అర్ధరాత్రి నకిలీ టాస్క్‌ఫోర్స్‌.. | Fake Task Force Police Were Arrested In Khammam | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి నకిలీ టాస్క్‌ఫోర్స్‌..

Published Tue, Oct 1 2019 10:32 AM | Last Updated on Tue, Oct 1 2019 10:32 AM

Fake Task Force Police Were Arrested In Khammam - Sakshi

పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన వ్యాన్‌

సాక్షి, తిరుమలాయపాలెం: మండల పరిధిలోని బచ్చోడు నుంచి ఆదివారం అర్ధరాత్రి అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్నారు. ఇదే అదునుగా బియ్యం తరలిస్తున్న ముఠాలోని వ్యక్తే, మరికొందరు కలిసి నకిలీ పోలీసుల అవతారమెత్తాడు. బియ్యం వ్యాపారిని రూ. 80 వేలు డిమాండ్‌ చేశారు. చివరకు ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌(ఒరిజినల్‌)కు పట్టుబడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... బచ్చోడు కేంద్రంగా ఓ ముఠా కొద్ది రోజులుగా రేషన్‌ బియాన్ని అక్రమంగా తరలిస్తోంది. వైరా ప్రాంతానికి చెందిన ఎక్కిరాల కృష్ణ అనే వ్యాపారి ఇక్కడ కొందరు ఏజెంట్లను నియమించుకుని ఈ దందాకు పాల్పడుతున్నాడు. బంధంపల్లి గ్రామానికి చెందిన బోడ నరేష్‌ వ్యాపారికి సహకరిస్తుంటాడు. కొంతకాలం నుంచి నమ్మకంగా పనిచేస్తున్న నరేష్‌కు.. వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూళ్లు చేయాలనే తలంపు వచ్చింది. ఆదివారం రాత్రి బచ్చోడులో 11 క్వింటాళ్ల బియ్యాన్ని వ్యాన్‌లో లోడ్‌ చేసుకుని వస్తున్నారు. నరేష్‌ కూడా అదే వ్యాన్‌లోనే ఉన్నాడు. ఇదే అదనుగా భావించి తన గ్రామానికే చెందిన నాగరాజు అనే వ్యక్తి సమాచారం ఇచ్చారు.

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమని చెప్పి వ్యాన్‌ని నిలిపివేసి డబ్బులు డిమాండ్‌ చేయాలని చెప్పాడు.  దీంతో నాగరాజు, బీరోలు గ్రామానికి చెందిన చిలకబత్తిని రవి, సురేష్, దామళ్ల నవీన్, గుడివాడ సాయిలను సంప్రదించి తమ ప్లాన్‌ చెప్పాడు. అందరూ కలిసి వెళ్లి ఏలువారిగూడెం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్ద వ్యాన్‌ని నిలిపివేశారు. తాము టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమంటూ రూ. 80 వేలు డిమాండ్‌ చేశారు. దీంతో వ్యాన్‌ డ్రైవర్‌ ఓనర్‌ కృష్ణకు విషయం వివరించడంతో.. ఆయన వచ్చి రూ.3 వేలు ఇవ్వజూపి బేరమాడసాగాడు. మరోవైపు అసలు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బోడ నరేష్, నాగరాజు, చిలకబత్తిని రవి, సురేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. దామళ్ల నవీన్, గుడివాడ సాయి అనే ఇద్దరు నిందితులు పరారయ్యారు. కాగా రేషన్‌ బియ్యం తరలిస్తున్న వ్యాన్‌తో పాటు నలుగురు నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు. బియ్యం వ్యాపారి ఎక్కిరాల కృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బియ్యం తరలిస్తున్న వ్యాపారిపై కూడా కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement