింగ్‌మాల్) నిర్మించి సొమ్ములు చేసుకున్న వారి పనిపట్టారు. గణేష్ రైస్ మిల్లు ప్రాంతంలో అక్రమంగా మూడు అంతస్తులుగా నిర్మించిన 33 దుకాణాల సముదాయాన్ని మున్సి పల్ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేర కు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం కూల్చివేశారు. అక్రమార్కులు ఎంతటి వారైనా కఠినంగా ఉంటామనే సంకేతాలు పంపారు.
ఇటీవలే దేవదాయ భూముల్లో ఆక్రమణల తొలగింపు
గత ప్రభుత్వ హయాంలో అగ్రనేతలు మా వెనుక ఉన్నారనే అహంతో పట్టణంలోని తాళ్లముదునూరుపాడు బాల వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన భూములను భుజ బలంతో ఆక్రమించుకొని, రెక్కాడితే కాని డొక్కాడని అల్పాదాయ వర్గాల వారికి అమ్మి బురిడీ కొట్టించిన వారి వ్యవహారాన్ని ఇటీవలే దేవదాయశాఖ అధికారులు బట్టబయలు చేశారు. ఆ భూములలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను, రహదారులను ధ్వంసం చేశారు. ఆనక విషయం న్యాయస్థానం పరిధిలోకి వెళ్లడంతో మిగిలిన తంతు తాత్కాలికంగా ఆగింది. ఇదిలా ఉంటే తాజాగా స్థానిక గణేష్ రైస్ మిల్లు ప్రాంతంలో ఉన్న వ్యాపార సముదాయానికి పార్కింగ్ స్థలంగా మున్సిపాలిటీకి చూపించి ఆ తర్వాత ఆ స్థలంలోనూ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలపై అధికారులు కన్నెర్ర చేశారు. నిబంధనల ప్రకారం.. పార్కింగ్ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు.
దీంతో నిర్మాణదారులు అప్పటి పాలకులతో లాలూచీ చేసుకుని పార్కింగ్ స్థలంలోనూ అక్రమ నిర్మాణం చేపట్టారు. మూడు అంతస్తుల్లో 33 దుకాణాలు నిర్మించారు. మార్కెట్ ప్రాంతం కావడంతో భారీగానే అమ్మకాలు సాగించారు. ఇదే అంశంపై భవన నిర్మాణదారులు కొన్ని వర్గాలను సంతృప్తి పర్చే విషయంలో అంకెల లెక్కలు సరితూగక కౌన్సిల్‌లో రచ్చ కూడా సాగింది. తర్వాత షరా ‘మామూలే’ అక్రమ నిర్మాణం సజావుగా సాగిపోయింది. అధికారులు నోరు మెదపలేదు. న్యాయపరమైన ప్రతిబంధకాలను తట్టుకునేలా నిర్వాహకులు ముందుకు సాగారు. అయితే సీఎం వైఎస్ జగన్ అక్రమ నిర్మాణాల విషయంలో రాజీ లేకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించడంతో అక్రమ కట్టడాల తొలగింపునకు అధికారులు నడుంబిగించారు. కమిషనర్ ఆదేశాలతో రికార్డుల ఆధారంగా భవన సముదాయాన్ని కూల్చివేశారు. కొవ్వూరు సబ్ డివిజన్ పరిధిలోని 200 మంది పోలీసుల బందోబస్తు నడుమ కూల్చివేత కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేశారు.
అక్రమ నిర్మాణాలు కనుక కూల్చివేశాం
గణేష్ రైస్ మిల్లు ప్రాంతంలో నిర్మించిన దుకాణ సముదాయాలకు పార్కింగ్ స్థలంగా చూపించి అందులోనూ మూడు అంతస్తులలో 33 దుకాణాలను నిర్మించారు. ఈ నిర్మాణాలకు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతీ లేదు. దీంతో అధికారుల ఆదేశాలతో రికార్డుల ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశాం. 4048.97 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అక్రమ నిర్మాణం సాగింది.
– మధుసూదనరావు, అసిసెంటు సిటీ ప్లానర్, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ
Comments
Please login to add a commentAdd a comment