ఉచిత ఇసుక విధానం అధికార టీడీపీకి వరమైంది. సామాన్య జనానికి భారమైంది. అధికారులకు తలనొప్పిగా తయారైంది. రీచ్‌ల వద్ద పాగావేసి అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. వారి కనుసన్నల్లోనే ఇసుక తవ్వకాలు జరగాలనే రూలును అనధికారికంగా అమలు చేస్తున్నారు. అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా వారి అక్రమాలు ఆగడం లేదు. మరోపక్క ఉచిత ఇసుక కాస్తా సామాన్యులకు చేరేసరికి మరింత ‘ప్రియ‘మైపోయింది.
ఎచ్చెర్ల: ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటలో జనానికి కంటిమీద కునుకులేదు. చీకటిపడితే ట్రాక్టర్ల హోరు. ఇసుక రవాణాతో గ్రామం మోతెక్కిపోతోంది. ఈ గ్రామానికి అనుకొని ఉన్న బలగ రీచ్, ఆమదలవలస సమీపంలోని గోపీనగరం ఇలా ఈ మూడు ప్రాంతాల నుంచి అక్రమ వ్యాపారం సాగుతోంది. అన్ని రీచ్‌లూ అనధికారికమే.. 36 మంది ట్రాక్టర్ యజమానులు సిండికేట్‌గా మారి ఈ అక్రమ రవాణాకు నేతృత్వం వహిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఇందుకు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం.
ఇసుక ఉచితం లేని సమయంలో ట్రాక్టర్ నుంచి రూ. 10 వేలు చొప్పున నెలవారీ వసూలు చేసేవారు. ఇవి పోలీసు సర్కిల్ స్థాయి అధికారితోపాటు జిల్లా అధికార పార్టీ నాయకుడికి వెళ్లేవి. ప్రస్తుతం తమ్మినాయుడుపేట నుంచి రోజూ రాత్రి 12 నుంచి 4 వరకు రవాణా సాగుతోంది. సమీప ప్రాంతాల్లో, తోటల్లో రాశులుగా వేస్తున్నారు. విశాఖపట్నం దీనిని తరలించనున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోకుండా అధికార పార్టీ నాయకులు చూసుకుంటున్నారని సమాచారం. అనధికార క్వారీల నుంచి పొక్లెయినరుతో ఇష్టానుసారంగా ఇసుక తవ్వుతున్నారు. మరో పక్క ఇసుక రీచ్‌కు వెళ్లేందుకు నది గట్లు సైతం తవ్వేసి రోడ్డు మార్గం చేసేశారు. రీచ్‌కు జాతీయ రహదారి నుంచి కిలోమీటర్ లోపలకు వెళ్లాలి.
ఇసుకలో నుంచి ట్రాక్టర్లు తప్ప కార్లు, బైక్‌లు, జీపులు వెళ్లే పరిస్థితి లేదు. శ్రీకాకుళం మున్సిపాలిటీ బలగ ప్రాంతంలో ఈ అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. జాతీయ రహదారికి అనుకుని అనువైన ప్రదేశాల్లో పోగులు వేసి తర్వాత తరలింపునకు రంగం సిద్ధం చేస్తున్నారు. అర్థరాత్రి వేళ అధికారులు రీచ్‌కు వెళ్లే ప్రయత్నం చేయటం లేదు. ట్రాక్టర్లు వివరాలను అధికారులు సేకరించినా అధికార పార్టీ నాయకులను కాదని చర్యలు తీసుకునే ధైర్యం చేయటం లేదు. వీరికీ వాటాలు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత అక్రమ రవాణాతో స్థానికులకు కంటిమీద కునుకుండటం లేదు. ఈ ధ్వని కాలుష్యానికి చెవులు చిల్లులు పడుతున్నాయని వీరంతా వాపోతున్నారు. నిలదీస్తే బెదిరించే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. దాంతో మాట్లాడలేకపోతున్నారు.
ఇసుక దుమారం
Published Thu, Mar 31 2016 12:02 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement