ration rice Siege
-
అర్ధరాత్రి నకిలీ టాస్క్‌ఫోర్స్..
సాక్షి, తిరుమలాయపాలెం: మండల పరిధిలోని బచ్చోడు నుంచి ఆదివారం అర్ధరాత్రి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారు. ఇదే అదునుగా బియ్యం తరలిస్తున్న ముఠాలోని వ్యక్తే, మరికొందరు కలిసి నకిలీ పోలీసుల అవతారమెత్తాడు. బియ్యం వ్యాపారిని రూ. 80 వేలు డిమాండ్ చేశారు. చివరకు ఖమ్మం టాస్క్‌ఫోర్స్(ఒరిజినల్)కు పట్టుబడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... బచ్చోడు కేంద్రంగా ఓ ముఠా కొద్ది రోజులుగా రేషన్ బియాన్ని అక్రమంగా తరలిస్తోంది. వైరా ప్రాంతానికి చెందిన ఎక్కిరాల కృష్ణ అనే వ్యాపారి ఇక్కడ కొందరు ఏజెంట్లను నియమించుకుని ఈ దందాకు పాల్పడుతున్నాడు. బంధంపల్లి గ్రామానికి చెందిన బోడ నరేష్ వ్యాపారికి సహకరిస్తుంటాడు. కొంతకాలం నుంచి నమ్మకంగా పనిచేస్తున్న నరేష్‌కు.. వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూళ్లు చేయాలనే తలంపు వచ్చింది. ఆదివారం రాత్రి బచ్చోడులో 11 క్వింటాళ్ల బియ్యాన్ని వ్యాన్‌లో లోడ్ చేసుకుని వస్తున్నారు. నరేష్ కూడా అదే వ్యాన్లోనే ఉన్నాడు. ఇదే అదనుగా భావించి తన గ్రామానికే చెందిన నాగరాజు అనే వ్యక్తి సమాచారం ఇచ్చారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పి వ్యాన్ని నిలిపివేసి డబ్బులు డిమాండ్ చేయాలని చెప్పాడు. దీంతో నాగరాజు, బీరోలు గ్రామానికి చెందిన చిలకబత్తిని రవి, సురేష్, దామళ్ల నవీన్, గుడివాడ సాయిలను సంప్రదించి తమ ప్లాన్ చెప్పాడు. అందరూ కలిసి వెళ్లి ఏలువారిగూడెం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్ద వ్యాన్ని నిలిపివేశారు. తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమంటూ రూ. 80 వేలు డిమాండ్ చేశారు. దీంతో వ్యాన్ డ్రైవర్ ఓనర్ కృష్ణకు విషయం వివరించడంతో.. ఆయన వచ్చి రూ.3 వేలు ఇవ్వజూపి బేరమాడసాగాడు. మరోవైపు అసలు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన ఖమ్మం టాస్క్‌ఫోర్స్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బోడ నరేష్, నాగరాజు, చిలకబత్తిని రవి, సురేష్లను అదుపులోకి తీసుకున్నారు. దామళ్ల నవీన్, గుడివాడ సాయి అనే ఇద్దరు నిందితులు పరారయ్యారు. కాగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యాన్‌తో పాటు నలుగురు నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు. బియ్యం వ్యాపారి ఎక్కిరాల కృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బియ్యం తరలిస్తున్న వ్యాపారిపై కూడా కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
ఇంటి దొంగలు
మార్టూరు: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి ఆకలి దప్పులు తీర్చడం కోసం ఏళ్ల నుంచి ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా పప్పు, బియ్యం, చింతపండు వంటి కనీస అవసరాలు సరఫరా చేస్తున్నాయి. గతంలో తొమ్మిది రకాల వస్తువులు పంపిణీ చేసే వారు. ప్రస్తుత ప్రభుత్వం రెండు మూడు రకాల వస్తువులు పంపిణీ చేస్తూ వాటిని కూడా కార్పొరేట్ సంస్థల చేతిలో పెట్టే దిశగా ప్రయత్నిస్తోంది. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం లోపభూయిష్టంగా మారి అక్రమార్కులకు లాభాల పంట పండిస్తోంది. మండల కేంద్రం మార్టూరు కూరగాయల మార్కెట్ ఆవరణలో నిత్యావసరాల గిడ్డంగి ఉంది. దీన్ని మండల లెవెల్ స్టాక్ పాయింట్ (ఎంఎల్ఎస్)..అని అంటారు. ఇక్కడి నుంచి మార్టూరు, యద్దనపూడి, బల్లికురవ మండలాల్లోని 107 రేషన్ షాపులకు నెలకు 10 వేల బస్తాలు (50 కేజీల బియ్యం) సరఫరా చేస్తారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం పూర్తిస్థాయిలో రేషన్ షాపులకు సరఫరా కావడం లేదు. ఇదే విషయం విజిలెన్స్ అధికారుల తనిఖీలో వెల్లడైంది. 107 రేషన్ షాపులకు సంబంధించి సగటున నెలకు 2 వేల బియ్యం బస్తాలు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి నేరుగా అద్దంకిలోని రైస్ మిల్లులకు చేరుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ లావాదేవీల్లో రేషన్ షాపు నిర్వాహకుడికి కేజీ బియ్యం 8 రూపాయల చొప్పున 50 కేజీల బస్తాకు 400 రూపాయలు గిట్టుబాటు అవుతున్నట్లు సమాచారం. గిడ్డంగి నిర్వాహకులకు కేజీకి రెండు రూపాయలుపోగా 5 రూపాయలు లాభం కలుపుకుని అక్రమ వ్యాపారులు కేజీ 15 రూపాయల చొప్పున మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఇక్కడ జరిగే మాయాజాలం తెలిసి అధికారుల కళ్లు బైర్లుగమ్మాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన కొద్దిమంది మిల్లర్లకు ధాన్యం సరఫరా చేస్తారు. ఆ మిల్లర్లే రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేస్తారు. ఈ మిల్లులనే క్లస్టర్ మిల్ రైస్ (సీఎంఆర్) అని పిలుస్తారు. ఈ సీఎంఆర్‌లకు ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యాన్ని మిల్లర్లు బహిరంగ మార్కెట్లో విక్రయించి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన రేషన్ బియాన్ని మరుసటి నెలలో అదే ఎంఎల్ఎస్ పాయింట్‌కు సరఫరా చేయడం విశేషం. ఈ అక్రమ వ్యాపార లావాదేవీలతో నెలకు రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు సమాచారం. వ్యాపారుల సిండికేట్ అద్దంకిలోని కొందరు వ్యాపారులు సిండికేట్‌గా మారి అక్రమ వ్యాపారం నిర్వహిస్తుండగా అద్దంకి అధికార పార్టీ నాయకుడి అనుచరుడి ఒకరికి ప్రభుత్వం అండకోసం కొంత వాటా ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత మంగళవారం విజిలెన్స్ ఇన్స్పెక్టర్ అజయ్‌కుమార్ తన సిబ్బందితో రెండి బృందాలుగా ఏర్పడి నిర్వహించిన దాడిలో వలపర్ల సమీపంలోని 60 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడగా అద్దంకి ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు మార్టూరు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం అద్దంకిలోని ఓ రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో స్థానిక ఎంఎల్ఎస్ పాయింట్‌ను అదే రోజు తనిఖీ చేసిన అధికారులు రేషన్ బస్తాల నిల్వలు సక్రమంగానే ఉండటంతో ఖంగుతిన్నారు. అనుమానం వచ్చిన అధికారులు ముందు రోజు అంటే గత సోమవారం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఏయే రేషన్ షాపులకు బియ్యం పంపిణీ నిర్వహించారో ఆ రూట్ మ్యాప్ తీసుకుని వలపర్ల, మార్టూరులోని రేషన్ దుకాణాలతో తనిఖీలు నిర్వహించగా అసలు విషయం బయట పడింది. ఒక్కో రేషన్ షాపులో 15 నుంచి 20 బస్తాల బియ్యం తరగతులను గుర్తించిన అధికారులు ఆ బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి నేరుగా మిల్లర్లకు చేరుతున్నట్లు నిర్ధారించుకుని సదరు మిల్లుపై కూడా దాడులు నిర్వహించిన అధికారులు 30 బస్తాల అక్రమ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ వ్యాపారానికి జిల్లా పౌర సరఫరాల శాఖ ముఖ్య ఉద్యోగి ఒకరి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి మార్టూరులో నెలకు వేలాది బస్తాల అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం నిర్వహించే ఓ మహిళ నుంచి నెలకు 10 వేల రూపాయల చొప్పున మామూళ్లు తీసుకుంటున్నట్లు సంబంధిత శాఖలోనే గుసగుసలు వినిపిస్తుండటం విశేషం. విజిలెన్స్ శాఖ జిల్లా అధికారిగా ఏఎస్పీ రజని పదవీ బాధ్యతలు చేపట్టాక అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్న మైనింగ్ వ్యాపారులు, బియ్యం వ్యాపారులపై విస్తృత దాడులు నిర్వహించడంతో ప్రస్తుతం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు సమాచారం. మరింత సమర్థంగా దాడుల నిర్వహించి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
ఉంగుటూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బుధవారం ఉంగుటూరు టోల్‌గేటు వద్ద అధికారులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కైకరం గ్రామానికి చెందిన కామన శ్రీనివాస్, విజయ త్రిమూర్తులు మినీ వ్యాన్‌లో 42 బస్తాల రేషన్ బియ్యాన్ని తాడేపల్లిగూడెం తరలిస్తుండగా ఉంగుటూరు వద్ద పట్టుకున్నట్టు చేబ్రోలు ఎస్సై తాడి నాగ వెంకటరాజు తెలిపారు. బియ్యాన్ని ఉంగుటూరు సివిల్ సప్లయీస్ డీటీ జయశ్రీకి అప్పగించారు. కామన శ్రీనివాస్ పరారీలో ఉండగా విజయ త్రిమూర్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామన్నారు. -
15 టన్నుల రేషన్ బియ్యం సీజ్
పెదకాకాని, న్యూస్‌లైన్: అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు బుధవారం అర్ధరాత్రి దాడిచేసి పట్టుకున్నారు. ఆటోనగర్ నుండి చిత్తూరు జిల్లా బి కొత్తకోట తరలి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం లారీని సీజ్ చేశారు. ఆ వివరాలను గురువారం విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి విలేకరులకు వివరించారు. సుమారు 15 టన్నుల రేషన్ బియ్యం తరలించడానికి లారీ సిద్ధంగా ఉందని సమాచారం అందడంతో విజిలెన్స్ సీఐ కిషోర్ సిబ్బందితో ఆటోనగర్ చేరుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు. లారీ డ్రైవర్ శంకరరెడ్డి, క్లీనర్ బాషాలను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన కొల్లిపర సుబ్బారావు, శ్రీనగర్‌కు చెందిన అనీల్, సాదు ప్రసాద్ సిండికేట్‌గా ఏర్పడి గుంటూరు నగరంలోని పలు డీలర్ల నుండి రేషన్ బియ్యం సేకరించి వాటిని వేరే గోతాలకు మార్చి ఆటోనగర్‌కు చేర్చడం, అక్కడి నుండి చెన్నై, కర్ణాటకలకు తరలిస్తున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్ లతో పాటు సుబ్బారావు, అనిల్, ప్రసాద్‌లపై 420 కేసు నమోదు చేస్తామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. దాడులలో విజిలెన్స్ ఎస్ఐ షేక్ ఖాశిం సైదా, సిబ్బంది పాల్గొన్నారు. దాచేపల్లిలో 200 బస్తాలు దాచేపల్లి: దాచేపల్లిలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 200 బస్తాల రేషన్‌బియ్యాన్ని విజిలెన్స్అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. మందపాటి నరసింహారావు, చందు, హమీమ్, సీతరామయ్య, శ్రీహరి నెలకు రూ.200కు చెంచమ్మ అనే వృద్ధురాలి ఇల్లు అద్దెకు తీసుకొని బియ్యం నిల్వ చేశారని విజిలెన్స్ ఎస్ఐ షేక్ ఖాసీంసైదా చెప్పారు. ఈ ఐదుగురిపై 6ఎ కేసు, క్రిమినల్ కేసులు నమోదుచేశామన్నారు.