రామభద్రపురం: రామభద్రపురం మండలంలో జోరుగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. చాలా వరకు గ్రామాల్లో నాణ్యమైన గ్రావెల్ లభ్యం కావడంతో ఇతర మండలాల వారు కూడా వచ్చి తరలించుకుపోతున్నారు. కొందరైతే ఏకంగా కాంట్రాక్టర్ అవతారం ఎత్తి అనుమతులు లేకుండానే రియల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అంతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నా పట్టించుకునే అధికారులు కానరావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రం నుంచి తారాపురం మీదుగా సాలూరుకు వెళ్లే జాతీయ రహదారి పక్క నుంచి మిర్తివలస గ్రామానికి వెళ్లే రోడ్డు ఆనుకుని ఉంది. దానికి సమాంతరంగా బొబ్బిలికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొట్టక్కి రెవెన్యూ పరిధిలోని 301, 315, 316 సర్వే నంబర్లలోని 13.30 ఎకరాల్లో లేఅవుట్ వేస్తున్నారు. దానికి బొబ్బిలికి చెందిన ఓ కాంట్రాక్టర్ గ్రావెల్ సమకూర్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అంతే నిబంధనలను గాలికొదిలేసి మండలంలోని నాయుడువలస పంచాయతీ పరిధిలోని 34 సర్వే నంబర్ బొంగువాని చెరువులో నీరు – చెట్టు పథకం కింద పూడికలు తీయిస్తున్నామన్న నెపంతో అక్రమంగా జేసీబీతో గ్రావెల్ తవ్వించి టిప్పర్లతో తరలిస్తున్నారు.
దరఖాస్తు చేయలే..
వాస్తవానికి చెరువులో పూడికల పేరుతో మట్టి, గ్రావెల్ తీయాలంటే సదరు వ్యక్తులు తహసీల్దార్‌కు మీ సేవలో దరఖాస్తు చేయాల్సి ఉంది. దాన్ని తహసీల్దార్ ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. వారు ఆ చెరువును గుర్తించి లోతును బట్టి అనుమతి ఇవ్వాలి. ఇంత జరిగితే కానీ మట్టి తవ్వకాలకు వీల్లేదు. కానీ ఇక్కడ గ్రావెల్ తరలిస్తున్న కాంట్రాక్టర్ ఇరిగేషన్ ఈఈ వద్ద అనుమతులు తీసుకున్నట్లు చెబుతున్నాడంట. అయితే దీనిపై అసలు విషయాలు రావాల్సి ఉంది. ఇలాగే మండలంలో చాలా గ్రామాల్లో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ పట్టించుకునే అధికారులే కానరావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే సాగునీరు మదుముల ద్వారా వెళ్లే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు.
అనుమతులు మార్చి..
మండలంలో గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్న కాంట్రాక్టర్ వంగపండు శ్రీపారినాయుడు. ఆయనకు ఇరిగేషన్ అధికారులు బొబ్బిలి మున్సిపాలిటీలోని ఓ చెరువుకు తవ్వకాలకు అనుమతులు ఇస్తే, ఆయన రామభద్రపురం మండలంలో తవ్వకాలు చేపడుతున్నారు. ఈ మండలంలోని చెరువులు పార్వతీపురం సబ్ డివిజన్‌లో ఉంటాయి. అక్కడి అధికారులు అనుమతులు ఇస్తే తప్ప తవ్వకాలకు వీలుకాదు. మరి బొబ్బిలి అధికారులు ఇస్తే ఎలా తవ్వకాలు చేస్తున్నారో అర్థం కాని విషయం. అయితే ఈ కాంట్రాక్టర్‌కు బొబ్బిలి పద్మనాయుని చెరువు తవ్వకాలకు అనుమతి ఇస్తే ఆయన రామభద్రపురం మండలంలోని నాయుడు వలస పంచాయతీ బొంగురు చెరువులో తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్లు తహసీల్దార్‌కు ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ మార్పిడి ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. అధికారులే ఇలా అనుమతి ఇచ్చారా లేక కాంట్రాక్టర్ ఏమైనా ఫోర్జరీ చేశారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
అనుమతి పొందా..
నీరు చెట్టు పథకం కింద చెరువులో మట్టి తీసేందుకు క్యూబిక్ మీటర్‌కు ఒక రూపాయి చొప్పున చలానా తీశా. ఇరిగేషన్ అధికారుల వద్ద అనుమతి కూడా తీసుకుని గ్రావెల్ తరలిస్తున్నా.
– వంగపండు శ్రీపారినాయుడు, కాంట్రాక్టర్.
తవ్వకాలకు ఆర్డరు ఇవ్వలే..
చెరువుల్లో మట్టి గ్రావెల్ తీసేందుకు మావద్దకు ఎలాంటి దరఖాస్తులు రాలేదు. ఎవరికీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ తరలిస్తే చర్యలు తీసుకుంటాం.
–డి.సురేష్, ఇరిగేషన్ డీఈఈ, పార్వతీపురం.
నేను అనుమతులు ఇవ్వలే..
రామభద్రపురం మండంలలోని సీతారాంపురం, గొల్లపేట, రొంపల్లి గ్రామాలు మాత్రమే బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. నాయుడువలస పార్వతీపురం సబ్ డివిజన్‌లోకి వెళ్తుంది. అక్కడ గ్రావెల్ తవ్వకాలకు తాను అనుమతులు ఇవ్వలేను. సదరు కాంట్రాక్టర్‌కు అనుమతి పత్రం ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఈఈ దృష్టిలో పెట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం.
– బాలసూర్యం, ఇరిగేషన్ డీఈఈ, బొబ్బిలి.
Comments
Please login to add a commentAdd a comment