illegal Land danda
-
కాంగ్రెస్ ‘పవర్’పంచ్: గరీబోళ్ల భూముల్లో గులాబీ గద్దలు
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ ‘పవర్’పంచ్ విసిరింది. 10 మంది మంత్రులపై ఆరోపణలను ఎక్కుపెట్టింది. దొంగలముఠాలా ఏర్పడి దోచుకుతింటున్నారని ధ్వజమెత్తింది. పేదల భూములపై రాబందుల్లా వాలిపోయి కబ్జా చేశారని తీవ్రంగా విమర్శించింది. మంత్రుల అవినీతి, అక్రమాలపై సీఎం కేసీఆర్ సక్రమంగా విచారణ జరిపిస్తారన్న నమ్మకం రాష్ట్ర ప్రజలకు లేదని, అందుకే సిటింగ్ జడ్జితోగానీ, సీబీఐతోగానీ విచారణ జరిపించాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ డిమాండ్ చేశారు. ‘గరీబోళ్ల భూముల్లో గులాబీ గద్దలు’పేరిట శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో భూకబ్జాలు తారస్థాయికి చేరాయని, కొందరు మంత్రులైతే దళితుల భూములు, దేవుడి మాన్యాలను కూడా వదలడంలేదని ఆరోపించారు. భూకబ్జాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జూమ్‌యాప్ ద్వారా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, నాయకులు అనిల్‌యాదవ్, రోహిత్‌లు పాల్గొన్నారు. ఆయా మంత్రులపై సంపత్ కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో చేసిన ఆరోపణలు ఈవిధంగా ఉన్నాయి... మంత్రి కేటీఆర్ ఫాంహౌస్‌లో అక్రమాలు జరిగాయని తమ పార్టీ ఎంపీ రేవంత్ ఆధారాలతోసహా బయటపెడితే ఆయన్ను జైలుకు పంపారు. దేవరయాంజాల్ దేవాలయ భూములను కేటీఆర్ ఆక్రమించారు. దేవరయాంజాల్ భూముల్లోనే మంత్రి మల్లారెడ్డి ఫామ్‌హౌస్ కట్టుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి మల్లారెడ్డి బ్యాంక్ లాంటివాడు కాబట్టే కేసీఆర్ పట్టించుకోవడం లేదు. మంత్రి గంగుల కమలాకర్ భూముల విషయమై ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం మీదనే కోర్టులో కేసు వేశారు. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు వచ్చినా ఎలాంటి చర్యలూ లేవు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు భూములను మంత్రి పువ్వాడ అజయ్ అప్పనంగా అనుభవిస్తున్నారు. ఆయన పార్టీ మారినందుకు రూ.50 కోట్ల విలువైన భూమి, మంత్రి పదవిని ఇచ్చారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోట్లాది రూపాయల విలువైన భూముల్ని ఆక్రమించారు. 200 ఎకరాల్లో ఫామ్‌హౌస్ కట్టుకుని విలాసవంతంగా జీవిస్తున్నారు. మరోమంత్రి శ్రీనివాస్‌గౌడ్ కూడా భూకబ్జాల్లో ఆరితేరారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే కుష్టు ఆసుపత్రి భూముల్ని కూడా వదల్లేదు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై ఎన్నిసార్లు భూకబ్జా ఆరోపణలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోరు. మంత్రులు ఎర్రబెల్లి, మహమూద్ అలీలపై వచ్చి న ఆరోపణలను కూడా సీఎం కేసీఆర్ పెడచెవిన పెడుతున్నారు. రాబందుల్లా పడ్డారు: ఉత్తమ్ కాంగ్రెస్ హయాంలో పేదలకు భూమి పంపిణీ చేస్తే టీఆర్ఎస్ నేతలు వాటిని కబ్జా చేశారని ఉత్తమ్ ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఒకవైపు సీఎం కేసీఆర్ చెబుతుండగా, మరోవైపు తన కేబినెట్ సహచరులు రాబందుల్లా వారి భూములను కబ్జా చేస్తున్నారని అన్నారు. వీరంతా దొంగల ముఠాలాగా ఏర్పడి అక్రమంగా దోచుకుంటున్నారని విమర్శించారు. భూదందాలకు పాల్పడిన మంత్రులను శిక్షించాలని రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాయనున్నట్టు ఉత్తమ్ వెల్లడించారు. చదవండి: Etela Rajender: రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనుకుంటున్నారు -
వదల బొమ్మాళీ!
సాక్షి, మధురవాడ(విశాఖపట్టణం) : అక్రమార్కులు తీరులో మార్పు రావడం లేదు. భూ దందాలకు అలవాటు పడిపోయిన వీరు ఎంతటి పనికైనా వెనుకాడడం లేదు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ఏవిధంగానైనా చేజిక్కించుకోవాలని అర్రులు చాస్తున్నారు. దీనికి జీవీఎంసీ 5వ వార్డు మధురవాడ అప్ బ్రిడ్జి సమీపంలోని కృష్ణానగర్ రోడ్డును అనుకుని ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా కాండే నిదర్శనం. దీని సమీపంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమినే తప్పుడు పద్ధతుల్లో అమ్మేశారు. తాజాగా దానిని ఆనుకుని మరికొంత భూమిలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు తీసేసి కూడా ఆక్రమణకు సిద్ధమవుతున్నారు. సాక్షిలో ప్రచురితమైన కథనం ఇదీ పరిస్థితి : సర్వే నెంబరు. 168–164 మధ్య ఉన్న రోడ్డు, గెడ్డకు చెందిన కోటి రూపాయలు విలువ చేసే సుమారు 300 గజాల స్థలంలో 2016లో ఓ వ్యక్తి ఫెన్సింగ్, ప్రహరీ కట్టి ఆక్రమణకు ప్రయత్నం చేశాడు. దీనిపై 2016 జూన్ 25న అరకోటి స్థలం కబ్జా అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన రెవెన్యూ అధికారులు నిర్మాణాలను కూల్చేసి ఇక్కడ రెండు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు తాజాగా అధికారులు వేసిన ఫెన్సింగ్ తొలగించి ఆక్రమణకు ప్రయత్నం చేశారు. స్థానికులు ఫిర్యాదు మేరకు దీనిని రెండో సారి కూడా రెవెన్యూ అధికారులు కూల్చేశారు. అయితే రెండు రోజుల కిందట ఇక్కడ ఏర్పాటు ప్రభుత్వ హెచ్చరిక బోర్డును కూడా పీకేసి పక్కన పడేశారు. చర్యలు లేక పోవడం వల్లే బరితెగింపు ఇక్కడ 2016లో ఆక్రమణకు ప్రయత్నం చేసినప్పుడు ఆక్రమణ తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. తాజా ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా కూడా ఫెన్సింగ్ తొలగించారు తప్పా చర్యలు చేపట్టలేదు. దీంతో ఇప్పుడు హెచ్చరిక బోర్డునే పీకేశారు. కనీసం ఉన్నత స్థాయి అధికారులు అయినా స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.దీనిపై మధురవాడ వీఆర్వో కె. అప్పారావు విరవణ కోరగా ఇది ప్రభుత్వ స్థలమేనని ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కూలగొట్టామని హెచ్చరిక బోర్డు పీకి పడేసిన వారిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతామని చెప్పారు. -
భూ బకాసురులు
కళానగర్లోటీడీపీ నాయకుల దందా ఆక్రమణలు తొలగించిన చోటే నిర్మాణాలు హెచ్చరిక బోర్డులు మాయం మధురవాడ : భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. టీడీపీ నేతల అండతో ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జీవీఎంసీ 4,5 వార్డుల్లో కబ్జాలు నిత్యకృత్యమయ్యాయి. వీరి దందా ముందు హెచ్చరిక బోర్డులు కూడా తలవంచుతున్నాయి. సాక్షాత్తూ కలెక్టర్ పేరిట ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి నిర్మాణాలు చేస్తున్నా రెవెన్యూ,జీవీఎంసీ అటు వైపు కన్నెత్తి చూడక పోవడంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. కలెక్టర్ పేరిట ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు సైతం పీకి పడేసి ఆక్రమణలకు పాల్పడుతున్నా వారి వంక కన్నెత్తి చూసేవారు కూడా కరువయ్యారు. ఈ ఆక్రమణలకు ప్రధాన సూత్రధారులు అధికార పార్టీనాయకులు, వారి అనుచరులే కావడంతో వారి అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. దీనికి జీవీఎంసీ 5వ వార్డులోని కళానగర్‌లోని ఈడబ్ల్యూఎస్ లే అవుట్లో ఆక్రమణల పర్వమే నిదర్శనం. ఇదీ పరిస్థితి సర్వే నంబరు 161/1లో ఉన్న 36.12ఎకరాలు ప్రభుత్వ భూమి,161/2లో మరికొంత అనాధీన ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన భూమిలో కొంత గెడ్డ ఉండగా, 1985 ప్రాంతంలో సుమారు 55 మంది కళాకారులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. తర్వాత మరి కొందరికి పట్టాలు ఇచ్చారు. మిగిలిన విస్తీర్ణం ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉన్నా.. క్షేత్ర స్థాయిలో ఆక్రమణలు వెలిశాయి. పేదల పేరిట టీడీపీ నాయకులు ఇటు గెడ్డ స్థలంలో, ప్రభుత్వ స్థంలో కూడా డెబ్రిస్ వేసి కప్పేసి మరో వైపు నిర్మాణాలు చేస్తున్నారు. తొలగించిన చోటే నిర్మాణాలు ఇక్కడ గెడ్డ వైపు రెండు చోట్ల గతంలో ప్రస్తుతం ల్యాండ్ ప్రొటెక్షన్ స్పెషల్ ఆర్ఐగా ఉన్న రవిశంకర్ ఆధ్వర్యంలో ఆక్రమణలు తొలగించి, హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆక్రమణ తొలగించిన స్థంలోనే షెడ్ వెలసింది. హెచ్చరిక బోర్డు పీకేసి మరో షెడ్ నిర్మించారు. ఇష్టానుసారంగా గెడ్డ స్థలం పూడ్చివేత ఇక కళానగర్– వాంబే కాలనీ మధ్య ఉన్న గెడ్డె–చెక్ డ్యాం స్థలం కప్పుకున్న వారికి కప్పు కున్నంత అన్నట్టు ఉంది. దీనిని ఆనుకుని ఇళ్లు నిర్మాణం చేసుకున్న వారు, చోటా నాయకులు డెబ్రిస్ తెచ్చి ఇష్టాను సారంగా పూడ్చి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కోట్లు విలువ చేసే భూమిపై ఎందుకు నిర్లక్ష్యం? ఈ కాలనీ జాతీయ రహదారి సమీపంలో ఉండడంతో ఎకరం రూ.8కోట్ల వరకు పలుకుతోంది. ఇక్కడ ఒక్కో షెడ్ అనధికారికంగా రూ.5 నుంచి రూ.6లక్షల వరకుఅమ్ముడవుతుంది. దీంతో కబ్జారాయుళ్లు కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేరిట షెడ్లు వేసి ఆక్రమణలకు పాల్పడున్నారు. ఇంత బహిరంగంగా ప్రభుత్వ భూమి కబ్జా, వ్యాపారం సాగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఆక్రమణలు రెగ్యులరైజ్ చేయిస్తామని, రెవెన్యూ అధికారులకు సమర్పించుకోవాలని టీడీపీ నాయకులు ఒక్కోరి వద్ద నుంచి రూ. 10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కబ్జాదారులకు కలిసొచ్చిన వేళ రెండు నెలలుగా బదిలీలు, ఓటర్ల ఎన్యూమరేషన్, స్మార్టు పల్స్‌సర్వే కబ్జారాయుళ్లకు వరంగా మారాయి. ఇక్కడ ఉన్న ఐదుగురు వీఆర్వోలు స్మార్టు పల్స్ సర్వేలో ఎన్యూమరేటర్లుగా, వీఆర్ఏలను ట్యాబ్ అసిస్టెంట్లుగా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆక్రమణల పర్వం నిరభ్యంతరంగా సాగుతుండటంతో మరికొంత మంది ఆక్రమణలు సిద్ధమవుతున్నారు. టీడీపీ నాయకుల కన్నెర్రతో మౌనం జీవీఎంసీ 4వ వార్డు సాయిరాంకాలనీలో కొన్ని ఆక్రమణలకు తొలగించేందుకు వీఆర్వోలు సిద్ధం కాగా ఇద్దరు టీడీపీ ముఖ్య నాయకులు అడ్డుపడటంతో వారు తోక ముడిచారు. టీడీపీ నేతలు ఆగడాలకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని స్థానికులు అంటున్నారు. ఉన్నత స్థాయి అధికారులు ఆక్రమణ దారులకే కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పరిశీలించి చర్యలు నేను ఇటీవలే బాధ్యతలు స్వీకరించాను. ఈ విషయం ఇంత వరకు మా దృష్టికి రాలేదు. ఫీల్డ్‌లో పరిస్థితి అంతా పరిశీలించి చర్యలు చేపడతాం. అక్రమణ దారులపై కఠినంగా వ్యవహరిస్తాం. –ఎం.శంకరరావు, తహసీల్దార్