ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా) : భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటుతున్నా పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులు యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా చేస్తుండటంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఇసుక రవాణాను అడ్డుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం హనుమగుత్తిలో ఆదివారం చోటుచేసుకుంది. ఇసుక ర్యాంపు వద్ద నుంచి పరిమితులకు మించి ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించిన స్థానికులు ఆదివారం ఇసుక తరలిస్తున్నవారిని నిలదీశారు. దీంతో ఆగ్రహించిన అధికార పార్టీ నాయకులు ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సురేష్‌ను రంగంలోకి దించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న ఆయన స్థానికులను బెదిరింపులకు గురి చేశారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు డాక్టర్ సుధీర్ రెడ్డి భూగర్భజలాలు అడుగంటుతున్నాయని ఆయనతో చెప్పడం ప్రారంభించారు. ఒక స్థాయిలో వీరి మధ్య వాదన కాస్తా తోపులాటగా మారి ఉద్రిక్తతకు దారితీసింది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను నచ్చజెప్పి సోమవారం రెవెన్యూ అధికారుల సాయంతో హద్దులు నిర్ణయిస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత
Published Sun, Mar 20 2016 12:31 PM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM
Advertisement