అక్రమాలకు గ్రీన్‌సిగ్నల్ | Green signal to illegality | Sakshi
Sakshi News home page

అక్రమాలకు గ్రీన్‌సిగ్నల్

Published Wed, Jun 25 2014 12:41 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

Green signal to illegality

- ఇసుక మాఫియా విజృంభణ
- పోలీసులకు కాసుల వర్షం

 వికారాబాద్: పశ్చిమరంగారెడ్డి జిల్లా పరిధిలో ఇసుకమాఫియా పోలీసులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇసుక అక్రమరవాణాతో పాటు నల్లబజారుకు రేషన్‌బియ్యం తరలింపునకు సైతం కొందరు పోలీసు అధికారులు ఆశీస్సులు అందించి అందిన కాడికి దండుకుంటున్నారు. పరిగి డివిజన్ నుంచి నిత్యం 60-70 లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను తరలించుకుపోతున్నారు. అలాగే తండూరు సబ్‌డివిజన్‌లో 45నుంచి 69,  వికారాబాద్ సబ్‌డివిజన్‌లో 20నుంచి 50లారీల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. తద్వారా ప్రభుత్వానికి రావాల్సిన లక్షలాది రూపాయల రాయల్టీకి గండిపడుతోంది.

ఈ అక్రమ వ్యాపారంలో సంహభాగం పోలీసు అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు. ఏడాది క్రితం ఎస్పీ బి.రాజకుమారి చేపట్టిన కఠిన చర్యల వల్ల ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ పడినా గత ఆరునెలలుగా మళ్లీ ఊపిరిపోసుకుంది. తాండూరు పరిధిలోని యాలాల్  మొదలు కొని మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌సాగర్,కర్నాటక ప్రాంతం, గండేడ్ మండలం రుసుంపల్లి,రంగారెడ్డిపల్లి, పెద్ద వార్వాల్, సాలార్‌నగర్ వాగులనుంచి పరిగి మండలం ఇబ్రహింపూర్,గడిసింగాపూర్,రంగంపల్లిల నుంచి ఫిల్టర్ ఇసుకను యథేచ్ఛగా తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నారు.

ఇసుక లారీలనుంచి డబ్బు వసూళ్లకు ముగ్గురు పోలీసులు ప్రత్యేకంగా  పనిచేస్తున్నారన్న ఆరోపణలు సర్వత్ర వినిపిస్తున్నాయి. రెగ్యులర్‌గా నడిచే ఇసుక లారీల నుంచి నెలకు  ఇంతని వసూలు చేస్తున్నారు.అదే విధంగా కొత్తగా రవాణ చేసే లారీల వద్ద అయితే అదును బట్టి ఐదు వేల  నుంచి ఎనిమిది  వేల రూపాయల వరకు వ సూలు చేస్తున్నట్లు  సమాచారం.  

గతంలో ఈ వ్యవహరం డీఐజీ వరకు వెళ్లింది.అప్పట్లో ఇక్కడి పోలీసు అధికారులకు నోటీస్‌లు జారీ చేయగా వారు సంజాయిషీ ఇచ్చుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ తంతు ఒక పరిగికే కాదు, ఇటు తాండూరుతో పాటు వికారాబాద్‌లో కూడా కొనసాగుతున్నట్లు తెలిసింది. ఎక్కువగా పరిగి,తాండూరు ప్రాంతల్లో ఇసుక అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా పోలీసుల అండదండలతో కొనసాగుతున్నట్లు వినికిడి.
 
దేనికైనా సై
పరిగి పోలీసులు అక్రమ సంపాదన కోసం దేనికైనా బరితెగిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.  అక్రమ రవాణ కేవలం ఒక ఇసుకకే పరిమితం కాలేదు.నల్లబజారుకు రేషన్ బియ్యాన్ని సైతం పోలీసుల అండదండలతో తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. .పరిగి కే ంద్రంగా అక్రమ బియ్యం వ్యాపారం జోరుగా  కొనసాగుతోంది .

ఈ వ్యాపారంపై   పోలీసులు నెలకు రూ.50 వేలు మొదలు కొని లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. పరిగి మీదుగా అక్రమ మార్గాన  సరుకును తరలించే  వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పోలీసులు తాత్కాలిక చెక్‌పోస్టులు ఏ ర్పాటు చేసి రాత్రి పూట వసూళ్లకు  పాల్పడుతున్నారని చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement