నిఘా...దగా!
ఇదో సినిమాలో సన్నివేశం ... బీదర్ నుంచి రోజుకో బైక్‌పై హాస్యనటుడు ఆలీ ఇసుకను బస్తాల్లో వేసి తీసుకొస్తుంటాడు... ఆ ఇసుకలో ఏదో ఉందన్న అనుమానంతో చెక్‌పోస్టులో తనిఖీలో ఉన్న పోలీసు అధికారితోపాటు సిబ్బంది ఎంతగా వెతికినా ఏమీ దొరకదు. ప్రతిరోజూ ఇదే పని. చివరకు ఆ పోలీసు అధికారే అసలు విషయం ఏమిటో చెప్పరా బాబ్బాబు అని బతిమలాడగా ‘ఎన్నిసార్లు తిరిగినా బైక్‌పై ఉన్న ఇసుకనే మీరంతా వెతికారు తప్ప నేను కొట్టేసి తీసుకువస్తున్న బైక్‌ను ఎవరూ పట్టించుకోలేదంటూ’ తుర్రుమంటాడు.
సినిమా చూసే ప్రేక్షకులంతా గొల్లున నవ్వుకుంటారు. కట్ చేసి మన కథనంలోకి వద్దాం... ఈ నిఘా దగా కథనంలో కూడా లారీ, రైలు, జీపు, ఆటో, బైకు ఇలా ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో రేషన్ బియ్యాన్ని తరలించేస్తున్నారు. ఆ సినిమా సీన్‌లో పోలీసులు పసిగట్టలేక బైక్‌ను వదిలేస్తే ఇక్కడ అన్నీ తెలిసి బియ్యాన్ని దొంగచాటుగా వదిలేస్తున్నారు. దీంతో పేదలకు అందాల్సిన బియ్యం పరులపాలవుతున్నాయి.
⇒ తూతూమంత్రంగా రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ
⇒ జిల్లాలు దాటి వెళుతున్న పేదల బియ్యం
⇒ రైళ్లు, లారీలు, ఆటోలు, పార్శిల్, ద్విచక్రవాహనం
⇒ అక్రమ రవాణాకు ఏదీ అనర్హం కాదు
చీరాల : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల పరమవుతున్నాయి. నిత్యం టన్నుల కొద్దీ రేషన్ బియ్యం జిల్లాలు దాటి తరలిపోతున్నా సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. పట్టుకోవల్సిన రెవెన్యూ సిబ్బంది అసలు ఆ వైపే ఆలోచించడం లేదు. అడపాదడపా ఎన్‌ఫోర్‌సమెంటు అధికారులు పట్టుకుంటేనే అరకొరగా దొరుకుతున్నాయి. లేదంటే అక్రమార్కులకు రాచమార్గమే. ఎన్‌ఫోర్స్‌మెంట్ పట్టుకున్న సరుకుకు కూడా కేసులు పెట్టేది అంతంతమాత్రమే.
లారీలు, ఆటోలు, రైళ్లు, పార్శిల్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు ఏదీ అక్రమ రవాణాకు అనర్హం కాదంటూ ఏ మార్గం ద్వారా సులువుగా ఉంటుందో ఆ మార్గంలో తరలించి జేబులు నింపుకుంటున్నా చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారే తప్ప దాడులు చేసిన దాఖలాలేవీ లేవు. దీంతో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం మూడు టన్నులు.. ఆరు కింటాళ్లుగా సాగిపోవడంతో ఈ వ్యాపారంలోకి కొత్తవారు దిగుమతి అవుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో చీరాల రైల్వేస్టేషన్లో విజయవాడ పాసింజర్ రైల్లో తరలిస్తున్న 620 కేజీల రేషన్ బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు.
ఒక వ్యక్తి సమాచారం ఇవ్వడంతో ఆ బియ్యాన్ని అధికారులు రైల్వే పోలీసుల సహకారంతో పట్టుకోవల్సి వచ్చింది. ఈ నెల 21వ తేదీన నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి తరలించేందుకు సిద్ధం చేసుకున్న మూడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని చీరాల ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డీటీ శ్రీనివాసరావు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా పట్టణానికి చెందిన వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకోవడం విశేషం. ఇలా ఉంటే చీరాల నుంచి రోజూ ఆటోల్లో, రైళ్లలో బియ్యాన్ని తరలించడం పరిపాటిగా మారింది.
రెండు చేతులా ఆర్జిస్తున్న వారిని కొంతమంది చూసి కొత్త అక్రమ రవాణా దారులుగా మరికొంతమంది మారుతున్నారు. రేషన్‌డీలర్ల వద్ద కేజీ రూ.10లు చొప్పున కొనుగోలు చేసి గుంటూరు జిల్లా బాపట్ల, లేకుంటే కాకినాడ, నెల్లూరు, చెన్నై తరలించి కిలో రూ.14 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో మండలానికి సుమారు 500 నుంచి 700 క్వింటాళ్ల బియ్యం కేటాయిస్తారు. అందులో ఒక వంతు మాత్రమే పేదలకు అందగా మూడోవంతు అక్రమ వ్యాపారులు, రేషన్ డీలర్లుకు భోజ్యంగా మారుతున్నాయి.
తూతూమంత్రంగా తనిఖీలు ...
ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో ఎంచక్కా బియ్యం రవాణా కావడానికి ప్రధాన కారణం రెవెన్యూ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమేనని పలువురు విమర్శిస్తున్నారు. రవాణాను అరికట్టేందుకు, అక్రమార్కులను అడ్డుకునేందుకు సంబంధితాధికారుల్లో చిత్తశుద్ధి కొరవడడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న పనితోనే సరిపోతుందని, ఇంకా ఇవన్నీ ఎక్కడ చూడగలమంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రేషన్ డీలర్లుతోపాటు అక్రమవ్యాపారులు ప్రతినెలా రెవెన్యూ, ఎన్స్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పెద్ద మొత్తంలో ముట్టచెబుతున్నారు. ఒక్కో రేషన్ షాపు డీలరు నెలకు *.1200లు రెవెన్యూ అదికారులకు మామూలు చెల్లించాలి. వాటిని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌తో సహ నలుగురు పంచుకుంటారు. ఒక్కొక్క నియోజకవర్గం నుండి రేషన్ డీలర్ నుండి రెవెన్యూ అధికారులకు లక్షన్నర నుండి రెండు లక్షల రూపాయల వరకు అందుతున్నట్లు సమాచారం.
దీంతోనే వారు రేషన్ డీలర్లుపై గాని, అక్రమ వ్యాపారులపై చర్యలు తీసుకోరనేది అర్ధమవుతుంది. ఎప్పుడైనా దాడులు చేసి పట్టుకుంటే 6ఏ కేసులు మినహా పీడీయాక్టులు పెట్టే పరిస్థితులు లేకపోవడంతో అక్రమార్కులకు పాడికుండగా మారిన వ్యాపారాన్ని వదిలిపెట్టడంలేదు. 6ఏ కేసులు వలన ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో డీలర్లు, అక్రమవ్యాపారులు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉంటున్నారు. దీంతో పేదల బియ్యం జిల్లాలు దాటి చివరకు పెద్దల పరం అవుతున్నాయి.