illegal transportation
-
అర్ధరాత్రి పీడీయస్ బియ్యం అక్రమ రవాణా
సాక్షి, నల్లజర్ల: పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పిడియస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం ఆవపాడు లిక్కర్ ఫ్యాక్టరీకి రేషన్ బియ్యం వస్తుందనే పక్కా ముందస్తు సమాచారంతో అర్ధరాత్రి విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పదహారు లారీల్లో రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.వీటి విలువ సుమారు కోటి రూపాయలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించారు. -
రూ.25.86 లక్షల జరిమానా
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం) : నిబంధనలకు విరుద్ధంగా పట్టు వస్త్రాలను తరలిస్తున్న కోల్‌కతాకు చెందిన ఆషిఫ్ పటోలా ఆర్ట్స్ అనే వ్యాపారి నుంచి రూ. 25,86,112 లను పన్ను, జరిమానా, ఫైన్ల కింద కట్టించినట్లు నరసన్నపేట డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కింజరాపు వెంకటరమణ తెలిపారు. వాహన తనిఖీల్లో ఇంత పెద్ద మొత్తంలో ఒక వ్యాపారి నుంచి ఫైన్ కట్టించడం చాలా అరుదన్నారు. ఈ కేసును సవాల్‌గా తీసుకుని విచారించి చివరికి వ్యాపారి నుంచి ఈ మొత్తాన్ని కట్టించి ప్రభుత్వ ఆదాయం పెంచినట్లు తెలిపారు. బుధవారం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. నరసన్నపేటకు చెందిన జీఎస్టీఓ ఎన్.తిరుపతి బాబు, ఇన్స్పెక్టర్ బి.ఉపేంద్రరావు తదితరులు మడపాం టోల్ గేట్ వద్ద ఈ నెల 20వ తేదీ సాయంత్రం తనిఖీలు చేపట్టారన్నారు. ఆ సమయంలో కొల్కతా నుంచి విజయవాడకు వెళ్తున్న క్వాలీస్ వాహనంపై అనుమానంతో నిలిపి తనిఖీలు చేస్తుండగా ఎగ్జిబిషన్ సేల్స్ కోసం తరలిస్తున్న పట్టు వస్త్రాలను గమనించారన్నారు. పూర్తిగా ఆరా తీయగా అవి నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్లు గుర్తించారన్నారు. సుమారు రెండు కోట్లు విలువైన 1080 పట్టు చీరలు రూ.12.50 లక్షలకు బిల్లులు చూపించి రవాణా చేసినట్లు తెలిపారు. వారం రోజుల పాటు ఈ కేసుపై వాదనలు నిర్వహించిన అనంతరం అసిస్టెంట్ కమిషనర్ సి.హెచ్.కొండమ్మ ఆదేశాల మేరకు కోలకతాలో ఉన్న వస్త్ర వ్యాపారిని రప్పించామన్నారు. ఆయన వద్ద నుంచి రూ. 25,86,112లను కట్టించినట్లు తెలిపారు. -
ఇంటి దొంగలు
మార్టూరు: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి ఆకలి దప్పులు తీర్చడం కోసం ఏళ్ల నుంచి ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా పప్పు, బియ్యం, చింతపండు వంటి కనీస అవసరాలు సరఫరా చేస్తున్నాయి. గతంలో తొమ్మిది రకాల వస్తువులు పంపిణీ చేసే వారు. ప్రస్తుత ప్రభుత్వం రెండు మూడు రకాల వస్తువులు పంపిణీ చేస్తూ వాటిని కూడా కార్పొరేట్ సంస్థల చేతిలో పెట్టే దిశగా ప్రయత్నిస్తోంది. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం లోపభూయిష్టంగా మారి అక్రమార్కులకు లాభాల పంట పండిస్తోంది. మండల కేంద్రం మార్టూరు కూరగాయల మార్కెట్ ఆవరణలో నిత్యావసరాల గిడ్డంగి ఉంది. దీన్ని మండల లెవెల్ స్టాక్ పాయింట్ (ఎంఎల్ఎస్)..అని అంటారు. ఇక్కడి నుంచి మార్టూరు, యద్దనపూడి, బల్లికురవ మండలాల్లోని 107 రేషన్ షాపులకు నెలకు 10 వేల బస్తాలు (50 కేజీల బియ్యం) సరఫరా చేస్తారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం పూర్తిస్థాయిలో రేషన్ షాపులకు సరఫరా కావడం లేదు. ఇదే విషయం విజిలెన్స్ అధికారుల తనిఖీలో వెల్లడైంది. 107 రేషన్ షాపులకు సంబంధించి సగటున నెలకు 2 వేల బియ్యం బస్తాలు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి నేరుగా అద్దంకిలోని రైస్ మిల్లులకు చేరుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ లావాదేవీల్లో రేషన్ షాపు నిర్వాహకుడికి కేజీ బియ్యం 8 రూపాయల చొప్పున 50 కేజీల బస్తాకు 400 రూపాయలు గిట్టుబాటు అవుతున్నట్లు సమాచారం. గిడ్డంగి నిర్వాహకులకు కేజీకి రెండు రూపాయలుపోగా 5 రూపాయలు లాభం కలుపుకుని అక్రమ వ్యాపారులు కేజీ 15 రూపాయల చొప్పున మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఇక్కడ జరిగే మాయాజాలం తెలిసి అధికారుల కళ్లు బైర్లుగమ్మాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన కొద్దిమంది మిల్లర్లకు ధాన్యం సరఫరా చేస్తారు. ఆ మిల్లర్లే రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేస్తారు. ఈ మిల్లులనే క్లస్టర్ మిల్ రైస్ (సీఎంఆర్) అని పిలుస్తారు. ఈ సీఎంఆర్‌లకు ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యాన్ని మిల్లర్లు బహిరంగ మార్కెట్లో విక్రయించి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన రేషన్ బియాన్ని మరుసటి నెలలో అదే ఎంఎల్ఎస్ పాయింట్‌కు సరఫరా చేయడం విశేషం. ఈ అక్రమ వ్యాపార లావాదేవీలతో నెలకు రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు సమాచారం. వ్యాపారుల సిండికేట్ అద్దంకిలోని కొందరు వ్యాపారులు సిండికేట్‌గా మారి అక్రమ వ్యాపారం నిర్వహిస్తుండగా అద్దంకి అధికార పార్టీ నాయకుడి అనుచరుడి ఒకరికి ప్రభుత్వం అండకోసం కొంత వాటా ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత మంగళవారం విజిలెన్స్ ఇన్స్పెక్టర్ అజయ్‌కుమార్ తన సిబ్బందితో రెండి బృందాలుగా ఏర్పడి నిర్వహించిన దాడిలో వలపర్ల సమీపంలోని 60 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడగా అద్దంకి ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు మార్టూరు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం అద్దంకిలోని ఓ రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో స్థానిక ఎంఎల్ఎస్ పాయింట్‌ను అదే రోజు తనిఖీ చేసిన అధికారులు రేషన్ బస్తాల నిల్వలు సక్రమంగానే ఉండటంతో ఖంగుతిన్నారు. అనుమానం వచ్చిన అధికారులు ముందు రోజు అంటే గత సోమవారం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఏయే రేషన్ షాపులకు బియ్యం పంపిణీ నిర్వహించారో ఆ రూట్ మ్యాప్ తీసుకుని వలపర్ల, మార్టూరులోని రేషన్ దుకాణాలతో తనిఖీలు నిర్వహించగా అసలు విషయం బయట పడింది. ఒక్కో రేషన్ షాపులో 15 నుంచి 20 బస్తాల బియ్యం తరగతులను గుర్తించిన అధికారులు ఆ బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి నేరుగా మిల్లర్లకు చేరుతున్నట్లు నిర్ధారించుకుని సదరు మిల్లుపై కూడా దాడులు నిర్వహించిన అధికారులు 30 బస్తాల అక్రమ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ వ్యాపారానికి జిల్లా పౌర సరఫరాల శాఖ ముఖ్య ఉద్యోగి ఒకరి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి మార్టూరులో నెలకు వేలాది బస్తాల అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం నిర్వహించే ఓ మహిళ నుంచి నెలకు 10 వేల రూపాయల చొప్పున మామూళ్లు తీసుకుంటున్నట్లు సంబంధిత శాఖలోనే గుసగుసలు వినిపిస్తుండటం విశేషం. విజిలెన్స్ శాఖ జిల్లా అధికారిగా ఏఎస్పీ రజని పదవీ బాధ్యతలు చేపట్టాక అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్న మైనింగ్ వ్యాపారులు, బియ్యం వ్యాపారులపై విస్తృత దాడులు నిర్వహించడంతో ప్రస్తుతం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు సమాచారం. మరింత సమర్థంగా దాడుల నిర్వహించి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
ఉంగుటూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బుధవారం ఉంగుటూరు టోల్‌గేటు వద్ద అధికారులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కైకరం గ్రామానికి చెందిన కామన శ్రీనివాస్, విజయ త్రిమూర్తులు మినీ వ్యాన్‌లో 42 బస్తాల రేషన్ బియ్యాన్ని తాడేపల్లిగూడెం తరలిస్తుండగా ఉంగుటూరు వద్ద పట్టుకున్నట్టు చేబ్రోలు ఎస్సై తాడి నాగ వెంకటరాజు తెలిపారు. బియ్యాన్ని ఉంగుటూరు సివిల్ సప్లయీస్ డీటీ జయశ్రీకి అప్పగించారు. కామన శ్రీనివాస్ పరారీలో ఉండగా విజయ త్రిమూర్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామన్నారు. -
రేషన్ బియ్యం పక్కదారి
సాక్షి, తిరుపతి: పేద, మధ్యతరగతి వారికి ఇస్తున్న రేషన్ బియ్యం మిల్లర్లకు భోజ్యం గా మారుతోంది. ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజా పంపిణీ (పీడీఎఫ్) బియ్యంలో సుమారు 45 శాతం రీసైక్లింగ్ జరుగుతోంది. రేషన్ డీలర్ల నుంచి పెద్ద మొత్తంలో సేకరించి మిల్లుల్లో సన్నగా పట్టిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అనధికారికంగా గోదాములు ఏర్పాటు చేసుకుని రాత్రికి రాత్రే బ్రాండెడ్ సంచుల్లో నింపుతున్నారు. రిటైల్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. జిల్లాలో కార్డు దారుల కోసం ప్రతినెలా 18,708 టన్నుల బియ్యం దిగుమతి అవుతున్నాయి. ఇందులో 7.5 వేల టన్నులకుపైగా బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లా సరిహద్దులో అటు తమిళనాడు... ఇటు కర్ణాటక రాష్ట్రాలు ఉండటంతో ఆ ప్రాంతంలో ఉన్న మిల్లర్లతో దళారులు ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని తెలుస్తోంది. 25 శాతం మంది బాగోలేవనే కారణంతో రేషన్ బియ్యం తీసుకోవడం లేదు. మరో ఏడుశాతం మంది రేషన్ తీసుకులేకపోతున్నారు. 5 శాతం రేషన్ కార్డులు కొందరు డీలర్ల వద్ద ఉన్నాయి. లబ్ధి్దదా రులు రాకపోయినా బియ్యం తీసుకున్నట్లు ఆన్లైన్లో నమోదవుతున్నాయి. అసలు లబ్ధిదారుడికి కార్డు ఉందనే విషయం తెలియని పరిస్థితి. లబ్ధిదారుల బియ్యం రేషన్ దుకాణదారుల వద్దే ఉండిపోతున్నాయి. మరికొందరు బియ్యం వచ్చిన సమయంలో బయోమెట్రిక్‌లో వేలిముద్ర వేసి వచ్చేస్తున్నారు. ఆ బియ్యాన్ని కొందరు డీలర్లు మిల్లర్లకు విక్రయిస్తున్నారు. మరికొందరు లబ్ధిదారులు తెలిసిన వారికి అదే ధరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా 45శాతం బియ్యం మిల్లర్లకు చేరుతున్నాయని అంచనా. అధిక ధరలకు విక్రయం.. రెండు రూపాయల కిలో బియ్యాన్ని కొందరు డీలర్లు రూ.10 చొప్పున మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఆ బియ్యాన్ని శివారు ప్రాంతంలో అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారు. తిరుపతి రైల్యే కాలనీ, ఆటోనగర్, అక్కారంపల్లి, పుత్తూరు, నగరి, కుప్పం, పలమనేరు, చిత్తూరు సమీపంలో అనధికారిక గోదా ములు ఉన్నట్లు సమాచారం. నిల్వచేసిన బియ్యాన్ని మిల్లుల్లో పాలిష్ పట్టి సన్నబియ్యంగా మార్చేస్తున్నారు. రాత్రికి రాత్రే బ్రాండెడ్ సంచుల్లో నింపి రిటైల్ మార్కెట్లకు తరలిస్తున్నారు. అక్కడ కిలో రూ.30, రూ.35 చొప్పున విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. మరికొందరు తమిళనాడు, కర్ణాటకతో పాటు నెల్లూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తరలివెళ్తున్న బియ్యాన్ని అధికారులు దాడులు చేసి పట్టుకున్న ఘటనలూ ఉన్నాయి. తిరుపతిలో ఓ నివాసంలో నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్న సమయంలో రేషన్ బియ్యం బస్తాలు బయటపడినట్లు భోగట్టా. కొన్నిచోట్ల అధికారుల సహకారంతో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. -
నక్షత్ర తాబేళ్ల అక్రమ రవాణా గుట్టురట్టు
-
నక్షత్ర తాబేళ్ల అక్రమ రవాణా గుట్టురట్టు
సాక్షి, విశాఖపట్నం : నక్షత్ర తాబేళ్లను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టు రట్టైంది. ఆదివారం విశాఖ రైల్వేస్టేషన్లో డీఆర్ఐ అధికారులు నిర్వహించిన సోదాల్లో ముఠా నుంచి 1125 నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. తాబేళ్లను విజయవాడ నుంచి ఔరాకు తరలిస్తున్న ముగ్గురు మఠా సభ్యులను అధికారులు అరెస్ట్ చేశారు. తాబేళ్లను బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. -
నిషేధం ఉన్నా లెక్క లేదు
గుంటూరు: పోలీసులు కళ్లుగప్పి జిల్లా నుంచి గుట్కాల రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గుంటూరు నుంచి మినీ లారీ అడుగు భాగాన బస్తాల్ని అమర్చి విశాఖపట్నం తరలిస్తుండగా గత ఏడాది నవంబరు 5న ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వాహనంలో రూ. కోటి విలువ చేస్తే గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ మూమూలే.. గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో గత ఏడాది ఆగస్టులో ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు ఆదేశాల మేరకు ఏకకాలంలో పోలీసులు దాడులు చేసి 1275 గుట్కా బస్తాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవేమీ లెక్క చేయని వ్యాపారులు అధికార పార్టీ నేతల అండదండలతో రాజధాని ప్రాంతంలో యథేచ్ఛగా చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట పట్టణాల నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం అక్రమ రవాణా జరుగుతుందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నీరుగారిన నిషేధం గుట్కా ప్రాణాంతకమన్న ఉద్దేశంతో 2013లో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా ఎక్కడా అమలు కావడం లేదు. గుంటూరు నగర శివారుల్లో ముఖ్యంగా వట్టిచెరుకూరు, వింజనంపాడు, ఏటుకూరు రోడ్లలో అక్రమార్కులు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి పాన్‌మసాలా తయారీ పేరుతో లైసెన్స్‌లు పొందుతున్నారు. వీటి లోపల మాత్రం పొగాకుతో నిషేధిత ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు సమాచారం. చిన్నచిన్న బడ్డీల్లో సైతం అమ్మకాలు జరుగుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకవేళ దాడులకు యత్నిస్తే అధికార పార్టీ నాయకులతో ఒత్తిళ్లు చేయించి వారి వైపు తిరిగి చూడకుండా చేసి రాత్రి వేళల్లో వాహనాల ద్వారా గుట్కా బస్తాల్ని తరలిస్తూ చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. రెట్టింపు ధరలకు విక్రయాలు నిషేధం లేని సమయంలో ఎమ్మార్పీకే విక్రయించేవారు. నేడు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. గుట్కా ప్యాకెట్‌పై ఎమ్మార్పీ రూ.2 ఉంటే రూ. 6కు అమ్ముతున్నారు. గతంలో ఖైనీ ప్యాకెట్ రూ. 5 ఉంటే ప్రస్తుతం రూ 15 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక గ్రామాల్లో విషయానికి వస్తే చెప్పాల్సిన పనిలేదు. ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ అక్రమ రవాణాదారులు కోట్లు గడిస్తున్నారు. మామూళ్ల వసూలు అవాస్తవం జిల్లాలో అనేకసార్లు దాడులు నిర్వహించి ఇప్పటి వరకు దాదాపుగా రూ.6 కోట్ల విలువ చేసే గుట్కాల్ని సీజ్ చేశాం. సమాచారం ఉంటే 9440379755 నంబర్‌కు ఫోన్ చేయాలి. వివరాలను గోప్యంగా వుంచుతాం. నెలవారీ మామూళ్ల మాట అవాస్తవం. – గౌస్ మొహిద్దీన్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ -
చీకటి దందా !
మొరం దందా కొత్త పుంతలు తొక్కుతోంది. కాసులకు మరిగిన మొరం మాఫియా అక్రమ రవాణాకు కొత్తదారులు వెతుకుతోంది. పగటి పూట కాకుండా.. అర్ధరాత్రి వేళల్లో మొరం రవాణాకు తెరలేపారు. చీకటి పడితే చాలు పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : రెవెన్యూ అధికారుల బృందం శుక్రవారం అర్ధరాత్రి మోపాల్ మండలం కంజర్ శివారులో నిర్వహిస్తున్న అనుమతి లేని క్వారీ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. మొరం తరలించేందుకు వచ్చి న తొమ్మిది టిప్పర్లను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అధికారులు తనిఖీలు చేస్తున్న విషయం గమనించిన అక్రమార్కులు మిగిలిన టిప్పర్లను దారి మళ్లించారు. ఈ దందాకు అధికార పార్టీ నేతల ప్రధాన అనుచరుడు సూత్రధా రి అనే విమర్శలు గుప్పుమంటున్నాయి. పలుచోట్ల తవ్వకాలు.. మోపాల్‌తో పాటు, నిజామాబాద్ రూరల్, మాక్లూర్, ఎడపల్లి తదితర మండలాల పరిధిలో కూడా పెద్ద ఎత్తున మొరం అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ జేసీబీలతో భూగర్భాన్ని తొలిచేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే చేపట్టిన తవ్వకాలతో లోతైన గుంతలు ఏర్పడుతున్నాయి. పట్టా, ప్రభుత్వ భూములు తేడాలేకుండా విచ్చలవిడిగా తవ్వకాలను చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం మొరం తవ్వకాలు జరపాలంటే భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. నిర్దేశిత మొత్తంలో సీనరేజీ చెల్లించి మొరాన్ని తరలించాలి. ఇవేవీ పట్టించుకోకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ అక్రమ తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు వాటిళ్లడమే కాకుండా, భూగర్భ గనులశాఖకు వచ్చే ఆదాయానికి గండి పడుతోంది. నిజామాబాద్ నగరం, బోధన్, ఆర్మూర్ తదితర పట్టణాల్లో వాణిజ్య అవసరాలకు మొరం డిమాండ్ అధికంగా ఉంది. ఒక్కో టిప్పరుకు రూ.2,500 నుంచి రూ.నాలుగు వేల వరకు విక్రయిస్తున్నారు. నగరంలో రియల్ వెంచర్లకు, ప్రైవేటు కట్టడాలకు ఈ మొరాన్ని తరలిస్తున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనలే లేవు.. అక్రమ మొరం తవ్వకాలపై ఉక్కు పాదం మోపాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. అడపాదడపా టిప్పర్లను పట్టుకుని నామమాత్ర జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. కానీ మొరం తవ్వుతున్న ప్రదేశాలకు వెళ్లి ఎంత మేరకు తవ్వకాలు జరిగాయి. ఎంత పరిమాణంలో మొరాన్ని తరలించారు.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన జరిమానాలు విధించాల్సి ఉంది. అలాగే కేసులు నమోదు చేసి మొరం తవ్వుతున్న జేసీబీలను, తరలిస్తున్న టిప్పర్లను కోర్టుకు అప్పగిస్తే.. అక్రమ దందాకు చెక్పడే అవకాశాలుంటాయి. అయితే నామమాత్ర జరిమానా విధించి వాహనాన్ని వదిలేయడం వల్ల మళ్లీ యథేచ్ఛగా ఈ అక్రమ దందాకు ఆస్కారం ఏర్పడుతోంది. తొమ్మిది టిప్పర్లు పట్టివేత మోపాల్(నిజామాబాద్ రూరల్): మోపాల్ మండలంలో మొరం అక్రమ దందాపై రెవెన్యూ, పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపారు. కంజర్ గ్రామశివారులో శుక్రవారం అర్ధరాత్రి మాటు వేసి క్వారీ వద్ద తొమ్మిది టిప్పర్లను పట్టుకున్నారు. వీరిని పసిగట్టిన మరో ఐదు టిప్పర్లు తప్పించుకుపోయాయి. అనుమతుల్లేకుండా మొరం రవాణా చేస్తున్న టిప్పర్లను గతంలోనూ పట్టుకున్నప్పటికీ నామమాత్రపు జరిమానాలు విధించడంతో తిరిగి తమ దందాను కొనసాగిస్తున్నారు. ఒకటి, రెండు టిప్పర్లు కాకుండా సుమారు 15 టిప్పర్ల ద్వారా మొరం రవాణా చేస్తుండటంతో అక్కడ జాతర వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా అధికారులు అర్ధరాత్రి దాడులు చేయడం మండలంలో చర్చనీయాంశమైంది. టిప్పర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాడిలో ఆర్ఐ నారాయణ, ఎస్ఐ సతీశ్, సీనియర్ అసిస్టెంట్ సంతోష్, వీఆర్వోలు ఇంతియాజ్, రఫీక్, సంజీవ్, పృథ్వీ, వీఆర్ఏలు ఉన్నారు. -
మట్టి హాంఫట్!
► నీరు–చెట్టు పనుల పేరుతో దోపిడీ ► ప్రతిరోజూ 400 ట్రిప్పులు అమ్మకం ► నాలుగు మాసాలుగా ఇదే తంతు ► చెరువునే చెరబట్టిన తెలుగు తమ్ముళ్లు నీరు–చెట్టు పనులు అధికార పార్టీ నాయకులకు కల్పతరువుగా మారాయి. వర్క్ అలాట్మెంట్ కాకపోయినా ఈ పనుల పేరు చెప్పి చెరువులు, వంకలు, వాగుల్లోని మట్టిని కొల్ల గొడుతున్నారు. ట్రిప్పునకు రూ.400 నుంచి రూ.500 వరకు అమ్ముకుంటూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. కడప చుట్టుపక్కల 4 మాసాలుగా ఈ దందా సాగుతున్నా ఇరిగేషన్ అధికారులుగానీ, రెవెన్యూ అధికారులుగానీ అటువైపు తొంగి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడప కార్పొరేషన్: నీరు–చెట్టు పనులు కొందరికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పనులు చేపట్టే విషయంలో తెలుగు తమ్ముళ్లు ధనార్జనే ధ్యేయంగా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో చివరికి మట్టిని సైతం అమ్ముకుంటున్నారు. నిబంధలనల ప్రకారం నీరు–చెట్టు కింద పూడిపోయిన వంకలు, వాగులు, చెరువుల్లో పూడిక తీత, చెరువు నుంచి పొలాల్లోకి వున్న కాలువలను బాగుచేయడం వంటి పనులు చేయాలి. కానీ అవేవీ జిల్లాలో అమలు కావడం లేదు. వివరాల్లోకి వెళితే.. కడప నగరంలోని పుట్లపల్లి చెరువు కింద వంద ఎకరాల ఆయకట్టు ఉంది. పంటలు కోసిన తర్వాత ఈ మట్టిని పొలాల్లోకి తోలి భూసారాన్ని పెంచితే రైతులకు ఉపయోగముంటుంది. అలాకాని పక్షంలో చెరువు కట్టను బలోపేతం చేసేందుకు ఈ మట్టిని వినియోగించాలి. అంతిమంగా ఈ పనుల వల్ల రైతులకు లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ పథకం అమలు మాత్రం తమ్ముళ్లకు ఆర్జించిపెట్టడమే పరమావధిగా ముందుకు సాగుతోంది. పుట్లపల్లి చెరువులో సాగుతున్న నీరు–చెట్టు పనులే ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో నాలుగు మాసాలుగా ఈ మట్టి దందా సాగుతోంది. కేవలం రూ.10 లక్షల వర్క్‌ను ఇలా నెలల తరబడి చేస్తూ మట్టిని కొల్లగొడుతున్నట్లు సమచారం. రాత్రి పగలు అనే తేడా లేకుండా రోజుకు దాదాపు 400 ట్రిప్పుల వరకూ తోలుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన 4నెలలకు రూ.2కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు తెలుస్తోంది. వర్క్ అలాట్మెంట్ అయిన చోట కాకుండా చెరువు మధ్యలోని మట్టిని జేసీబీతో తోడుతూ ప్రయివేటు సంస్థలకు, ఇటుక బట్టీలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అసలు కంటే కొసరే ఎక్కువ: అసలు కంటే కొసరే ఎక్కువన్నట్లు ఇక్కడ పని మంజూరైంది రూ.10లక్షలైతే, మట్టిని అమ్ముకోవడం ద్వారా ఇరవై రెట్లు అధికంగా ఆర్జించినట్లు సమాచారం. చెరువులో, కాలువల్లో ఉన్న నల్లమట్టిని తీయాల్సి ఉండగా, సారవంతమైన ఎర్రమట్టిని తీస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రూ.10 లక్షలతో చేపట్టిన ఈ పనులు నాలుగునెలల పాటు సుదీర్ఘ కాలం సాగుతుండటంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజు సుమారు రూ.1.60లక్షల వరకూ అక్రమంగా ఆర్జిస్తున్నారు. దీని వెనుక అధికారపార్టీ ముఖ్యనేత ఉండటం వల్లే యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్ శాఖలోని ఈఈ స్థాయి అధికారి దీనికి పూర్తి అండదండలు అందిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొత్త కలెక్టరేట్‌కు ఈ చెరువు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఈ దందాను అడ్డుకోలేని స్థితిలో ఉండటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీరు–చెట్టు పేరు చెప్పి చెరువులో ఇష్టానుసారం గోతు లు తవ్వుతున్నారు. భవిష్యత్‌లో ఈ గోతు లు పెను అనర్థాలకు దారితీసే అస్కారం ఉందని పుట్లంపల్లె గ్రామస్తులు సైతం వాపోతున్నారు. గతంలో కూడా గుంతలున్నాయనే విషయం తెలియక ఈత సరదాతో పసిప్రాణాలు గాల్లో కలిసిన దాఖలాలున్నాయి. సమాజానికి ఎటుచూసినా అనర్థదాయకంగా మారనున్న ఈ వ్యవహారాన్ని తక్షణమే కట్టడి చేయాల్సి ఉంది. పరిశీలించి చర్యలు తీసుకుంటాం: నీరు–చెట్టు పనులకు వర్క్ మంజూరైంది. మొత్తం రూ.5లక్షలు విలువైన చేయాల్సి ఉంది. అయితే చెరువులోని మట్టిని అమ్ముకుంటున్న విషయం నా దృష్టికి రాలేదు. వెంటనే పరిశీలిస్తాం. మట్టి అమ్ముకున్నట్లు తేలితే కఠినచర్యలు తీసుకుంటాం. మురళీకృష్ణ, డీఈ, మైనర్ ఇరిగేషన్‌శాఖ కడప. -
పులి చర్మంతో దొరికిన థాయ్‌లాండ్ పూజారి
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని వివాదాస్పద పులుల గుడి నుంచి పులి చర్మంతో పారిపోతున్న పూజారిని అధికారులు పట్టుకున్నారు. పూజారుల నివాస స్థలాల్లో జరిపిన తనిఖీల్లోనూ బతికున్న సింహం, ఇతర వన్యప్రాణులనుతో పాటు 20 పాత్రల్లో భద్రపరిచిన పులుల అవయవాలు, కళేబరాలను గుర్తించారు. గుడి నుంచి చైనాకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక్కడి రిఫ్రిజిరేటర్లో బుధవారం అధికారులు 40 పులిపిల్లల కళేబరాలను కనుగొన్న సంగతి తెలిసిందే. -
ఏడు ఇసుక ట్రాక్టర్ల సీజ్
వర్ధన్నపేట టౌన్ (వరంగల్ జిల్లా) : వర్ధన్నపేట మండలంలోని ఆకేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సోమవారం పట్టుకున్నారు. బంతిని గ్రామం సమీపంలో ట్రాక్టర్లను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక దుమారం
ఉచిత ఇసుక విధానం అధికార టీడీపీకి వరమైంది. సామాన్య జనానికి భారమైంది. అధికారులకు తలనొప్పిగా తయారైంది. రీచ్‌ల వద్ద పాగావేసి అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. వారి కనుసన్నల్లోనే ఇసుక తవ్వకాలు జరగాలనే రూలును అనధికారికంగా అమలు చేస్తున్నారు. అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా వారి అక్రమాలు ఆగడం లేదు. మరోపక్క ఉచిత ఇసుక కాస్తా సామాన్యులకు చేరేసరికి మరింత ‘ప్రియ‘మైపోయింది. ఎచ్చెర్ల: ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటలో జనానికి కంటిమీద కునుకులేదు. చీకటిపడితే ట్రాక్టర్ల హోరు. ఇసుక రవాణాతో గ్రామం మోతెక్కిపోతోంది. ఈ గ్రామానికి అనుకొని ఉన్న బలగ రీచ్, ఆమదలవలస సమీపంలోని గోపీనగరం ఇలా ఈ మూడు ప్రాంతాల నుంచి అక్రమ వ్యాపారం సాగుతోంది. అన్ని రీచ్‌లూ అనధికారికమే.. 36 మంది ట్రాక్టర్ యజమానులు సిండికేట్‌గా మారి ఈ అక్రమ రవాణాకు నేతృత్వం వహిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఇందుకు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. ఇసుక ఉచితం లేని సమయంలో ట్రాక్టర్ నుంచి రూ. 10 వేలు చొప్పున నెలవారీ వసూలు చేసేవారు. ఇవి పోలీసు సర్కిల్ స్థాయి అధికారితోపాటు జిల్లా అధికార పార్టీ నాయకుడికి వెళ్లేవి. ప్రస్తుతం తమ్మినాయుడుపేట నుంచి రోజూ రాత్రి 12 నుంచి 4 వరకు రవాణా సాగుతోంది. సమీప ప్రాంతాల్లో, తోటల్లో రాశులుగా వేస్తున్నారు. విశాఖపట్నం దీనిని తరలించనున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోకుండా అధికార పార్టీ నాయకులు చూసుకుంటున్నారని సమాచారం. అనధికార క్వారీల నుంచి పొక్లెయినరుతో ఇష్టానుసారంగా ఇసుక తవ్వుతున్నారు. మరో పక్క ఇసుక రీచ్‌కు వెళ్లేందుకు నది గట్లు సైతం తవ్వేసి రోడ్డు మార్గం చేసేశారు. రీచ్‌కు జాతీయ రహదారి నుంచి కిలోమీటర్ లోపలకు వెళ్లాలి. ఇసుకలో నుంచి ట్రాక్టర్లు తప్ప కార్లు, బైక్‌లు, జీపులు వెళ్లే పరిస్థితి లేదు. శ్రీకాకుళం మున్సిపాలిటీ బలగ ప్రాంతంలో ఈ అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. జాతీయ రహదారికి అనుకుని అనువైన ప్రదేశాల్లో పోగులు వేసి తర్వాత తరలింపునకు రంగం సిద్ధం చేస్తున్నారు. అర్థరాత్రి వేళ అధికారులు రీచ్‌కు వెళ్లే ప్రయత్నం చేయటం లేదు. ట్రాక్టర్లు వివరాలను అధికారులు సేకరించినా అధికార పార్టీ నాయకులను కాదని చర్యలు తీసుకునే ధైర్యం చేయటం లేదు. వీరికీ వాటాలు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత అక్రమ రవాణాతో స్థానికులకు కంటిమీద కునుకుండటం లేదు. ఈ ధ్వని కాలుష్యానికి చెవులు చిల్లులు పడుతున్నాయని వీరంతా వాపోతున్నారు. నిలదీస్తే బెదిరించే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. దాంతో మాట్లాడలేకపోతున్నారు. -
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత
ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా) : భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటుతున్నా పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులు యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా చేస్తుండటంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఇసుక రవాణాను అడ్డుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం హనుమగుత్తిలో ఆదివారం చోటుచేసుకుంది. ఇసుక ర్యాంపు వద్ద నుంచి పరిమితులకు మించి ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించిన స్థానికులు ఆదివారం ఇసుక తరలిస్తున్నవారిని నిలదీశారు. దీంతో ఆగ్రహించిన అధికార పార్టీ నాయకులు ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సురేష్‌ను రంగంలోకి దించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆయన స్థానికులను బెదిరింపులకు గురి చేశారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు డాక్టర్ సుధీర్ రెడ్డి భూగర్భజలాలు అడుగంటుతున్నాయని ఆయనతో చెప్పడం ప్రారంభించారు. ఒక స్థాయిలో వీరి మధ్య వాదన కాస్తా తోపులాటగా మారి ఉద్రిక్తతకు దారితీసింది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను నచ్చజెప్పి సోమవారం రెవెన్యూ అధికారుల సాయంతో హద్దులు నిర్ణయిస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
ఇసుక తరలిస్తున్న 3 టిప్పర్లు సీజ్
బోధన్ (నిజామాబాద్ జిల్లా) : అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. బోధన్ మండలం కొప్పర్తి నుంచి నిజామాబాద్‌కు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సీఐ వెంకన్నకు సమాచారం అందింది. వెంటనే స్పందించి ఆయన టిప్పర్లను పట్టుకుని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎర్రచందనం అక్రమ రవాణా: ఐదుగురి అరెస్ట్
చంద్రగిరి (చిత్తూరు జిల్లా) : ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని చంద్రగిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక వాహనంతోపాటు 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తిరుపతి వెస్ట్ డీఎస్పీ వెంకటనారాయణ చెప్పారు. వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను తిరుపతి కోర్టుకు తరలించారు. వీరిపై గతంలోనూ ఎర్రచందనం అక్రమరవాణా కేసులున్నాయని తెలిపారు. -
ఇసుక తరలిస్తున్న 19 ట్రాక్టర్ల పట్టివేత
మంచిర్యాల (ఆదిలాబాద్ జిల్లా) : మంచిర్యాల మండలంలోని గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 19 ట్రాక్టర్లను పోలీసులు గురువారం పట్టుకున్నారు. పోలీసులు రావడం గమనించి కొంతమంది డ్రైవర్లు ట్రాక్టర్లను వదిలి పరారయ్యారు. ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంచిర్యాల పట్టణ సీఐ సుధాకర్ తెలిపారు. -
15 మంది తమిళ కూలీల అరెస్ట్
-
15 మంది తమిళ కూలీల అరెస్ట్
సుండుపల్లి (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా సుండుపల్లి సమీపంలోని కృష్ణారెడ్డి చెరువు వద్ద శనివారం 20 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 15 మంది తమిళ కూలీలను సుండుపల్లి ఎస్ఐ మధుసూదనరెడ్డి అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ సిబ్బందితో దాడి చేసి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 15మందిని అరెస్ట్ చేసారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ.11.20 లక్షలు ఉంటుందని ఎస్ఐ చెప్పారు. తమిళనాడులోని వేలూరుకు చెందిన తలారి విజయకుమార్ తమ నాయకుడని, ఆయన ఆదేశం మేరకే ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నామని కూలీలు చెప్పినట్లు ఎస్ఐ మీడియాకు వివరించారు. కూలీలను ప్రత్యేక బస్సులో రాయచోటి కోర్టుకు తరలించారు. -
13 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
దర్శి (ప్రకాశం జిల్లా) : అక్రమంగా తరలిస్తున్న 13 ఇసుక ట్రాక్టర్లను దర్శి పోలీసులు సీజ్ చేశారు. వీరాయపాలెం వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న ఎస్ఐ సుబ్బారావు సిబ్బందితో కలసి సోమవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. 13 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
34 లారీల ఇసుక పట్టివేత
ఎల్‌ఎన్‌పేట (శ్రీకాకుళం జిల్లా) : ఒడిశాలోని కాశీనగర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 34 ఇసుక లారీలను పోలీసులు శ్రీకాకుళం జిల్లా హిరమందాలం వద్ద మంగళవారం పట్టుకున్నారు. స్పెషల్ బ్రాంచి డీఎస్పీ టి.మోహన్‌రావు లారీలను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు. -
4 ఇసుక లారీలు సీజ్
గోరంట్ల (అనంతపురం) : అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలను పోలీసులు సీజ్ చేశారు. అనంతపురం జిల్లా గోరంట్లలో పోలీసులు శుక్రవారం సాయంత్రం ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా వైఎస్సార్ జిల్లా నుంచి బెంగళూరుకు తరలిస్తున్న ఈ లారీలను పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు లారీ నిర్వాహకులపై ఇసుక అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. -
అక్రమంగా మద్యంబాటిళ్ల తరలింపు
గుమ్మలక్ష్మీపురం (విజయనగరం) : అక్రమంగా ఏజెన్సీ ప్రాంతాలకు తరలిస్తున్న 700 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. కురుపం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు ఆటోలో మద్యం బాటిళ్లు తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు మాటువేసి వారిని పట్టుకున్నారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని జంక్షన్ వద్ద మంగళవారం జరిగింది. ఆటోలో ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారులో టేకు అక్రమ రవాణా
బెల్లంపల్లి (ఆదిలాబాద్) : కారులో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం క్రాస్ రోడ్డు వద్ద అటవీ శాఖ అధికారులు మంగళవారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు. కారుతోపాటు అందులోని 12 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ జగదీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాసిపేట్ మండలం నుంచి మంచిర్యాలకు తరలిస్తున్నట్లుగా వెల్లడైంది. -
అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
ఖానాపూర్ (ఆదిలాబాద్ జిల్లా) : అక్రమంగా తరలిస్తున్న రూ.30 వేల విలువ చేసే కలపను అటవీ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జల్లా ఖానాపూర్ మండలం ఇక్బాల్‌పూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... అక్రమంగా ఒక వాహనంలో కలప దుంగలను తరలిస్తున్నట్లు అటవీ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు తనిఖీలు నిర్వహించి వాహనాన్ని పట్టుకున్నారు. కాగా నిందితులు పరారైనట్లు అటవీ అధికారులు తెలిపారు. కలపను స్వాధీనం చేసుకొని, వాహనాన్ని సీజ్ చేశారు. -
పట్టపగలే మొరం దోపిడీ..!
రైల్వే లైన్ పేరిట దోచుకున్నారు.. * అనుమతులపై అధికారులు తలోమాట * రూ.8 కోట్ల మొరం తీశారని హైకోర్టులో ‘పిల్’ * ఎంసీ, జీవీఆర్, ఆర్ఎన్ఆర్ సంస్థలకు నోటీసులు * కలెక్టర్, ఇరిగేషన్ ఎస్ఈ తదితరులకు కూడా జారీ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పెద్దపల్లి-నిజామాబాద్ బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా ఆర్మూరు ప్రాంతంలో జరుగుతున్న పనులు వివాదాస్పదంగా మారాయి. ఆర్మూరు-నిజామాబాద్‌ల మధ్యన సాగుతున్న ఈ రైల్వేలైన్ పనుల కోసం నిబంధనలకు విరుద్ధంగా రాంచంద్రపల్లి సింగసముద్రం, ధర్పల్లి మండలం లోలం చెరువుల నుంచి లక్షలాది క్యూబిక్ మీటర్ల మొరం, మట్టి అక్రమంగా తవ్విన వ్యవహారం ఇప్పుడు కోర్టు చెంతకు చేరింది. సుమారు రూ. 8 కోట్ల విలువ చేసే 3.50 లక్షల క్యూబిక్ మీటర్ల మొరం అక్రమంగా తీశారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. రైల్వేలైన్ నిర్మాణ పనులు దక్కించుకున్న రేవూరు నారాయణ రెడ్డి అండ్ సన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్, జీవీఆర్ కన్స్ట్రక్షన్, మిలీనియం కన్స్ట్రక్షన్ల జాయింట్ వెంచర్ కాంట్రాక్టు సంస్థలతో పాటు జిల్లా కలెక్టర్, నీటిపారుదలశాఖ ఎస్ఈ, నిజామాబాద్ ఈఈ, నిజామాబాద్ ఆర్డీవో సహా 14 మందిని బాధ్యులను చేస్తూ హైకోర్టు తాత్కాలిక గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్లు ఇటీవల నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 7న కౌంటర్ దాఖలు చేసేందుకు ఆధారాలతో కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు నీటిపారుదలశాఖను ఆదేశించగా... నిబంధనలకు విరుద్ధంగా చెరువుల నుంచి అక్రమ మొరం తవ్వకాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పథకం ప్రకారం తవ్వకాలు... పెద్దపల్లి-నిజామాబాద్ బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు-నిజామాబాద్ లైను పనుల కోసం అర్హత కలిగిన కాంట్రాక్టు సంస్థల ద్వారా రూ.43 కోట్లతో పనులు నిర్వహించేందుకు టెండర్లు నిర్వహించారు. వరంగల్ జిల్లాకు చెందిన రేవూరి నారాయణ రెడ్డి అండ్ సన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్, మిలీనియం కన్స్ట్రక్షన్స్, జీవీఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థలు జాయింట్ వెంచర్‌గా టెండర్ల ప్రక్రియ ద్వారా రూ. 50 కోట్లకు దక్కించుకున్నాయి. ఒప్పందంలో ైరె ల్వే లైన్ మట్టికట్టల కోసం మొత్తం 16.15 లక్షల క్యూబిక్ మీటర్ల మొరం అవసరమని అంచనా వేసిన రైల్వేశాఖ.. కాంట్రాక్టర్లు ఆ మొరం కొనుగోలు చేసేందుకు క్యూబిక్ మీటర్‌కు రూ.164.84 చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మేరకు సదరు కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వం నుంచి కానీ, పట్టాదారుల నుంచి కానీ కొనుగోలు చేయాల్సి ఉండగా... ఆర్మూరు-నిజామాబాద్ ప్రధానరహదారిని ఆనుకొని ఉన్న మాక్లూరు మండలం రాంచంద్రపల్లిలోని సిం గసముద్రం, ధర్పల్లి మండలం లోలం చెరువులపై క న్నేశాయి. పథకం ప్రకారం రాంచంద్రపల్లి గ్రామాభివృద్ధి కమిటీ, సర్పంచ్ల ద్వారా అనుమతి ఇవ్వాలంటూ రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు లేఖలు ఇప్పించారు. అప్పటికే కాంట్రాక్టు సంస్థలు చెరువుల్లో మొరం తవ్వకాలు ప్రారంభించాయి. అం తకు ముందే (జూన్ 27న) రాంచంద్రాపూర్ చెరువులో నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ జి.గంగారాం ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలో నిర్వహించిన పంచనామా ప్రకారం సింగసముద్రం చెరువులో మొరం తవ్వకాలకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని తేల్చారు. ఈ కాపీలను నీటిపారుదలశాఖ ఈఈ, ఆర్మూరు డిప్యూటీ ఈఈ, నిజామాబాద్ ఆర్డీవో, మాక్లూరు ఎస్ఐ, తహసీల్దార్లకు ఇచ్చినా.. అక్రమ మొరం తవ్వకాలను నియంత్రించలేకపోయా రు. ఈ నివేదికలను పక్కనబెట్టి సింగసముద్రం, లోలం చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా.. ఇష్టారాజ్యంగా సాగిన ఈ తవ్వకాలపై పి. నరేందర్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ‘పిల్’ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ఉల్లంఘన అభివృద్ధి పథకం పేరుతో కాంట్రాక్టు సంస్థలు సాగించిన డే లైట్ రాబరీ (పట్టపగలు దోపిడీ) ‘పిల్’తో వెలుగుచూడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. సింగసముద్రం, లోలం చెరువుల్లో అనుమతులు పేరిట ఆ చెరువులతో పాటు ఆర్మూరు-నిజామాబాద్ రహదారి పక్కన కనిపించిన చోట మొరం తవ్వకాలను సాగించిన కాట్రాక్టర్లు రూ.8 కోట్ల విలువ చేసే మొరంను వినియోగించినట్లు అంచనా. చెరువుల్లో నిజంగానే అనుమతి ఇచ్చినా... చెరువు కట్ట 10 మీటర్ల ఎత్తుంటే 100 మీటర్ల దూరంలో స్లూయిస్ (తూములు) ఎత్తుకే మొరం తీయాలి. చెరువు కట్ట నుంచి 300 మీటర్ల దూరంలో కేవలం 2 మీటర్ల లోతు వరకే తీయాలన్న నిబంధనలను తుంగలో తొక్కి కాంట్రాక్టు సంస్థ నిర్వాహకులు చెరువు కట్టకు సమీపంలో 2 మీటర్ల కంటే అధికంగా మట్టి తవ్వి తరలించారు. మొరం తీసే క్రమంలో ఏ నష్టం జరిగినా వారే బాధ్యులు కాగా, ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్టీఎల్)లోనే ఉండాలి. సింగసముద్రం చెరువులో ఏఈ గంగారాం పర్యవేక్షణలోనే మొరం తవ్వకాలు జరగాలి. కాని ఇవేమీ పట్టని కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా మొరం తీసి చెరువుల రూపురేఖలనే మార్చేశారు. ఇదిలా ఉంటే వరద కాల్వ మొరంను కూడ ప్రభుత్వం క్యూబిక్ మీటర్‌కు రూ.54.50 చొప్పున విక్రయిస్తోంది. సీనరేజ్ చార్జ్ కలిపితే క్యూబిక్ మీటర్‌కు రూ.76.50లు పడుతుంది. ఇదే లెక్కన చిన్ననీటి వనరుల నుంచి మొరం తీసే కాంట్రాక్టు సంస్థల నుంచి ఎందుకు వసూలు చేయకూడదన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. అన్ని స్థాయిల్లో అధికారులు కాంట్రాక్టు సంస్థల నిర్వాహకులతో జత కట్టడంతో చెరువులు, గుట్టలు, ప్రభుత్వభూముల్లో నుంచి మట్టి తీస్తూ.. క్యూబిక్ మీటర్‌కు రూ.164.84 చొప్పున కాంట్రాక్టర్లు జేబులో వేసుకుంటున్నారన్న చర్చ బహిరంగంగా సాగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం రంగంలోకి దిగి అక్రమంగా తవ్విన మట్టికి లెక్కలు కడితే... సుమారు రూ.8 కోట్ల మేరకు సర్కారు ఖజానాకు చేరుతాయంటున్నారు. -
గంజాయి తరలిస్తున్న మహిళలు అరెస్ట్
జి.మాడుగుల : విశాఖ జిల్లాలో 60 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నలుగురు మహిళలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. జి.మాడుగుల మండలం ఉరుము జంక్షన్ వద్ద మంగళవారం ఉదయం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ జీపులో బ్యాగుల్లో 60 కిలోల గంజాయి ఉంచి రవాణా చేస్తున్నట్లు వెలుగు చూసింది. జీపులో ఉన్న చిత్తూరు జిల్లా మునకల చెరువు గ్రామానికి చెందిన నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో ఆవుల మణిరత్నమ్మ, ఆవుల ఈశ్వరమ్మ, ఆవుల నారాయణమ్మ, నల్లావుల సుగుణ ఉన్నారు. విశాఖ జిల్లా చింతపల్లి నుంచి పాడేరు మీదుగా చిత్తూరు జిల్లాకు గంజాయిని తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. -
ఎర్రచందనం అక్రమ రవాణా : ఇద్దరు అరెస్ట్
కర్నూలు : ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు కర్నూలు జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. గురువారం అర్ధరాత్రి నంద్యాల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా చెవర్లెట్ కారులో తరలిస్తున్న 9 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కత్తి మనోహర్, నాగరాజారెడ్డిలను అరెస్ట్ చేశారు. -
56,400ల మద్యం బాటిళ్ల పట్టివేత
రామాయంపేట (మెదక్ జిల్లా) : ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం బాటిళ్ల లోడుతో వెళుతున్న లారీని సోమవారం వేకువజామున రామాయంపేట వద్ద పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మెదక్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముజాహిద్ సిద్దిఖీ, స్థానిక ఎక్సైజ్ సీఐ సలీం తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని తిలక్‌నగర్ డిపో నుంచి 1300ల కాటన్ల (56400ల సీసాలు) మెన్షన్ హౌజ్ మద్యం బాటిళ్లను ఏపి 16 టీవై 2056 నెంబర్ గల లారీలో రామాయంపేట మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా సామర్లకోట బేవరేజెస్ డిపోకు తరలిస్తున్నారు. అదే సమయంలో రూట్ వాచింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అనుమానంతో స్థానిక మల్లెచెరువు కట్ట వద్ద లారీని ఆపి డ్రైవర్‌ను ప్రశ్నించారు. అతని వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశానికిగాను ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వారు వెంటనే సదరు లారీని స్వాధీన పరచుకొని ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ లారీలో సుమారుగా రూ.25 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ఉన్నాయని, ఇందుకుగాను టాక్స్ రూపేణా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఎనిమిది లక్షలను చెల్లించకుండా వెళుతున్నట్లు తేలిందన్నారు. వారి వద్ద మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి పర్మిట్లు, వే బిల్లులు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ గఫూర్ అలీతోపాటు క్లీనర్ తోంబేను వారు అరెస్ట్ చేశారు. లారీని మెదక్‌లోని ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐలు యాదగిరి, సయ్యద్ సాదత్ తెలిపారు. -
11 ఇసుక లారీలు సీజ్
శ్రీకాకుళం (కొత్తూరు) : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 11 లారీలను పోలీసులు సీజ్ చేశారు. ఒడిశాకు చెందిన కొందరు కొత్తూరు సరిహద్దు గ్రామాల్లోని ఇసుక ర్యాంప్‌ల నుంచి ఇసుకను తరలిస్తుండగా పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి లారీలను సీజ్ చేశారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు లారీల యాజమాన్యాలపై కేసు నమోదు చేశారు. -
కానిస్టేబుల్‌పై స్మగ్లర్ల దాడి
తిరుపతి : అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఏఆర్ కానిస్టేబుల్ పై స్మగ్లర్లు దాడి చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బీఎన్.కండ్రిగ మండలం పదో మైలు వద్ద సోమవారం జరిగింది. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నారని సమాచారం అందడంతో ఇన్ఫార్మర్ దయాళ్‌తోపాటు ఏఆర్ కానిస్టేబుల్ రమేష్ పదో మైలు వద్ద వేచి ఉన్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న స్మగ్లర్లు రెండు వాహనాలలో వచ్చి వీరిపై దాడికి పాల్పడ్డారు. స్మగ్లర్లు కత్తులతో దాడి చేయడంతో ఏఆర్ కానిస్టేబుల్ రమేష్ తలకు తీవ్రగాయం అయింది. స్మగ్లర్ల దాడి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వారిరువురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
వేములపల్లి (నల్లగొండ జిల్లా) : ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం కామేపల్లి గ్రామ సమీపంలో జరిగింది. వివరాల ప్రకారం.. కామేపల్లి గ్రామ సమీపంలోని పాలేరువాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వాగు దగ్గరకు వెళ్లి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అంతేకాకుండా ట్రాక్టర్ల డ్రైవర్లను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న టేకు ఫర్నీచర్ సీజ్
ఖమ్మం (అశ్వారావుపేట) : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పరిధిలో క్రాంతి ట్రాన్స్‌పోర్టు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు ఫర్నీచర్‌ను అటవీ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.20 వేలు ఉంటుంది. ఫర్నీచర్‌ను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్, సహాయకులు పరారీలో ఉన్నారు. అక్రమంగా టేకు ఫర్నీచర్‌ను అశ్వారావుపేట నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని సమాచారం అందటంతో అటవీ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. -
ఇండికా కారులో బయటపడ్డ టేకు కర్రలు
సుల్తానాబాద్ : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో జరిగిన ఓ చిన్న రోడ్డు ప్రమాదంతో కారులో అక్రమంగా తరలిస్తున్న టేకు కర్రలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళ్తే.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఆదివారం ఉదయం ఓ లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే లారీ వెళ్లిపోగా కారు అక్కడే నిలిచిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ కారు వద్దకు చేరుకుని తనిఖీ చేయగా అందులో రూ.40 వేలు నుంచి రూ.50 వేల విలువ చేసే టేకు కర్రలు తరలిస్తున్నట్టు వెలుగు చూసింది. దీంతో కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, ఆ కారును స్టేషన్‌కు తరలించారు. -
నిఘా...దగా!
ఇదో సినిమాలో సన్నివేశం ... బీదర్ నుంచి రోజుకో బైక్‌పై హాస్యనటుడు ఆలీ ఇసుకను బస్తాల్లో వేసి తీసుకొస్తుంటాడు... ఆ ఇసుకలో ఏదో ఉందన్న అనుమానంతో చెక్‌పోస్టులో తనిఖీలో ఉన్న పోలీసు అధికారితోపాటు సిబ్బంది ఎంతగా వెతికినా ఏమీ దొరకదు. ప్రతిరోజూ ఇదే పని. చివరకు ఆ పోలీసు అధికారే అసలు విషయం ఏమిటో చెప్పరా బాబ్బాబు అని బతిమలాడగా ‘ఎన్నిసార్లు తిరిగినా బైక్‌పై ఉన్న ఇసుకనే మీరంతా వెతికారు తప్ప నేను కొట్టేసి తీసుకువస్తున్న బైక్‌ను ఎవరూ పట్టించుకోలేదంటూ’ తుర్రుమంటాడు. సినిమా చూసే ప్రేక్షకులంతా గొల్లున నవ్వుకుంటారు. కట్ చేసి మన కథనంలోకి వద్దాం... ఈ నిఘా దగా కథనంలో కూడా లారీ, రైలు, జీపు, ఆటో, బైకు ఇలా ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో రేషన్ బియ్యాన్ని తరలించేస్తున్నారు. ఆ సినిమా సీన్లో పోలీసులు పసిగట్టలేక బైక్‌ను వదిలేస్తే ఇక్కడ అన్నీ తెలిసి బియ్యాన్ని దొంగచాటుగా వదిలేస్తున్నారు. దీంతో పేదలకు అందాల్సిన బియ్యం పరులపాలవుతున్నాయి. ⇒ తూతూమంత్రంగా రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ⇒ జిల్లాలు దాటి వెళుతున్న పేదల బియ్యం ⇒ రైళ్లు, లారీలు, ఆటోలు, పార్శిల్, ద్విచక్రవాహనం ⇒ అక్రమ రవాణాకు ఏదీ అనర్హం కాదు చీరాల : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల పరమవుతున్నాయి. నిత్యం టన్నుల కొద్దీ రేషన్ బియ్యం జిల్లాలు దాటి తరలిపోతున్నా సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. పట్టుకోవల్సిన రెవెన్యూ సిబ్బంది అసలు ఆ వైపే ఆలోచించడం లేదు. అడపాదడపా ఎన్ఫోర్సమెంటు అధికారులు పట్టుకుంటేనే అరకొరగా దొరుకుతున్నాయి. లేదంటే అక్రమార్కులకు రాచమార్గమే. ఎన్ఫోర్స్మెంట్ పట్టుకున్న సరుకుకు కూడా కేసులు పెట్టేది అంతంతమాత్రమే. లారీలు, ఆటోలు, రైళ్లు, పార్శిల్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు ఏదీ అక్రమ రవాణాకు అనర్హం కాదంటూ ఏ మార్గం ద్వారా సులువుగా ఉంటుందో ఆ మార్గంలో తరలించి జేబులు నింపుకుంటున్నా చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారే తప్ప దాడులు చేసిన దాఖలాలేవీ లేవు. దీంతో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం మూడు టన్నులు.. ఆరు కింటాళ్లుగా సాగిపోవడంతో ఈ వ్యాపారంలోకి కొత్తవారు దిగుమతి అవుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో చీరాల రైల్వేస్టేషన్లో విజయవాడ పాసింజర్ రైల్లో తరలిస్తున్న 620 కేజీల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఒక వ్యక్తి సమాచారం ఇవ్వడంతో ఆ బియ్యాన్ని అధికారులు రైల్వే పోలీసుల సహకారంతో పట్టుకోవల్సి వచ్చింది. ఈ నెల 21వ తేదీన నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి తరలించేందుకు సిద్ధం చేసుకున్న మూడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని చీరాల ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డీటీ శ్రీనివాసరావు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా పట్టణానికి చెందిన వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకోవడం విశేషం. ఇలా ఉంటే చీరాల నుంచి రోజూ ఆటోల్లో, రైళ్లలో బియ్యాన్ని తరలించడం పరిపాటిగా మారింది. రెండు చేతులా ఆర్జిస్తున్న వారిని కొంతమంది చూసి కొత్త అక్రమ రవాణా దారులుగా మరికొంతమంది మారుతున్నారు. రేషన్‌డీలర్ల వద్ద కేజీ రూ.10లు చొప్పున కొనుగోలు చేసి గుంటూరు జిల్లా బాపట్ల, లేకుంటే కాకినాడ, నెల్లూరు, చెన్నై తరలించి కిలో రూ.14 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో మండలానికి సుమారు 500 నుంచి 700 క్వింటాళ్ల బియ్యం కేటాయిస్తారు. అందులో ఒక వంతు మాత్రమే పేదలకు అందగా మూడోవంతు అక్రమ వ్యాపారులు, రేషన్ డీలర్లుకు భోజ్యంగా మారుతున్నాయి. తూతూమంత్రంగా తనిఖీలు ... ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో ఎంచక్కా బియ్యం రవాణా కావడానికి ప్రధాన కారణం రెవెన్యూ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమేనని పలువురు విమర్శిస్తున్నారు. రవాణాను అరికట్టేందుకు, అక్రమార్కులను అడ్డుకునేందుకు సంబంధితాధికారుల్లో చిత్తశుద్ధి కొరవడడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న పనితోనే సరిపోతుందని, ఇంకా ఇవన్నీ ఎక్కడ చూడగలమంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేషన్ డీలర్లుతోపాటు అక్రమవ్యాపారులు ప్రతినెలా రెవెన్యూ, ఎన్స్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పెద్ద మొత్తంలో ముట్టచెబుతున్నారు. ఒక్కో రేషన్ షాపు డీలరు నెలకు *.1200లు రెవెన్యూ అదికారులకు మామూలు చెల్లించాలి. వాటిని రెవెన్యూ ఇన్స్పెక్టర్తో సహ నలుగురు పంచుకుంటారు. ఒక్కొక్క నియోజకవర్గం నుండి రేషన్ డీలర్ నుండి రెవెన్యూ అధికారులకు లక్షన్నర నుండి రెండు లక్షల రూపాయల వరకు అందుతున్నట్లు సమాచారం. దీంతోనే వారు రేషన్ డీలర్లుపై గాని, అక్రమ వ్యాపారులపై చర్యలు తీసుకోరనేది అర్ధమవుతుంది. ఎప్పుడైనా దాడులు చేసి పట్టుకుంటే 6ఏ కేసులు మినహా పీడీయాక్టులు పెట్టే పరిస్థితులు లేకపోవడంతో అక్రమార్కులకు పాడికుండగా మారిన వ్యాపారాన్ని వదిలిపెట్టడంలేదు. 6ఏ కేసులు వలన ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో డీలర్లు, అక్రమవ్యాపారులు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉంటున్నారు. దీంతో పేదల బియ్యం జిల్లాలు దాటి చివరకు పెద్దల పరం అవుతున్నాయి. -
540 కేజీల గంజాయి పట్టివేత
విశాఖపట్నం: పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శనివారం విశాఖ జిల్లా రోలుగుంట మండలం నిండుగొండ జంక్షన్ సమీపంలో జరిగింది. వివరాల ప్రకారం.. రోలుగుంట మండలం నుంచి అక్రమంగా పెద్ద ఎత్తున గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మాటు వేసిన పోలీసులు, బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 27బస్తాల్లో సుమారు 540 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రత్నంపేట గ్రామానికి చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాతో సంబంధమున్న మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 27 లక్షలని పోలీసులు చెప్పారు. -
60 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
నెల్లూరు : ఎర్రచందనాన్నిఅక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా తడ మండలం తేనుగుంట గ్రామ సమీపంలో శనివారం జరిగింది. వివరాలు..నెల్లూరు నుంచి చెన్నైకు విలువైన ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు నిర్వహించి తేనుగుంట వద్ద ఒక స్కార్పియో, లారీలను స్వాధీనం చేసుకున్నారు. లారీలో 60 ఎర్రచందనం దుంగలను ఉన్నట్లు గుర్తించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (తడ) -
42 ఎర్రచందనం దుంగల పట్టివేత
గిద్దలూరు రూరల్: అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలను స్థానిక అటవీశాఖ అధికారులు శుక్రవారం తెల్లవారు జామున బేస్తవారిపేట మండలం హనుమాయిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారని గిద్దలూరు రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డికి సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు డీఆర్ఓ షేక్ నజీర్‌బాషా తన సిబ్బందితో హనుమాయిపల్లె సమీపంలో తనిఖీలు నిర్వహించారు. రోడ్డుకు ఒక పక్క అటవీ ప్రాంతంలో అక్రమంగా దాచి ఉంచిన 42 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని గిద్దలూరు అటవీశాఖ కార్యాయానికి తరలిచారు. ఎర్రచందనం దుంగల విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. దాడుల్లో ఎఫ్ఎస్ఓ హరిప్రసాద్, ఎఫ్‌బీఓలు ఓ.రామయ్య, టిప్పుఖాన్, మురళీకృష్ణ, రామకృష్ణ, ఏబీఓ ఎన్.రోజారమణి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇసుకాసురులు
- అధికారులు, తమ్ముళ్లు కుమ్మక్కు - సర్కార్‌కు రూ.6 కోట్లు - అక్రమార్కులకు రూ.5 కోట్లు - పొట్టేపాళెం రీచ్ నుంచి ఇష్టారాజ్యంగా అక్రమ రవాణా - సూళ్లూరుపేట, పొదలకూరు నుంచి చెన్నైకు ఇసుక తరలింపు - డ్వాక్రా సంఘాల పేరుతో అధికార పార్టీ వర్గీయులకు లెసైన్స్ ఇచ్చిన సర్కారు! సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇసుక అక్రమ రవాణా తమ్ముళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. డ్వాక్రా సంఘాల పేరుతో ఇసుకను కొందరు ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పాలసీ వారికి వరంగా మారింది. ప్రభుత్వానికి ఆదాయం మాటెలా ఉన్నా... అక్రమార్కులు మాత్రం కోట్లల్లో దండుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 42 రీచ్‌ల నుంచి ఇసుక తరలింపునకు అనుమతి ఉంది. ఇప్పటివరకు ఈ రీచ్‌ల ద్వారా లక్ష క్యూబిక్ మీటర్లకుపైగా ఇసుకను తవ్వి విక్రయించారు. ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.6 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ రీచ్‌ల ద్వారా అక్రమంగా ఇసుక తరలింపు ద్వారా రూ.5 కోట్లకుపైనే అక్రమంగా సంపాదించుకున్నట్లు సమాచారం. అధికారులు, అధికారపార్టీ నేతలు కుమ్మక్కై ఇసుకను ఇష్టారాజ్యంగా తరలించి సొమ్ముచేసుకున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టేపాళెం ఇసుక రీచ్ వద్ద పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే బుధవారం కలెక్టర్ జానకి, ఎస్పీ సెంథిల్‌కుమార్ ఇసుకరీచ్‌లను సందర్శించారు. అనుమతులు లేకుండా 8 జేసీబీలతో ఇసుకను తోడుతుండటాన్ని గమనించి వాటిని సీజ్‌చేశారు. పొట్టేపాళెం ఇసుక రీచ్ నుంచి అనధికారికంగా 70 నుంచి 80 లారీలు, టిప్పర్ల ద్వారా చెన్నైకి తరలించి సొమ్ముచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నాలుగు యూనిట్ల ఇసుకకు అనుమతి ఉంటే.. అనధికారికంగా 10 యూనిట్ల ఇసుకను తరలించినట్లు వెల్లడించారు. రాత్రిపూట అక్రమ రవాణా... ఇసుక అక్రమ రవాణా మొత్తం రాత్రిపూటే జరుపుతున్నారు. నెల్లూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, పొదలకూరు పరిధిలో ఈ అక్రమ రవాణా అధికంగా ఉన్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటలపైన ఇసుకను తరలించటానికి వీల్లేదు. అయితే జిల్లాలో ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి ఆరుగంటలపైన ఇసుకను తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొందరు అధికారుల సహకారంతో జేసీబీలను పిలిపించుకుని టిప్పర్లకు నింపుకుని తరలిస్తున్నట్లు సమాచారం. శ్రీకాళహస్తి పేరున డీడీ తీసుకుని.. చెన్నైకి తరలిస్తున్నట్లు తెలిసింది. రెండురోజుల క్రితం అధిక లోడుతో ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని ఆపిన ఓ పోలీసు అధికారిపై టీడీపీ నేతలు కొందరు జులుం ప్రదర్శించినట్లు సమాచారం. అధికలోడుతో ఇసుకను తరలించటం తప్పని పోలీసు అధికారి డ్రైవర్‌ను మందలించారు. విషయం తెలుసుకున్న తమ్ముళ్లు సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను తిట్టటం తప్పని ఆ పోలీసు చేత క్షమాపణ చెప్పించటం గమనార్హం. సీసీ కెమెరాలేవీ? ఇసుక తరలింపునకు కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఇసుక రీచ్‌ల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లతోపాటు.. అక్రమ రవాణా జరుగకుండా నిలువరించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇంతవరకు ఏ ఒక్క ఇసుక రీచ్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోందని డ్వాక్రా మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కోవూరు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఇసుక రీచ్‌లు డ్వాక్రా సంఘాల పేరుమీద ఉండటంతో... వారు రీచ్‌ల వద్ద కాపలా ఉండలేకపోతున్నారు. మహిళలు రాత్రిపూట కాపలా ఉండాలన్నా అక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టినా.. అమలు చేయటంలో పూర్తిగా విఫలమైందని మహిళలు విమర్శిస్తున్నారు. -
దారితప్పుతున్న రేషన్ బియ్యం !
నరసనన్నపేట రూరల్ :నిత్యావసర సరుకుల డిపోల ద్వారా పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. బడుగుల కడుపు నింపాల్సిన తిండి గింజలు బడాబాబులకు ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. తెల్లకార్డులపై కేజీ బి య్యం రూపాయికే ప్రభుత్వం పంపిణీ చేస్తుండగా వీటిని కొందరు నల్ల బజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి కొందరు రేషన్ డీలర్లు కూడా సహకరిస్తుండటంతో అక్రమార్కుల పంట పండుతోంది. నరసన్నపేట మండలం మడపాం వెంకటేశ్వరా మోడరన్ రైస్ మిల్లులో రెండు రోజుల క్రితం బయటపడ్డ బాగోతమే దీనికి ఉదాహరణ. అలాగే పెద్దపాడులో రెండు మిల్లుల్లో నూ, బైరి సింగుపురం వద్ద ఒక మిల్లులోనూ రేషన్ బియ్యూన్ని అధికారులు ఇటీవల గుర్తిం చారు. గతేడాదిలో పాలకొండ, కొత్తూరుల్లో రెండు మిల్లుల్లో అధిక మొత్తంలో రేషన్ బియ్యం అధికారులకు పట్టుబడ్డాయి. ఈవి ధంగా జిల్లాలో రైస్ మిల్లు యజమానులు అనేక మంది ఈ అక్రమ వ్యాపారం చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారనే విమర్శలు వస్తున్నారుు. ఇప్పటికే జిల్లా విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ దీనిపై దృష్టి సారించి దాడులు నిర్వహిస్తున్నా.. మరో వైపు గుట్టు చప్పుడు కాకుండా చీకటి వ్యాపారం యథేచ్ఛగా జరుగుతోంది. నరసన్నపేట పరసర ప్రాంతాల్లో ఉన్న మరికొన్ని మిల్లుల యజమానులు ఇదే పని చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. రాజకీయలకు అతీతంగా దాడులు మరింతగా చేస్తే అసలు గుట్టు బయడపడే అవకాశాలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు. మూడు పువ్వులు..ఆరు కాయలుగా.. తెల్ల కార్డులదారులకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇస్తున్న బియ్యాన్ని అక్రమార్కులు దక్కించుకొని, రీసైక్లింగ్ చేసి రూ. లక్షలు ఆర్జిస్తున్నారు. ఈ వ్యవహరం పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యహరిస్తుండటంతో బియ్యం మిల్లులు చేస్తున్న ఈ చీకటి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా నడుస్తోంది. నాలుగు రోజుల క్రితం పోలాకి మండలం చీడివలసలో ఒక వ్యాపారి ఇంటిలో ఐదు క్వింటాళ్ల బియ్యం, నరసన్నపేట మండలం మడపాంలో రైస్‌మిల్లులో ఏకంగా 233 క్వింటాళ్ల బియ్యం విజిలెన్సు ఎన్ఫోర్సు మెంట్ సీఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో బృందం గుర్తించారు. ఇలా సేకరిస్తున్నారు... మార్కెట్లో సూపర్ ఫైన్ బియ్యం ధర చుక్కలను తాకుతున్నారుు. క్వింటా రూ. నాలుగు వేలకు పైనే పలుకుతోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, మిల్లింగ్ చేసి బియ్యం విక్రయిస్తే వచ్చే లాభాలు అంతంత మాత్రమే. ఇదే పీడీఎస్ బియ్యాన్ని అడ్డదారుల్లో సేకరించి కాస్తా మెరుగు పట్టి అమ్మితే వచ్చే లాభం ఎక్కువ. దీంతో కొంతమంది వ్యాపారులు రేషన్ బియ్యంపై దృష్టిసారించారు. జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న బియ్యం మిల్లులోనూ, అధికార పార్టీ అండ ఉన్న కొందరు మిల్లర్లు ఈ పనులకు పూనుకుంటున్నట్టు తెలిసింది. నరసన్నపేట, శ్రీకాకుళం.. ఇతర ప్రాంతాలను వ్యాపార కేంద్రాలుగా చేసుకొని ఈ చీకటి వ్యాపారం చేస్తున్నారు. తెల్లకార్డు వినియోగదారుల నుంచి దళారుల ద్వారా బియ్యూన్ని సేకరిస్తున్నారు. ప్రభుత్వం నామమాత్రమైన ధరలకు బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. కొంత మంది బియ్యం తీసుకోవడంలేదు. మరికొంత మంది తీసుకున్న బియ్యాన్ని వ్యాపారులకు అమ్మేస్తున్నారు. అలాగే డీలర్లు కూడా కార్డుదారులు తీసుకెళ్లని బియ్యాన్ని తప్పుడు రికార్డులు చూపించి వ్యాపారులకు ఇస్తున్నారు. ఈవిధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని కేజీ రూ. 12 నుంచి 14 రూపాయల వరకూ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని రైస్ మిల్లుల్లో మరో సారి మరపట్టించి వివిధ బ్రాండ్ల పేరుతో ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. క్వింటాల్‌కు కనీసం రూ. వెయ్యి ఆదాయం పొందుతున్నారు. మరికొందరు మిల్లుల యజమానులు సన్న బియ్యంలో మరపట్టిన రేషన్ బియ్యాన్ని కలిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బియ్యాన్ని విశాఖ, విజయనగరంలో పాటు జిల్లాలోనూ విరివిగా అమ్మకాలు సాగిస్తున్నారు. తాజాగా తుపాను బాధితులకు ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో కార్డుదారులకు 25 కేజీలు, 10 కేజీల చొప్పున్న పంపిణీ చేశారు. ఈ బియ్యం కూడా పక్క దారి పట్టి రైస్ మిల్లులకు చేరుతున్నాయి. దీనిపై మరింత నిఘా పెంచితే మొత్తం వ్యవహరం బయటపడుతుందని పలువురు అంటున్నారు. -
అక్రమాలకు గ్రీన్‌సిగ్నల్
- ఇసుక మాఫియా విజృంభణ - పోలీసులకు కాసుల వర్షం వికారాబాద్: పశ్చిమరంగారెడ్డి జిల్లా పరిధిలో ఇసుకమాఫియా పోలీసులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇసుక అక్రమరవాణాతో పాటు నల్లబజారుకు రేషన్‌బియ్యం తరలింపునకు సైతం కొందరు పోలీసు అధికారులు ఆశీస్సులు అందించి అందిన కాడికి దండుకుంటున్నారు. పరిగి డివిజన్ నుంచి నిత్యం 60-70 లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను తరలించుకుపోతున్నారు. అలాగే తండూరు సబ్‌డివిజన్‌లో 45నుంచి 69, వికారాబాద్ సబ్‌డివిజన్‌లో 20నుంచి 50లారీల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. తద్వారా ప్రభుత్వానికి రావాల్సిన లక్షలాది రూపాయల రాయల్టీకి గండిపడుతోంది. ఈ అక్రమ వ్యాపారంలో సంహభాగం పోలీసు అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు. ఏడాది క్రితం ఎస్పీ బి.రాజకుమారి చేపట్టిన కఠిన చర్యల వల్ల ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ పడినా గత ఆరునెలలుగా మళ్లీ ఊపిరిపోసుకుంది. తాండూరు పరిధిలోని యాలాల్ మొదలు కొని మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌సాగర్,కర్నాటక ప్రాంతం, గండేడ్ మండలం రుసుంపల్లి,రంగారెడ్డిపల్లి, పెద్ద వార్వాల్, సాలార్‌నగర్ వాగులనుంచి పరిగి మండలం ఇబ్రహింపూర్,గడిసింగాపూర్,రంగంపల్లిల నుంచి ఫిల్టర్ ఇసుకను యథేచ్ఛగా తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. ఇసుక లారీలనుంచి డబ్బు వసూళ్లకు ముగ్గురు పోలీసులు ప్రత్యేకంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు సర్వత్ర వినిపిస్తున్నాయి. రెగ్యులర్‌గా నడిచే ఇసుక లారీల నుంచి నెలకు ఇంతని వసూలు చేస్తున్నారు.అదే విధంగా కొత్తగా రవాణ చేసే లారీల వద్ద అయితే అదును బట్టి ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు వ సూలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఈ వ్యవహరం డీఐజీ వరకు వెళ్లింది.అప్పట్లో ఇక్కడి పోలీసు అధికారులకు నోటీస్‌లు జారీ చేయగా వారు సంజాయిషీ ఇచ్చుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ తంతు ఒక పరిగికే కాదు, ఇటు తాండూరుతో పాటు వికారాబాద్‌లో కూడా కొనసాగుతున్నట్లు తెలిసింది. ఎక్కువగా పరిగి,తాండూరు ప్రాంతల్లో ఇసుక అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా పోలీసుల అండదండలతో కొనసాగుతున్నట్లు వినికిడి. దేనికైనా సై పరిగి పోలీసులు అక్రమ సంపాదన కోసం దేనికైనా బరితెగిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అక్రమ రవాణ కేవలం ఒక ఇసుకకే పరిమితం కాలేదు.నల్లబజారుకు రేషన్ బియ్యాన్ని సైతం పోలీసుల అండదండలతో తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. .పరిగి కే ంద్రంగా అక్రమ బియ్యం వ్యాపారం జోరుగా కొనసాగుతోంది . ఈ వ్యాపారంపై పోలీసులు నెలకు రూ.50 వేలు మొదలు కొని లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. పరిగి మీదుగా అక్రమ మార్గాన సరుకును తరలించే వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పోలీసులు తాత్కాలిక చెక్‌పోస్టులు ఏ ర్పాటు చేసి రాత్రి పూట వసూళ్లకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. -
యథేచ్ఛగా అక్రమ రవాణా
తిరువూరు, న్యూస్‌లైన్ : జిల్లా సరిహద్దు ప్రాంతమైన తిరువూరు మీదుగా ఎలాంటి అనుమతులు లేకుండా నిత్యం వేరుశనగ విత్తనాల లారీలు మహారాష్ట్రకు తరలిపోతున్నా రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయశాఖ పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 5న అగిరిపల్లి నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు రూ.18లక్షల విలువైన వేరుశనగ విత్తనాల సంచులు లారీలో తరలిస్తుండగా తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమకు రూ.18వేల మార్కెట్‌సెస్ చెల్లిస్తే లారీని వదిలేస్తామని ఏఎంసీ అధికారులు చెప్పగా, ఈ చెల్లింపులో జాప్యం జరగడంతో వ్యవసాయశాఖ ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు 6ఏ కేసు నమోదు చేశారు. నిజామాబాద్‌లోని సూపర్‌సీడ్స్ పేరుతో వారం తిరగకుండానే గురువారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో మళ్లీ ఆగిరిపల్లి నుంచి నాందేడ్‌కు మరో రూ.18.70 లక్షల విలువైన వేరుశనగ విత్తనాలు రవాణా చేస్తుండగా తిరువూరు రాజుపేటలోని ఏఎంసీ చెక్‌పోస్టు వద్ద నిలిపివేశారు. ఈ విత్తనాల తరలింపునకు ప్రభుత్వపరంగా ఎలాంటి అనుమతులు లేకపోయినా ఏఎంసీ అధికారులు రూ.18వేల మార్కెట్ సెస్ మాత్రమే వసూలు చేసి లక్షలాది రూపాయల విలువైన అక్రమ విత్తనాల రవాణాకు అనుమతించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాము మార్కెట్ సెస్ వసూలు చేసి వేరుశనగ లోడు లారీని వదిలేశామని, అది అక్రమ తరలింపా, సక్రమమా అనే విషయం తమకు సంబంధం లేదని తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇన్చార్జి కార్యదర్శి రంగారావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం... తిరువూరు మీదుగా వేరుశనగ విత్తనాలు తరచూ అక్రమంగా మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వాధికారులు పట్టించుకోవట్లేదు. గతంలో రెవెన్యూ, వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టులు తిరువూరులోని జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసి అక్రమరవాణాను అరికట్టారు. అయితే పదేళ్ల క్రితం ఈ చెక్‌పోస్టులను తొలగించారు. పౌరసరఫరాలు, రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు విజయవాడ-జగదల్పూర్ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించకపోవడంతో అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతోంది. -
అక్రమ దందాకు రైట్ రైట్
దొడ్డు రకాల మాటున మిల్లర్ల బాగోతం =సన్నాలను రాష్ర్టం దాటిస్తున్న మాఫియూ =అనుమతులతో కొందరు... లేకుండా మరికొందరు =అధికారులతో కుమ్మక్కు... రూ. లక్షల్లో ముడుపులు =చెక్‌పోస్టు సిబ్బందికి ముడుపుల గాలం దొడ్డు బియ్యం చాటున సన్న బియ్యం తరలిపోతున్నాయి. జిల్లాలో ఈ దందా కొంతకాలంగా జోరుగా సాగుతోంది. సివిల్ సప్లైస్, మార్కెటింగ్, వాణిజ్య శాఖలతోపాటు విజిలెన్స్ అధికారుల కళ్లు గప్పడం... 22 చెక్‌పోస్టులు దాటుతూ అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగడం వెనుక పలువురి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. మాఫియూ తరహాలో జరుగుతున్న ఈ బాగోతంపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం... వరంగల్, న్యూస్‌లైన్: జిల్లాలో బియ్యం దొంగల హవా నడుస్తోంది. పలు శాఖల అధికారులతో కలిసి బియ్యం అక్రమ రవాణాకు దారులు తెరిపించి అందినకాడికి దండుకుంటున్నారు. దొడ్డు బియ్యం పేరిట అనుమతులు తీసుకుని తమ పలుకుబడితో సన్న రకాలను సరిహద్దులు దాటిస్తున్నారు. కొందరు అనుమతులు తీసుకోకుండా కూడా దందా కొనసాగిస్తున్నారు. పన్నులు చెల్లించకుండా సర్కారు ఖజానాకు గండి కొడుతున్నారు. పలువురు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లైస్, వాణిజ్య పన్నులు, మార్కెటింగ్, చెక్‌పోస్ట్ అధికారులు, సిబ్బందిని ముడుపులతో మచ్చిక చేసుకుని మాఫియూ తరహాలో వ్యాపారం చేస్తున్నారు. బస్తాల అడుగు భాగాన సన్న బియ్యం... పైన దొడ్డు బియ్యం లోడ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో మిల్లర్ల అక్రమ బాగోతం నిత్యం నిరాటంకంగా కొనసాగుతోంది. పారిన వ్యాపారుల పాచిక సన్న బియ్యం ధరల అదుపునకు ప్రభుత్వం షరతులు విధించింది. సన్న బియ్యాన్ని కేవలం రాష్ట్రంలోనే అమ్ముకోవాలని... దొడ్డు బియ్యాన్ని అనుమతి తీసుకుని రాష్ర్టం బయట అమ్ముకోవచ్చని మిల్లర్లను ఆదేశించింది. జిల్లాలో అక్టోబర్ నుంచి సన్న బియ్యం ఎగుమతికి బ్రేక్ పడింది. ఇక్కడే వ్యాపారులు తమ వ్యాపార సూత్రాలను అమలు చేశారు. జిల్లాలో దొడ్డు రకం బియ్యం ఎక్కువగా ఉన్నాయని.... వాటిని ఇతర రాష్ట్రాల్లో అమ్ముకునేందుకు అవకాశమివ్వాలంటూ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సర్కారు లెవీ పెట్టిన తర్వాత 25 శాతం మేర దొడ్డు రకం బియ్యూన్ని అమ్ముకునే వీలు కల్పించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న మిల్లర్లు అక్రమాలకు తెరలేపారు. వే బిల్లుల్లో అక్రమాలతో షురూ లెవీకి పెట్టిన తర్వాత 25 శాతం అమ్ముకునే వీలున్న మిల్లర్లు... ఇదే ముసుగులో అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. మిల్లు నుంచి లారీ బయటకు వచ్చిందంటే... ట్రక్ షీట్, వే బిల్లులు వాహనాల వెంట ఉండాలి. ట్రక్ షీట్లో ఏ రకమైన బియ్యం... ఏ మిల్లు నుంచి ఎక్కడకు వెళ్లుతున్నాయనే విషయం స్పష్టంగా ఉంటుంది. వే బిల్లు తీసుకుంటే ఐదు శాతం పన్ను తప్పనిసరిగా చెల్లించాలి. ఒకసారి వే బిల్లు తీసుకుంటే ఒక వాహనానికి ఒకేసారి మాత్రమే పనికివస్తుండడంతో మిల్లర్లు ఇక్కడే అక్రమాలకు తెరతీశారు. పలువురు అధికారులు, సిబ్బందితో కుమ్మక్కై మాయ చేసి తేదీలు లేకుండా... నంబర్లు లేకుండా వే బిల్లులు తీసుకున్నారు. ఇవి మిల్లర్ల వద్దే ఉంటుండడంతో వారు అవసరాన్ని బట్టి తేదీలు... నంబర్లు వేసుకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. వే బిల్లుల్లో తేదీలు, నంబర్లను ఓ రసాయనంతో తుడిపేస్తున్నట్లు తెలిసింది. ఇక ఇతర రాష్ట్రాల్లో బియ్యం అమ్మకాలకు అనుమతులు తీసుకున్న పక్షంలో సివిల్ సప్లైస్ అధికారి ఆ మిల్లులో దగ్గరుండి వాహనాల్లో బియ్యాన్ని లోడ్ చేసి పంపించాలి. కానీ... వ్యాపారులతో లాలూచీ పడిన సదరు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో మిల్లర్లు బస్తాల అడుగు భాగంలో సన్న బియ్యం... పై భాగంలో దొడ్డు బియ్యం లోడ్ చేసి యథేచ్ఛగా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వరంగల్ టూ తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక జిల్లాలోని సన్న బియ్యూన్ని మిల్లర్లు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పరకాల.. భూపాలపల్లి... కాళేశ్వరం మీదుగా మహారాష్ట్ర, వరంగల్.. ఖమ్మం మీదుగా ట్రెరుున్ రూట్లో తమిళనాడు, సిద్ధిపేట.. బీదర్ మీదుగా కర్ణాటక రాష్ట్రాలకు లారీల్లో తరలుతున్నారుు. చెక్‌పోస్టులు ఉన్నా... జిల్లావ్యాప్తంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 22 శాశ్వత చెక్‌పోస్టుల్లో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. నర్సంపేట, కొడకండ్ల, జనగాం, నెక్కొండ, స్టేషన్ ఘన్‌పూర్‌లో ఒక్కటి చొప్పున, పరకాల, ఆత్మకూర్, చేర్యాల, వర్ధన్నపేటలో రెండు చొప్పున, ములుగు, తొర్రూరు, కేసముద్రంలో మూడు చొప్పున ఉన్నారుు. కానీ... ఎక్కడా సన్న బియ్యం తరలుతున్న లారీలు పట్టుడబడక పోవడం ఆశ్చర్యం వేయకమానదు. ఇవే కాదు... ఎల్లాపూర్, ఖమ్మం రోడ్‌లోని దంతాలపల్లి వద్ద, ఏటూరునాగారం హైవే, జనగామ వద్ద వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుత మూడు నెలల పాటు తాత్కాలిక చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలి. అధికారులు వీటిని పక్కనపడేసి... నెలలో ఒక్కటి, రెండు రోజులపాటు నామమాత్రపు తనిఖీలతో సరిపుచ్చుతుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. రోజుకు రూ. 11,25,000 గండి మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 75 శాతం ప్రభుత్వానికి లెవీ పెట్టాలి. 25 శాతం ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయించుకోవచ్చు. వీటిలోనూ 12.5 శాతం రాష్ట్రంలో, మరో 12.5 శాతం ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవాలి. ఈ మేరకు ఇతర ప్రాంతాల్లో బియ్యం విక్రరుుంచాలంటే వాణిజ్య పన్నుల శాఖకు నాలుగు శాతం, మార్కెటింగ్ శాఖకు ఒక శాతం పన్ను చెల్లించాలి. పలువురు మిల్లర్లు ఈ నిబంధనలను కాలరాయడమే కాకుండా ప్రభుత్వానికి ఒక్క రూపారుు పన్ను సైతం చెల్లించకుండా బియ్యూన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అనుమతులు తీసుకుని పంపించే దొడ్డు రకం బియ్యానికి సంబంధించి 20 టన్నులుండే ఒక లారీకి రూ. 25 వేల వరకు పన్ను చెల్లించాలి. ప్రతి రోజూ జిల్లా నుంచి సుమారు 45 వరకు లారీలు అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన రోజుకు రూ. 11,25,000 మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. వాటాలవారీగా ముడుపులు పలువురు సివిల్ సప్లైస్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, మార్కెటింగ్, వాణిజ్య శాఖల అధికారులతో మిల్లర్లు ముఠాగా ఏర్పడి... జిల్లాలోని ప్రభుత్వ పెద్దల సహకారంతో ఈ దందా కొసాగిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వ్యాపారులు వాటాల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకు ముడుపులు అందజేస్తున్నట్లు తెలిసింది. ఒక్క లారీ బియ్యం సరిహద్దులు దాటి అమ్ముకుంటే... మిల్లర్లు అందరూ కలిసి కక్కుర్తి పడిన జిల్లాస్థారుు అధికారులకు నెలలో ఒకసారి కొంత ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక ద్వితీయ శ్రేణి అధికారులు, సిబ్బంది... లారీకి కొంత మేర తీసుకుంటున్నట్లు సమాచారం. వ్యాపారులు వీరికి నెలకు రూ. 8 వేల నుంచి రూ. 10 వేలు చేతిలో పెడుతున్నట్లు వినికిడి. -
బస్సుల్లో ప్రమాదకర పదార్ధాల రవాణా
ప్రయాణికులను మాత్రమే తీసుకువెళ్లవలసిన బస్సులలో పేలుడు పదార్ధాలు, ప్రమాదకర రసాయన, ఇతర పదార్ధలు కూడా అక్రమంగా రవాణా చేస్తున్నారు. దాదాపు అన్ని ట్రావెల్స్ సంస్థలకు చెందిన బస్సులలో అనుమతిలేకుండా అక్రమంగా ఇటువంటి పదార్ధాలను రవాణా చేస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదు. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేస్తారు. ఆ తరువాత ఆ విషయం మరచిపోతారు. ఇదంతా షరామామూలైపోయింది. మనుషుల ప్రాణాలంటే ఈ అధికారులకు ఎంత చులకన! మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామం సమీపంలో ఎన్‌హెచ్ 44పై బుధవారం ఉదయం ఘోర ప్రమాదానికి గురైన ఓల్వో బస్సులో కూడా ప్రమాదకర పదార్ధాలు రవాణా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ బస్సు లగేజీ భాగంలో ఊలు పదార్థాలు ఉండటం వల్ల మంటలు వెంటనే దట్టంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ఊలు ప్రమాదానికి కారణం కాకపోయినప్పటికీ, తక్షణం మంటలు వ్యాపించడానికి మాత్రం కారణమయిందని చెప్పవచ్చు. ఈ ఓల్వో బస్సు బెంగళూరు కేంద్రంగా పని చేసే జబ్బర్ ట్రావెల్స్‌కు చెందినది. ఈ బస్సులో ప్రమాదకర పదార్ధాలు ఉన్నాయన్న ఆరోపణలకు బలం చేకూరే విధంగా ఈ ట్రావెల్స్‌కు చెందిన గోడౌన్లో కెమికల్స్, ఇతర ప్రమాదకర పదార్ధాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి వస్తుండగా ఉదయం 5:10 గంటలకు హైదరాబాద్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఈ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. 45 మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగంగా వస్తున్న బస్సు మరో వాహనాన్ని తప్పించబోయే సమయంలో కల్వర్టును ఢీకొంది. దాంతో డీజిల్ ట్యాంకు పగిలిపోయి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. బస్సు లగేజీ భాగంలో ఊలు పదార్థాలు ఉండటంతో మంటలు మరింతగా వ్యాపించాయి. దానికి తోడు డ్రైవర్, క్లీనర్ బస్సులో నుంచి దూకి పారిపోయారు. లాక్ అయిన ఆటోమేటిక్ డోరును తీసేవారులేరు. నిమిషాల వ్యవధిలోనే గాఢ నిద్రలో ఉన్న 45 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. అద్దాలు పగులగొట్టి అయిదుగురు మాత్రంమే బస్సులో నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులు మాత్రమే ప్రయాణించవలసిన బస్సుల్లో ప్రమాదకర పదార్దాలు రవాణా చేయడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణనష్టం అధికం కావడానికి అవి కారణమవుతాయి. అలాగే ప్రమాదానికి గురైన బస్సుకు ఒక్కరే డ్రైవర్ ఉన్నాడు. వాస్తవానికి దూర ప్రయాణాలు చేసే బస్సులకు ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. రెండవ డ్రైవర్‌ను ఏర్పాటు చేయకపోవడం ట్రావెల్ ఏజన్సీ నిర్లక్ష్యం. ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు. అధికారులకూ తెలుసు. కానీ మళ్లీ అక్కడా నిర్లక్ష్యం, నిర్లక్ష్యం.... నిర్లక్ష్యం ఎన్ని ప్రాణాలనైనా బలి తీసుకుంటుంది! అందుకు కారణమైనవారికి మాత్రం బుద్దిరాదు!!