ఇంటి దొంగలు | Illegal transportation of Ration rice in Prakasam | Sakshi
Sakshi News home page

ఇంటి దొంగలు

Published Sun, Sep 30 2018 8:06 AM | Last Updated on Sun, Sep 30 2018 8:06 AM

Illegal transportation of Ration rice in Prakasam - Sakshi

మార్టూరు: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి ఆకలి దప్పులు తీర్చడం కోసం ఏళ్ల నుంచి ప్రభుత్వాలు రేషన్‌ షాపుల ద్వారా పప్పు, బియ్యం, చింతపండు వంటి కనీస అవసరాలు సరఫరా చేస్తున్నాయి. గతంలో తొమ్మిది రకాల వస్తువులు పంపిణీ చేసే వారు. ప్రస్తుత ప్రభుత్వం రెండు మూడు రకాల వస్తువులు పంపిణీ చేస్తూ వాటిని కూడా కార్పొరేట్‌ సంస్థల చేతిలో పెట్టే దిశగా ప్రయత్నిస్తోంది. రేషన్‌ దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం లోపభూయిష్టంగా మారి అక్రమార్కులకు లాభాల పంట పండిస్తోంది.

మండల కేంద్రం మార్టూరు కూరగాయల మార్కెట్‌ ఆవరణలో నిత్యావసరాల గిడ్డంగి ఉంది. దీన్ని మండల లెవెల్‌ స్టాక్‌ పాయింట్‌ (ఎంఎల్‌ఎస్‌)..అని అంటారు. ఇక్కడి నుంచి మార్టూరు, యద్దనపూడి, బల్లికురవ మండలాల్లోని 107 రేషన్‌ షాపులకు నెలకు 10 వేల బస్తాలు (50 కేజీల బియ్యం) సరఫరా చేస్తారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి బియ్యం పూర్తిస్థాయిలో రేషన్‌ షాపులకు సరఫరా కావడం లేదు. ఇదే విషయం విజిలెన్స్‌ అధికారుల తనిఖీలో వెల్లడైంది. 107 రేషన్‌ షాపులకు సంబంధించి సగటున నెలకు 2 వేల బియ్యం బస్తాలు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి నేరుగా అద్దంకిలోని రైస్‌ మిల్లులకు చేరుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ లావాదేవీల్లో రేషన్‌ షాపు నిర్వాహకుడికి కేజీ బియ్యం 8 రూపాయల చొప్పున 50 కేజీల బస్తాకు 400 రూపాయలు గిట్టుబాటు అవుతున్నట్లు సమాచారం.

గిడ్డంగి నిర్వాహకులకు కేజీకి రెండు రూపాయలుపోగా 5 రూపాయలు లాభం కలుపుకుని అక్రమ వ్యాపారులు కేజీ 15 రూపాయల చొప్పున మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఇక్కడ జరిగే మాయాజాలం తెలిసి అధికారుల కళ్లు బైర్లుగమ్మాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన కొద్దిమంది మిల్లర్లకు ధాన్యం సరఫరా చేస్తారు. ఆ మిల్లర్లే రేషన్‌ షాపులకు బియ్యం సరఫరా చేస్తారు. ఈ మిల్లులనే క్లస్టర్‌ మిల్‌ రైస్‌ (సీఎంఆర్‌) అని పిలుస్తారు. ఈ సీఎంఆర్‌లకు ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యాన్ని మిల్లర్లు బహిరంగ మార్కెట్‌లో విక్రయించి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన రేషన్‌ బియాన్ని మరుసటి నెలలో అదే ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు సరఫరా చేయడం విశేషం. ఈ అక్రమ వ్యాపార లావాదేవీలతో నెలకు రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు సమాచారం. 

వ్యాపారుల సిండికేట్‌
అద్దంకిలోని కొందరు వ్యాపారులు సిండికేట్‌గా మారి అక్రమ వ్యాపారం నిర్వహిస్తుండగా అద్దంకి అధికార పార్టీ నాయకుడి అనుచరుడి ఒకరికి ప్రభుత్వం అండకోసం కొంత వాటా ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత మంగళవారం విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌కుమార్‌ తన సిబ్బందితో రెండి బృందాలుగా ఏర్పడి నిర్వహించిన దాడిలో వలపర్ల సమీపంలోని 60 బస్తాల రేషన్‌ బియ్యం పట్టుబడగా అద్దంకి ఎన్‌టీఆర్‌ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ వెంకటేశ్వర్లు మార్టూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి బియ్యం అద్దంకిలోని ఓ రైస్‌ మిల్లుకు తరలిస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు.

ఈ క్రమంలో స్థానిక ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను అదే రోజు తనిఖీ చేసిన అధికారులు రేషన్‌ బస్తాల నిల్వలు సక్రమంగానే ఉండటంతో ఖంగుతిన్నారు. అనుమానం వచ్చిన అధికారులు ముందు రోజు అంటే గత సోమవారం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి ఏయే రేషన్‌ షాపులకు బియ్యం పంపిణీ నిర్వహించారో ఆ రూట్‌ మ్యాప్‌ తీసుకుని వలపర్ల, మార్టూరులోని రేషన్‌ దుకాణాలతో తనిఖీలు నిర్వహించగా అసలు విషయం బయట పడింది. ఒక్కో రేషన్‌ షాపులో 15 నుంచి 20 బస్తాల బియ్యం తరగతులను గుర్తించిన అధికారులు ఆ బియ్యం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి నేరుగా మిల్లర్లకు చేరుతున్నట్లు నిర్ధారించుకుని సదరు మిల్లుపై కూడా దాడులు నిర్వహించిన అధికారులు 30 బస్తాల అక్రమ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ వ్యాపారానికి జిల్లా పౌర సరఫరాల శాఖ ముఖ్య ఉద్యోగి ఒకరి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం.

 వీరిద్దరూ కలిసి మార్టూరులో నెలకు వేలాది బస్తాల అక్రమ రేషన్‌ బియ్యం వ్యాపారం నిర్వహించే ఓ మహిళ నుంచి నెలకు 10 వేల రూపాయల చొప్పున మామూళ్లు తీసుకుంటున్నట్లు సంబంధిత శాఖలోనే గుసగుసలు వినిపిస్తుండటం విశేషం. విజిలెన్స్‌ శాఖ జిల్లా అధికారిగా ఏఎస్పీ రజని పదవీ బాధ్యతలు చేపట్టాక అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్న మైనింగ్‌ వ్యాపారులు, బియ్యం వ్యాపారులపై విస్తృత దాడులు నిర్వహించడంతో ప్రస్తుతం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు సమాచారం. మరింత సమర్థంగా దాడుల నిర్వహించి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement