పక్కన పడేసిన ప్రభుత్వ హెచ్చరిక బోర్డు
సాక్షి, మధురవాడ(విశాఖపట్టణం) : అక్రమార్కులు తీరులో మార్పు రావడం లేదు. భూ దందాలకు అలవాటు పడిపోయిన వీరు ఎంతటి పనికైనా వెనుకాడడం లేదు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ఏవిధంగానైనా చేజిక్కించుకోవాలని అర్రులు చాస్తున్నారు. దీనికి జీవీఎంసీ 5వ వార్డు మధురవాడ అప్ బ్రిడ్జి సమీపంలోని కృష్ణానగర్ రోడ్డును అనుకుని ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా కాండే నిదర్శనం. దీని సమీపంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమినే తప్పుడు పద్ధతుల్లో అమ్మేశారు. తాజాగా దానిని ఆనుకుని మరికొంత భూమిలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు తీసేసి కూడా ఆక్రమణకు సిద్ధమవుతున్నారు.
సాక్షిలో ప్రచురితమైన కథనం
ఇదీ పరిస్థితి : సర్వే నెంబరు. 168–164 మధ్య ఉన్న రోడ్డు, గెడ్డకు చెందిన కోటి రూపాయలు విలువ చేసే సుమారు 300 గజాల స్థలంలో 2016లో ఓ వ్యక్తి ఫెన్సింగ్, ప్రహరీ కట్టి ఆక్రమణకు ప్రయత్నం చేశాడు. దీనిపై 2016 జూన్ 25న అరకోటి స్థలం కబ్జా అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన రెవెన్యూ అధికారులు నిర్మాణాలను కూల్చేసి ఇక్కడ రెండు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు తాజాగా అధికారులు వేసిన ఫెన్సింగ్ తొలగించి ఆక్రమణకు ప్రయత్నం చేశారు. స్థానికులు ఫిర్యాదు మేరకు దీనిని రెండో సారి కూడా రెవెన్యూ అధికారులు కూల్చేశారు. అయితే రెండు రోజుల కిందట ఇక్కడ ఏర్పాటు ప్రభుత్వ హెచ్చరిక బోర్డును కూడా పీకేసి పక్కన పడేశారు.
చర్యలు లేక పోవడం వల్లే బరితెగింపు
ఇక్కడ 2016లో ఆక్రమణకు ప్రయత్నం చేసినప్పుడు ఆక్రమణ తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. తాజా ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా కూడా ఫెన్సింగ్ తొలగించారు తప్పా చర్యలు చేపట్టలేదు. దీంతో ఇప్పుడు హెచ్చరిక బోర్డునే పీకేశారు. కనీసం ఉన్నత స్థాయి అధికారులు అయినా స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.దీనిపై మధురవాడ వీఆర్‌వో కె. అప్పారావు విరవణ కోరగా ఇది ప్రభుత్వ స్థలమేనని ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కూలగొట్టామని హెచ్చరిక బోర్డు పీకి పడేసిన వారిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment