కాకినాడ క్రైం: సముద్రంలో కొంత కాలంగా సాగుతున్న అక్రమ డీజిల్ రాకెట్‌ను కాకినాడ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఫైబర్ బోటులో అనుమానాస్పదంగా ఉన్న తొమ్మిది మంది యువకులతో పాటు వారి వద్దనున్న సుమారు పది వేల డాలర్ల విదేశీ కరెన్సీ(రూ.6.30 లక్షలు)తో పాటు 350 లీటర్ల డీజిల్, రెండు మోటార్ ఇంజన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం కాకినాడ యాంకరేజీ పోర్టులో అక్రమంగా షిప్పులపై నుంచి డీజిల్ రవాణా జరుగుతోందన్న సమాచారంతో యాంకరేజ్ పోర్టులో ఎస్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ కేశవరాం ఆధ్వర్యంలో సముద్రంలో గస్తీ నిర్వహించారు. ఆ సమయంలో ఒక ఫైబర్ మోటరైజ్డ్ బోటుపై తొమ్మిది మంది వ్యక్తులు వెళుతుండగా, బోటును ఆపాలని కోరారు.
అయితే వారు లెక్క చేయకుండా ముందుకెళ్లడంతో బోటును వెంబడించి తనిఖీ చేశారు. యువకుల వద్ద పది వేల డాలర్ల విదేశీ కరెన్సీ, ఎనిమిది డ్రమ్ముల్లో సుమారు 350 లీటర్ల డీజిల్, పది లీటర్ల పెట్రోలు, షిప్పుల్లో నుంచి బోట్లలోకి ఆయిల్ తోడేందుకు వినియోగించే రెండు ఇంజన్లను గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా షిప్పుల నుంచి ఆయిల్‌ని తక్కువ ధరకు కొనుగోలు చేసి బోట్లకు విక్రయిస్తున్నట్టు చెప్పారు. డీసెల్ అక్రమ రవాణా, విదేశీ కరెన్సీ లభించడంతో పోర్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు కేసును కస్టమ్స్ అధికారులకు అప్పగించినట్టు ఇన్‌స్పెక్టర్ కేశవరాం తెలిపారు. ఈ విషయమై కస్టమ్స్ సీఐ మాధవరావుని వివరణ కోరగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. పట్టుబడిన వారందరూ కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు.
సముద్ర అక్రమ రవాణాలో యువకులు
సముద్రంలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలో యువకులు అధికంగా ఉండటం విశేషం. మరోవైపు అక్రమ రవాణా దందా కోట్లలో టర్నోవర్ కావడం, ఇందులో బడాబాబుల హస్తం ఉండడంతో ఈ వ్యవహారంలో మెరైన్ పోలీసులు, ఎస్‌పీఎఫ్ సిబ్బందికి తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం కాకినాడ యాంకరేజ్ పోర్టు, సూర్యారావుపేట, వాకలపూడి, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాల్లో రూ.లక్షల్లో చీకటి వ్యాపారం జరుగుతుంటే అధికారుల దాడుల్లో కేవలం రోజువారీ కూలి పనులకు వచ్చిన యువకులే కేసుల్లో ఇరుక్కుంటున్నారు. నిర్వాహకులు మాత్రం దర్జాగా తప్పించుకు తిరుగుతున్నారు.